Trump vs Iran: పాక్ ద్వారా ఇరాన్ కు ట్రంప్ ప్రతిపాదన..ఇది జరిగే పనేనా?
Trump vs Iran: యుద్ధాన్ని ఆపడానికి 15 సూత్రాల శాంతి ప్రతిపాదనను ఇరాన్ కు ట్రంప్ పంపించారని చెబుతున్నారు. ఆ ప్రతిపాదనలు ఇరాన్ అంగీకరిస్తుందా అనేదే అసలు ప్రశ్న!
Trump vs Iran
Trump vs Iran: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 15 సూత్రాల శాంతి ప్రతిపాదనను ఇరాన్ ముందుంచారని అంతర్జాతీయ మీడియాలో వాటాలు వస్తున్నాయి. ఇందులో ఒక నెల కాల్పుల విరమణ, ఇరాన్ అణు కార్యక్రమంపై నియంత్రణలు, ప్రాక్సీ గ్రూపులకు (హమాస్, హిజ్బుల్లా) మద్దతును నిలిపివేయడం,హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వంటివి ఉన్నాయి. దీనికి ప్రతిగా, ఇరాన్‌పై పాక్షిక ఆంక్షలను ఎత్తివేయడానికి, ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో పౌర అణుశక్తి కార్యక్రమాన్ని ఆమోదించడానికి అమెరికా సిద్ధంగా ఉంది. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, ఈ ప్రతిపాదన పాకిస్థాన్‌లోని ఒక మధ్యవర్తి ద్వారా ఇరాన్‌కు చేరింది. ట్రంప్, ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ పోస్ట్‌ను ట్రూత్ సోషల్‌లో పంచుకున్నారు.
ఇరు దేశాల మధ్య చర్చలు జరిపేందుకు ఇస్లామాబాద్ సిద్ధంగా ఉందని అందులో పేర్కొన్నారు . వచ్చే వారం ప్రారంభమయ్యే ఈ చర్చల్లో అమెరికా తరఫున స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొనవచ్చు. ఇరాన్ సైనిక వ్యవస్థను, క్షిపణి సామర్థ్యాలను నిర్మూలించాలని కూడా ఈ ప్రతిపాదన కోరుతోంది. తాను సృష్టించిన ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ మద్దతు ఇవ్వడం ఆపాలని కూడా ఇది డిమాండ్ చేస్తోంది. అణుశక్తి కేంద్రాలు ఇరాన్ వెలుపల ఉండాలనే డిమాండ్ కూడా అమెరికా చేసింది.
హోర్ముజ్ జలసంధిని తెరవాలని కూడా ఇరాన్ ను అమెరికా డిమాండ్ చేసింది. దానికి ప్రతిగా, ఆంక్షల నుండి పాక్షిక ఉపశమనం, ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో పౌర అణు కార్యక్రమం, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఆర్థిక సహాయం అందించడానికి అమెరికా సిద్ధంగా ఉంది. దౌత్యవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ షరతులు పూర్తిగా ఏకపక్షంగా ఉన్నాయి. కాబట్టి, ఇరాన్ వాటిని అంగీకరించే అవకాశం లేదు.
మరో 3000 మంది సైనికులు
అమెరికా ఆకస్మిక కాల్పుల విరమణ ప్రతిపాదనతో ఇజ్రాయెల్ అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. యుద్ధం కొనసాగాలని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఒకవైపు దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతుండగా, పెంటగాన్ ఆ ప్రాంతంలో సుమారు 3,000 మంది అదనపు సైనికులను మోహరిస్తోంది. ప్రస్తుతం, మధ్యప్రాచ్యంలో సుమారు 50,000 మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. సైనిక పరిణామాలు పెరిగితే గల్ఫ్‌లో మందుపాతరలు పాతుతామని ఇరాన్ హెచ్చరించింది.
ఒప్పుకుంటే అది ఇరాన్ కు ఓటమే!
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ 15-సూత్రాల కార్యక్రమం ఏమాత్రం కొత్తది కాదు. అమెరికా 2025 మే నెలలో ఇలాంటి ప్రతిపాదననే చేసింది. కానీ అప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసింది. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలపై ఆంక్షలు. యురేనియం నిల్వలను ఎగుమతి చేయడం కూడా గత ప్రతిపాదనలో ఉన్నాయి. ఇరాన్ ఈ షరతులను అంగీకరిస్తే, అది దాని ఓటమి అవుతుంది. అణుబాంబు తయారు చేయాలన్న ఇరాన్ ఆశయానికి, బాలిస్టిక్ క్షిపణుల పరిధిని పెంచుకోవడానికి వ్యతిరేకంగానే అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం జరిగింది. అందువల్ల, ఈ షరతులను అంగీకరిస్తే, అది ఇరాన్‌కు ఒకరకమైన ఓటమి అవుతుందనేది నిపుణుల అభిప్రాయం.