Russia Ukraine Ceasefire 2026: కాల్పుల విరమణకు రష్యా ప్రతిపాదన...భయంతోనే వెనక్కి తగ్గిందన్న ఉక్రెయిన్
గత నాలుగేళ్లుగా రక్తపాతంతో తడిసిముద్దవుతున్న రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఒక్కసారిగా కాల్పుల విరమణ ప్రకటనలు వెలువడటం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Russia Ukraine Ceasefire 2026: గత నాలుగేళ్లుగా రక్తపాతంతో తడిసిముద్దవుతున్న రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఒక్కసారిగా కాల్పుల విరమణ ప్రకటనలు వెలువడటం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, ఈ శాంతి ప్రతిపాదనల వెనుక మానవత్వం కంటే వ్యూహాత్మక భయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా మే 9న జరిగే విజయ దినోత్సవం కోసం కాల్పులు ఆపాలని చూస్తుంటే, ఉక్రెయిన్ అంతకంటే ముందే మే 5 నుంచే శాంతి మంత్రాన్ని పఠిస్తోంది.
రష్యా ‘విజయ’ భయం.. ఉక్రెయిన్ విమర్శలు
రష్యా తన దేశ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 81వ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాస్కోలో భారీ పరేడ్ నిర్వహించ తలపెట్టింది. మే 8-9 తేదీల్లో రష్యా కాల్పుల విరమణ ప్రకటించడం వెనుక శాంతి కంటే భయమే ఎక్కువగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విమర్శిస్తున్నారు. ఇక ఈసారి మాస్కో పరేడ్‌లో రష్యా యుద్ధ ట్యాంకులు, భారీ సైనిక సామాగ్రిని ప్రదర్శించడం లేదు. ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తుందనే భయంతోనే పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ బెదిరింపులపై మాస్కో గట్టిగానే స్పందించింది. ఒకవేళ ఉక్రెయిన్ దాడులకు దిగితే కీవ్ నగరంపై భారీ క్షిపణి దాడులు చేస్తామని రష్యా రక్షణ శాఖ హెచ్చరించడం ఉద్రిక్తతను పెంచుతోంది. ఉద్రిక్తతల మధ్య విజయ దినోత్సవం ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
ముందుగానే స్పందించిన ఉక్రెయిన్
రష్యా మే 8న విరమణ పాటిస్తామని చెబితే, ఉక్రెయిన్ అంతకంటే ముందే అంటే మే 5వ తేదీ అర్ధరాత్రి నుంచే కాల్పుల విరమణ అమలులోకి వస్తుందని ప్రకటించింది. "వార్షికోత్సవం కంటే కూడా మనిషి ప్రాణం విలువైంది" అంటూ జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు సామాన్య ప్రజల ఆలోచనలకు ప్రతిరూపంగా నిలిచాయి. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కోట్లాదిమంది సామాన్యులపై ప్రభావం చూపింది. అందమైన ఉక్రెయిన్ కళావిహీనంగా మారిపోయింది.
యుద్ధ గణాంకాలు
2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం సుదీర్ఘకాలంపాటు కొనసాగింది. ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరప్‌లో అతిపెద్ద రక్తపాతం కలిగించిన యుద్ధంగా పేరొందింది. రెండు వైపులా వేలాదిమంది సైనికులు, పౌరులు మరణించారు. లక్షలాదిమంది ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. అయితే, ఇటీవల ట్రంప్ పుతిన్‌కు ఫోన్ చేసి సుమారు గంటన్నర సమయం పాటు మాట్లాడారు. ఈ చర్చల తరువాత పుతిన్ కాల్పుల విరమణ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారు.
ఈ తాత్కాలిక కాల్పుల విరమణ సుదీర్ఘకాలంపాటు కొనసాగుతుందా లేదా అన్నది అందరిలోనూ నెలకొన్న సందేహం. శాంతికి దారితీస్తే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం రెండు దేశాలు తిరిగి బలోపేతం కావడానికి మాత్రమే ఈ విరామం తీసుకుంటున్నారని, సైనికంగా, ఆర్థికంగా బలోపేతం అయ్యాక మరలా యుద్ధం ప్రారంభం కావొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల ప్రజలు కోరుకుంటున్నది ఒక్కటే.. క్షిపణుల మోత ఆగి, సాధారణ జీవితం మళ్లీ మొదలవ్వాలని. ఒక దేశం భయంతోనో, మరో దేశం మానవత్వంతోనో తీసుకున్న ఈ నిర్ణయం చివరకు సామాన్యుడి ప్రాణాలను కాపాడితే అదే పెద్ద విజయం.