USA: అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు గట్టిదెబ్బ.. కొత్త వీసా నిబంధనలతో బిగ్ షాక్
USA: అమెరికాలో చదవుకుంటున్న విదేశీ విద్యార్థులకు కీలక మార్పులు రానున్నాయి.
USA: అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు గట్టిదెబ్బ.. కొత్త వీసా నిబంధనలతో బిగ్ షాక్
USA: అమెరికాలో చదవుకుంటున్న విదేశీ విద్యార్థులకు కీలక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై ఈ నిర్ణయం గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) విద్యార్థి వీసాలకు సంబంధించి కొత్త నిబంధనను ఖరారు చేసింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న "డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్" విధానాన్ని తొలగించి, దాని స్థానంలో నిర్దిష్ట కాలపరిమితి విధానాన్ని తీసుకురానుంది.
ఈ నిబంధన అమల్లోకి వస్తే F-1 విద్యార్థి వీసాతో అమెరికాకు వెళ్లే విద్యార్థులు సాధారణంగా నాలుగేళ్లు మాత్రమే అక్కడ ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత చదువు కొనసాగించాలంటే తప్పనిసరిగా DHS నుంచి గడువు పొడిగింపు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు ఉన్న విధానం ఏంటి?
ఇప్పటి వరకు అమెరికాలో F-1 వీసాపై చదువుకునే విద్యార్థులకు నిర్దిష్ట గడువు ఉండేది కాదు. వారు పూర్తి సమయ విద్యార్థులుగా (Full-Time Student) కొనసాగుతూ, వీసా నిబంధనలు పాటిస్తున్నంత కాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. దీనినే "డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్" విధానం అంటారు. కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత ఈ విధానం పూర్తిగా రద్దు కానుంది. ఇకపై వీసాపై నాలుగేళ్ల గడువు మాత్రమే ఉంటుంది. ఆ గడువు పూర్తయిన తర్వాత కూడా చదువు కొనసాగితే ముందుగానే పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి.
కొత్త నిబంధనలో ఏమేం మారుతున్నాయి?
కొత్త నిబంధన ప్రకారం F-1 విద్యార్థి వీసాలతో పాటు J-1 ఎక్స్చేంజ్ విజిటర్ వీసాలు, విదేశీ మీడియా ప్రతినిధులకు ఇచ్చే I వీసాలు కూడా నిర్దిష్ట కాలపరిమితితో జారీ చేస్తారు. అమెరికా ప్రభుత్వం ఈ మార్పుల ద్వారా వీసా వ్యవస్థపై మరింత పర్యవేక్షణ పెంచాలని, జాతీయ భద్రతను బలోపేతం చేయాలని భావిస్తోంది. అయితే విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు మాత్రం ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విదేశీ విద్యార్థుల్లో అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
భారతీయ విద్యార్థులపై ప్రభావం
అమెరికాలో ప్రస్తుతం చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఓపెన్ డూర్స్ 2024 నివేదిక ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాలో 3.31 లక్షలకుపైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో వీరి వాటా దాదాపు 30 శాతం. భారతీయ విద్యార్థులు ఎక్కువగా పీహెచ్‌డీ, పరిశోధన ఆధారిత మాస్టర్స్, వైద్య విద్య, ఇంజినీరింగ్ పరిశోధన, ఇతర ప్రత్యేక కోర్సులు చదువుతుంటారు. వీటిలో చాలా కోర్సులు నాలుగేళ్ల కంటే ఎక్కువ సమయం పడతాయి. అలాంటి విద్యార్థులు చదువు పూర్తయ్యేలోపు వీసా గడువు ముగిస్తే తప్పనిసరిగా DHS నుంచి పొడిగింపు పొందాల్సి ఉంటుంది.
గడువు ముగిస్తే ఏమవుతుంది? నిబంధనలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి?
కొత్త విధానంలో అత్యంత కీలకమైన అంశం ఇదే. వీసా గడువు పూర్తయ్యేలోపు పొడిగింపు పొందకపోతే విద్యార్థి అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్నట్లు (Unlawful Presence) పరిగణించే అవకాశం ఉంది. దరఖాస్తుల పరిశీలనలో ఆలస్యం, పత్రాల సమస్యలు లేదా ఇతర పరిపాలనా కారణాల వల్ల కూడా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నిబంధన వెంటనే అమల్లోకి రాదు. అమెరికా కాంగ్రెస్ సమీక్ష పూర్తైన తర్వాతే అమలు తేదీ ప్రకటిస్తారు. అప్పటి వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న "డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్" విధానమే కొనసాగుతుంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే అమెరికాలో ఉన్న లక్షలాది భారతీయ విద్యార్థులు తమ చదువు కాలపరిమితి, వీసా గడువు, పొడిగింపు ప్రక్రియపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.