Ukraine Russia War:ఉక్రెయిన్‌ యుద్ధంలో కీలక మలుపు...పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కీలక స్థావరమైన కొస్తాంటినివ్కాను రష్యా స్వాధీనం చేసుకుంది. ఒక్కవైపు నుంచే కాకుండా పలు సరిహద్దుల నుంచి రష్యా దాడులు ముమ్మరం చేసింది.

Update: 2026-07-04 03:20 GMT

Ukraine Russia War: ఉక్రెయిన్ అంతర్గత రక్షణ వలయాలను ఛేదిస్తూ రష్యా సైన్యం యుద్ధంలో మరో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. తూర్పు ఉక్రెయిన్‌లోని అత్యంత వ్యూహాత్మక నగరమైన కొస్తాంటినివ్కాను తాము పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు క్రెమ్లిన్ అధికారికంగా ప్రకటించింది. యుద్ధానికి ముందు దాదాపు 78,000 జనాభా ఉన్న ఈ నగరం కోసం 2025 చివరి నుండి రష్యా-ఉక్రెయిన్ బలగాల మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ నగరం పతనం కావడం అనేది గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ఎదురుదెబ్బగా అంతర్జాతీయ మిలిటరీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విజయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ, ఇది తమ దళ సాధించిన అత్యంత కీలకమైన వ్యూహాత్మక విజయం అని ప్రశంసించారు.

కొస్తాంటినివ్కా ఎందుకు అంత ముఖ్యం?

రష్యాకు డాన్‌బాస్ ప్రాంతాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకోవాలనే సుదీర్ఘ లక్ష్యం ఉంది. ఆ లక్ష్యానికి కొస్తాంటినివ్కా నగరం ఒక ముఖద్వారం లాంటిది. ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న చివరి ప్రధాన నగరాలైన క్రామాటర్స్క్, స్లోవియాన్స్క్ లకు వెళ్లే ప్రధాన రవాణా మార్గంలోనే ఈ కొస్తాంటినివ్కా ఉంది. ఉక్రెయిన్ నిర్మించుకున్న బలమైన రక్షణ గోడను రష్యా బద్దలు కొట్టడంతో, ఇప్పుడు డొనెట్స్క్ ప్రాంతంలో మరింత లోపలికి చొచ్చుకెళ్లడానికి రష్యాకు దారులు సుగమమయ్యాయి. ప్రస్తుతం నగరంలోని శిథిలాలు, బేస్మెంట్ల చాటున దాక్కున్న ఉక్రెయిన్ సైనికులను ఏరివేసే ఆపరేషన్ సాగుతోందని రష్యా కమాండర్ అంటోన్ గ్రునిస్ స్పష్టం చేశారు.

దాడులతో ఉక్రెయిన్‌కు ఊపిరాడకుండా చేస్తున్న రష్యా

క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అందించిన సమాచారం ప్రకారం.. రష్యా కేవలం తూర్పు వైపే కాకుండా మిగిలిన సరిహద్దుల్లోనూ పట్టు బిగిస్తోంది. డాన్‌బాస్ పరిధిలోకి వచ్చే మొత్తం లుహాన్స్క్ ప్రావిన్స్ ఇప్పుడు పూర్తిగా రష్యా నియంత్రణలోకి వచ్చింది. యుద్ధానికి ముందు 7 లక్షల జనాభా ఉన్న ప్రముఖ దక్షిణ ఉక్రెయిన్ నగరం జాపోరిజియాకు రష్యా దళాలు కేవలం 9 కిలోమీటర్ల దూరంలోకి వచ్చాయని చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్ ప్రకటించారు. అంతేకాదు, ఉత్తర ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన సుమీకి కూడా రష్యా సైన్యం కేవలం 10 కిలోమీటర్ల దూరంలో పొంచి ఉంది. మిలిటరీ యూనిఫాంలో కమాండర్లతో కలిసి ప్రత్యక్షమైన పుతిన్.. యుద్ధ భూమిలో వ్యూహాత్మక ఆధిక్యత పూర్తిగా రష్యా చేతుల్లోనే ఉందని ప్రపంచానికి చాటిచెప్పారు. పాశ్చాత్య దేశాల ఆయుధాలు అందుతున్నప్పటికీ, ఉక్రెయిన్ తన కీలక స్థావరాలను కాపాడుకోలేకపోవడం పశ్చిమ దేశాల రక్షణ వ్యూహాలను సైతం పునరాలోచనలో పడేస్తోంది. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారన్నది కాలమే నిర్ణయించాలి.  

Tags:    

Similar News