Hormuz Crisis : అమెరికా-ఇరాన్ మధ్య ముదిరిన ముసలం.. ట్రంప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
Hormuz Crisis : హోర్ముజ్ జలసంధిలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. యూఏఈపై క్షిపణి దాడుల నేపథ్యంలో ట్రంప్ ప్లాన్‌ను ఇరాన్ వ్యతిరేకించింది. ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి.
Hormuz Crisis
Hormuz Crisis : ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వేదికగా మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు మిసైల్ దాడుల వరకు వెళ్లడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ పై ఇరాన్ నిప్పులు చెరిగింది. ఈ నేపథ్యంలో అరేబియా సముద్ర తీరంలో అసలు ఏం జరుగుతుందో చూద్దాం.
హోర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న వాణిజ్య నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని, తమ సైన్యం పర్యవేక్షణలో వాటిని బయటకు పంపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ప్రకటించారు. అయితే దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా స్పందించారు. సైనిక బలంతో ఏ సమస్యనూ పరిష్కరించలేరని, ఇది ప్రాజెక్ట్ ఫ్రీడమ్ కాదు.. ఒక డెడ్‌లాక్ (చిక్కుముడి) అని కొట్టిపారేశారు. అమెరికా చట్టవిరుద్ధంగా నిషిద్ధ ప్రాంతాల్లోకి చొచ్చుకురావడమే ఈ ఉద్రిక్తతలకు కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది.
ఇరాన్ నుంచి యూఏఈ వైపు 12 బాలిస్టిక్ మిసైళ్లు, 3 క్రూయిజ్ మిసైళ్లు, పలు డ్రోన్లు దూసుకువచ్చాయి. యూఏఈ రక్షణ వ్యవస్థ వీటిని విజయవంతంగా గాలిలోనే అడ్డుకుంది. అయితే, ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీ జోన్ సమీపంలో జరిగిన దాడుల వల్ల మంటలు చెలరేగి, అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయ పౌరులు గాయపడ్డారు. ప్రస్తుతం వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం టచ్‌లో ఉంటూ క్షతగాత్రులకు అండగా నిలుస్తోంది.
ఈ దాడులపై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ప్రస్తుతానికి దీనిని కాల్పుల విరమణ (సీజ్ ఫైర్) ఉల్లంఘనగా పరిగణించడం లేదని పేర్కొన్నారు. దాడులు పెద్ద ఎత్తున జరగలేదని, మిసైళ్లను గాలిలోనే కూల్చివేశామని ఆయన చెప్పారు. అయితే ఇరాన్ ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని, కాల్పుల విరమణను కొనసాగించడం ఇరాన్ భవిష్యత్తుకే మంచిదని ఆయన హెచ్చరించారు. మరోవైపు, ఫుజైరాపై తాము ఎలాంటి ముందస్తు దాడి ప్లాన్ చేయలేదని ఇరాన్ మిలిటరీ అధికారులు చెప్తుండటం గమనార్హం.
హోర్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచానికి అవసరమైన చమురులో దాదాపు 20 శాతం రవాణా అవుతుంది. ఇక్కడ ఏ చిన్న ఘర్షణ జరిగినా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతాయి. ప్రస్తుతం పాకిస్థాన్ సహకారంతో చర్చలు జరుపుతున్నామని, యుద్ధం కాకుండా దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని అరాగ్చీ తెలిపారు. కానీ అమెరికా తన సైనిక కార్యకలాపాలను ఆపకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.