Identical Quadruplets: వైద్య చరిత్రలో అద్భుతం... ఒకే అండం నుంచి నలుగురు ట్విన్స్ జననం
ఆస్ట్రేలియాలో వైద్య రంగంలో అదరుదైన అద్భుతం చోటుచేసుకుంది. ఒకే ఫలదీకరణ చెందిన అండం నాలుగుగా విడిపోవడంతో ఒకే పోలికలతో నలుగురు ఆడపిల్లలు జన్మించారు.
Identical Quadruplets: వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన, దాదాపు 1 కోటి 50 లక్షల కేసుల్లో ఒకటిగా నిలిచే అద్భుత ఘట్టం ఆస్ట్రేలియాలో ఆవిష్కృతమైంది. ఒకే ఒక్క ఫలదీకరణ చెందిన అండం నాలుగు భాగాలుగా విడిపోయి, ఒకే పోలికలతో ఉన్న నలుగురు ఆడపిల్లలు ఒకే ప్రసవంలో జన్మించారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరానికి చెందిన 34 ఏళ్ల జెనిటార్ నామోనా అనే మహిళ జూలై 14న రాయల్ బ్రిస్బేన్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌లో సిజేరియన్ ద్వారా నలుగురు శిశువులకు జన్మనిచ్చారు. సహజ సిద్ధంగా గర్భం దాల్చి, ఒకే రకమైన పోలికలతో నలుగురు పిల్లలు పుట్టడం ఆస్ట్రేలియా చరిత్రలోనే తొలిసారని, ప్రపంచంలోనే ఇలాంటి కేసులు కేవలం రెండు మాత్రమే నమోదయ్యాయని వైద్యులు వెల్లడించారు.
అత్యంత ప్రమాదకరమైన గర్భం ... వైద్యుల ప్రతిభ
నలుగురు పాపలు ఎమిలీ, హ్యారియెట్, కేథరిన్, అలెక్సాలు ఒకే రక్తం, ఒకే మాయను పంచుకోవడం వల్ల ఈ గర్భం తల్లికి, పిల్లలకు అత్యంత ముప్పుతో కూడుకున్నదిగా మారింది. వైద్యులు ఈ గర్భాన్ని 28 వారాల 4 రోజుల వరకు విజయవంతంగా కొనసాగించారు. పగలు రాత్రి శ్రమించి ప్రసవాన్ని విజయవంతం చేసిన ప్రధాన వైద్యురాలు డాక్టర్ అలెక్సా బెండాల్ గౌరవార్థం, ఒక పాపకు 'అలెక్సా' అని పేరు పెట్టారు. ఇక జెనిటార్ దంపతులకు ఇప్పటికే ఒకటి నుంచి పదేళ్ల వయస్సు గల పిల్లలు నలుగురు ఉన్నారు. ఇప్పుడు ఒకేసారి మరో నలుగురు తోడవ్వడంతో ఆ కుటుంబంలో పిల్లల సంఖ్య ఎనిమిదికి చేరింది.
ఐసీయూలో శిశువులు ... ఆర్థిక సవాళ్లు
ప్రస్తుతం నలుగురు శిశువులు నవజాత శిశువుల ఇంటెన్సీవ్ కేర్ యూనిట్‌లో సురక్షితంగా ఉన్నారు. అయితే, ఈ నలుగురు పిల్లలతో కలిపి ఆ కుటుంబంలో మొత్తం ఎనిమిది మంది పిల్లలు కావడంతో వారికి అయ్యే పోషణ, వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోతాయి. దీంతో ఆ కుటుంబం దాతల సాయాన్ని కోరేందుకు ముందుకు వచ్చింది. కుటుంబ భారాన్ని తగ్గించుకునేందుకు గో ఫండ్ మీ అనే సంస్థను ఆశ్రయించారు. పోషణ, వైద్య ఖర్చులతో పాటు తమ అవసరాలకు ఉపయోగపడేలా పది నుంచి 12 సీట్ల సామార్థ్యం కలిగిన వాహనం కొనుగోలు చేసేందుకు ఆర్థికంగా చేయూతనివ్వాలని ఫండ్ రైజర్స్‌ని కోరుతున్నారు. ఒకేసారి నలుగురు ట్విన్స్ జన్మించారని ఆనందపడేలోపు... ఇలా ఆర్థికంగా భారం అవుతుందనే బాధ కూడా ఆ కుటుంబాన్ని భయపెడుతున్నది.