Donald Trump: ఇక సర్వ నాశనమే..ఇరాన్‌కు డోనాల్డ్ ట్రంప్ మాస్ వార్నింగ్

Donald Trump: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

Update: 2026-08-18 01:21 GMT

Donald Trump

Donald Trump: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి.అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ విషయంలో తన కఠిన వైఖరిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఇరాన్ అణు సామర్థ్యం సాధించకుండా నిరోధించడమే తమ విదేశాంగ విధానంలో అత్యంత కీలక అంశమని కుండబద్దలు కొట్టారు. ఎంత సమయమైనా వేచి చూసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఒప్పందం కోసం తమకేమీ తొందర లేదని వ్యాఖ్యానించారు. ఇరాన్ లోపల తీవ్ర నిరసనలు, ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయని, త్వరలోనే ఆ దేశం లొంగిపోక తప్పదని సంకేతాలు ఇచ్చారు.

ఒకవైపు కఠిన హెచ్చరికలు జారీ చేస్తూనే, మరోవైపు తెరవెనుక సంప్రదింపుల తలుపులు తెరిచే ఉంచినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ విప్లవాత్మక గార్డ్ అధికారులతో బ్యాక్‌ఛానల్ చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇదే క్రమంలో దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఒమన్ దేశానికి ట్రంప్ ఊహించని షాక్ ఇచ్చారు. అమెరికా ప్రయత్నాలకు ఒమన్ అడ్డుపడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధి ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య ప్రధాన ఘర్షణ కేంద్రంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్, గ్యాస్‌లో సింహభాగం ఈ సముద్ర మార్గం గుండానే వెళ్తుంది. ఈ ప్రాంతంలో ఇరాన్ ఆధిపత్యాన్ని చెరిపేసి, దానిని తమ నియంత్రణలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. మరోవైపు ఇరాన్ సైతం తన సార్వభౌమత్వాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో సముద్ర మార్గంలో సైనిక మోహరింపు పెరిగి గందరగోళం నెలకొంది.

ఈ ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా గ్లోబల్ ఎకానమీని సైతం భయపెడుతున్నాయి. ఒకవేళ హార్ముజ్ జలసంధి మూతబడితే అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అమెరికా వైఖరిపై ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందోనని ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళనతో గమనిస్తున్నాయి.

Tags:    

Similar News