Donald Trump : బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసు.. ఇజ్రాయెల్ ప్రధానిపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Donald Trump : వైట్ హౌస్‌లో బాస్ ఎవరో నెతన్యాహుకు బాగా తెలుసంటూ, త్వరలోనే ఇరు దేశాల అధినేతలు భేటీ కానున్నట్లు ప్రకటించారు.
Donald Trump
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వైట్ హౌస్‌లో తనతో సమావేశం కావడానికి సమయం కోరారని ట్రంప్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని చెబుతూనే.. ఇక్కడ బాస్ ఎవరో నెతన్యాహుకు బాగా తెలుసు అంటూ తన వైపు వేలు చూపించుకుంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే వారం లేదా ఆ పై వారంలో ఈ అగ్రనేతల భేటీ జరిగే అవకాశం ఉందని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ పర్యటన ఖరారైతే, గత ఫిబ్రవరిలో వైట్ హౌస్ సిట్యుయేషన్ రూమ్‌లో ఇరాన్‌పై ఉమ్మడి సైనిక చర్యల ప్రణాళికను చర్చించిన తర్వాత వీరిద్దరూ ముఖాముఖి కలుసుకోవడం ఇదే మొదటిసారి అవుతుంది.
అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ఈ ప్రతిపాదిత భేటీపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం (PMO) కూడా స్పందించింది. ప్రధాని నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడి, అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపినట్లు ధృవీకరించింది. ఈ చర్చల సందర్భంగా ప్రపంచ స్వేచ్ఛకు అమెరికానే గ్యారెంటర్ అని, రెండు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధానికి ఇజ్రాయెల్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని నెతన్యాహు పేర్కొన్నారు. త్వరలోనే అమెరికాలో ఇద్దరం భేటీ అవుదామని ఇరు నేతలు ఒక అవగాహనకు వచ్చారు. అయితే జూలై 7-8 తేదీల్లో నాటో సదస్సు కోసం ట్రంప్ టర్కీ పర్యటనలో బిజీగా ఉండటం వల్ల, ఈ సమావేశం జూలై రెండో వారంలో జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అధికారులు అంచనా వేస్తున్నారు.
నెతన్యాహుపై తీవ్ర అసంతృప్తితో ట్రంప్ సన్నిహిత వర్గాలు
బయటకు అంతా సవ్యంగానే ఉన్నట్లు కనిపిస్తున్నా, యుద్ధ విధానాలు, మిడిల్ ఈస్ట్ ప్రాంతీయ వ్యూహాలపై ట్రంప్, నెతన్యాహు మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్సియోస్ నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి నాటి సమావేశం తర్వాత ట్రంప్ ప్రధాన సలహాదారులు నెతన్యాహు వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నెతన్యాహు తీసుకున్న దాదాపు ప్రతి నిర్ణయం తప్పని అమెరికా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. గత నెలలో జరిగిన అంతర్గత సంభాషణల్లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడులను ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. నెతన్యాహును మాడ్ మ్యాన్ అని సంబోధించడమే కాకుండా, అమెరికా చేసిన సహాయానికి ఆయన కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ఒప్పందం
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, డొనాల్డ్ ట్రంప్ గత నెలలోనే ఇరాన్‌తో యుద్ధవిరామాన్ని పొడిగించేందుకు, కొత్త అణు చర్చలు ప్రారంభించేందుకు ఒక మైలురాయి లాంటి మెమోరాండంపై సంతకం చేశారు. అంతేకాకుండా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను పరిమితం చేసుకోవాలని, దక్షిణ లెబనాన్ నుండి సైన్యాన్ని ఉపసంహరించుకునే ఒప్పందం దిశగా అడుగులు వేయాలని నెతన్యాహుకు ట్రంప్ గట్టిగా సూచించారు. ఇజ్రాయెల్ దూకుడు వల్ల మిడిల్ ఈస్ట్‌లో శాంతి ప్రక్రియ దెబ్బతింటోందని అమెరికా భావిస్తోంది.
ఖమేనీ అంతిమ యాత్రపై ట్రంప్ డేగ కన్ను
మరోవైపు, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంతిమ యాత్రపై తాము నిశితంగా నిఘా ఉంచామని ట్రంప్ వెల్లడించారు. అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి ఆపరేషన్‌లోనే ఆయన హతమయ్యారని ట్రంప్ ఈ సందర్భంగా మరోసారి క్లెయిమ్ చేశారు. ఇరాన్ తమతో చర్చలు జరపడానికి బిచ్చమెత్తుకుంటోందని, అయితే అంత్యక్రియలు ముగిసే వరకు చర్చలు ఆపడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని చెప్పారు. ఖమేనీ అంతిమ యాత్రలో పాల్గొన్న నేతలందరూ ఒకే చోట ఉన్నారని, కేవలం ఒక్క షాట్‌తో వారందరినీ ఖతం చేయవచ్చని, కానీ అలా చేస్తే భవిష్యత్తులో చర్చలు జరపడానికి అవతలి వైపు ఎవరూ మిగలరనే ఉద్దేశంతోనే తాము వెనక్కి తగ్గామని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఖమేనీ మరణానికి ప్రజలు ఏడవడం చూసి ఆశ్చర్యపోయానని, అవి కేవలం నకిలీ కన్నీళ్లు అయి ఉంటాయని ట్రంప్ కొట్టిపారేశారు.