Dubai Job Crisis: వార్‌ ఎఫెక్ట్‌... గల్ప్‌లో పెరుగుతున్న నిరుద్యోగం

ఇరాన్‌ అమెరికా యుద్ధం గల్ఫ్‌ దేశాల ఉద్యోగాలపై భారీగా ప్రభావం చూపుతున్నది. గత నాలుగైదు నెలలుగా ఉద్యోగాలు పోయి...రోడ్డున పడి నానా అవస్థలు పడుతున్నారు.

Update: 2026-07-18 07:22 GMT

Dubai Job Crisis: లక్షల మంది విదేశీ వలస కార్మికులకు 'దుబాయ్' అంటే ఒకప్పుడు సరికొత్త జీవితాన్ని ఇచ్చే బంగారు బాతు. కానీ, నేడు అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు, యుద్ధ మేఘాలు ఆ గల్ఫ్ కలలను పూర్తిగా కనుమరుగు చేస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి, ఇరాన్‌కు మధ్య సాగుతున్న భయంకరమైన యుద్ధ ప్రభావం గల్ఫ్ ప్రాంతాన్ని తాకడంతో దుబాయ్‌లో నిరుద్యోగం కోరలు చాస్తోంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సరిహద్దులను తాకడంతో అక్కడ పర్యాటకం, విమానయానం, స్థానిక వ్యాపారాలు కుప్పకూలాయి. ఫలితంగా వేలాది మంది వలస కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి, జీతాలు తగ్గి, పూట గడవడమే కష్టంగా మారి వీధుల్లో తిరుగుతున్నారు. ఈ అంతర్జాతీయ సంక్షోభం వెనుక ఉన్న చేదు నిజాలను తెలుసుకుందాం.

వీధిన పడ్డ బతుకులు ... కంపెనీల తాళాలు

యుద్ధం తెచ్చిన ఆర్థిక మాంద్యం వలస కూలీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన జాయ్ వివాండా అనే డొమెస్టిక్ వర్కర్ గత నాలుగు నెలలుగా దుబాయ్ వీధుల్లో చేతిలో రెజ్యూమే పట్టుకుని ఇళ్ల చుట్టూ తిరుగుతోంది. ఆమె పనిచేసే అరబ్ కుటుంబం యుద్ధ భయంతో మార్చిలోనే దుబాయ్ వదిలి వెళ్ళిపోయింది. స్వదేశంలో ఉన్న నలుగురు పిల్లలను సాకాల్సిన ఆమెకు ఇప్పుడు ఇక్కడ రూపాయి ఆదాయం లేదు. మరోవైపు, భారతీయ అకౌంటెంట్ ముజీబ్ రెహమాన్ తను పనిచేసే క్యాటరింగ్ కంపెనీ మూతపడటంతో రోడ్డున పడ్డాడు. మార్కెట్లో క్యాష్ ఫ్లో లేకపోవడంతో యజమానులు జీతాలు ఇవ్వలేక చేతులెత్తేస్తున్నారు.

సర్వేల హెచ్చరికలు ... 2026 మూడో త్రైమాసికంపై ఆందోళన

పరిస్థితి తాత్కాలికమేనని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయి గణాంకాలు మాత్రం భయాందోళనలను కలిగిస్తున్నాయి. యూఏఈలోని 546 కంపెనీల అధినేతలపై జరిపిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి. ప్రతి నలుగురు యజమానులలో ఒకరు ఈ 2026 మూడో త్రైమాసికంలో ఉద్యోగులను తొలగించాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, దాదాపు మూడో వంతు కంపెనీలు కొత్తగా ఎవరినీ అపాయింట్‌మెంట్‌ చేసుకోకూడదని కూడా నిర్ణయించుకున్నట్టు సర్వేలో తేలింది.

సహాయ ప్యాకేజీలు ... ప్రభుత్వ వాదన

ఈ సంక్షోభం నుండి వ్యాపారాలను గట్టెక్కించడానికి యూఏఈ ప్రభుత్వం ఏకంగా 680 మిలియన్‌ డాలర్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఇది కేవలం తాత్కాలిక కుదుపు మాత్రమేనని, దుబాయ్ త్వరలోనే కోలుకుంటుందని అక్కడి ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్-మర్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య తాత్కాలికంగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడం, మళ్లీ దాడులు జరగడం దుబాయ్ భవిష్యత్తును మరింత అయోమయంలోకి నెట్టేసింది. భారతదేశానికి చెందిన వెంకట్ అనే హోటల్ కార్మికుడు ఏప్రిల్‌లోనే ఉద్యోగం పోయి ఊరికి తిరిగి వచ్చాడు. పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక అప్పులపాలవుతున్నాడు. ఇలా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ తెచ్చిన ఈ యుద్ధం, ఎక్కడో ఉన్న పేద వలస కార్మికుల పొట్ట గొడుతుండటం గమనార్హం. ఈ పరిణామాలు ఎటువైపుకు దారితీస్తాయో చూడాలి. 

Tags:    

Similar News