Iran US Tensions: అమెరికాపై ఇరాన్ డర్టీ బాంబు దాడికి ప్లాన్ చేస్తోందా? ట్రంప్ అధికారులకు ముప్పు
అమెరికా నిఘా సంస్థలకు ఇరాన్ నుంచి వాషింగ్టన్లో ట్రంప్ ప్రభుత్వ కీలక అధికారులపై డర్టీ బాంబు లేదా రసాయన దాడి చేసే అవకాశాలపై సమాచారం అందినట్లు CNN తెలిపింది.
Iran US Tensions
Iran US Tensions: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ డీసీలో ట్రంప్ ప్రభుత్వంలోని కీలక అధికారులను లక్ష్యంగా చేసుకుని డర్టీ బాంబు లేదా రసాయన ఆయుధాలతో దాడి చేసే అవకాశాలను ఇరాన్ పరిశీలిస్తోందని అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందినట్లు CNN కథనం వెల్లడించింది. ఈ సమాచారం అమెరికా భద్రతా విభాగాల్లో కలకలం రేపింది. అయితే ఇరాన్ నిజంగా దాడికి సిద్ధమైందా? అలాంటి దాడి చేసే సామర్థ్యం దానికి ఉందా? అనే విషయాలపై అమెరికా అధికారుల మధ్యే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
తక్షణ దాడికి సంకేతాలు లేవు
CNN కథనం ప్రకారం.. అమెరికా నిఘా వర్గాలకు అందిన సమాచారం కేవలం దాడి అవకాశాలను పరిశీలిస్తున్న దశలోనే ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అంటే ఇరాన్ వెంటనే దాడి చేయబోతోందని దీనర్థం కాదు. అయితే ఈ ప్రణాళికలో వాషింగ్టన్‌లోని కొన్ని ప్రాంతాలు, లక్ష్యాల ప్రస్తావన ఉన్నట్లు ఇద్దరు అధికారులు వెల్లడించారు. అమెరికాలో బాంబు తయారీకి అవసరమైన వస్తువులు ఇప్పటికే దాచిపెట్టి ఉండొచ్చని సూచించే కొన్ని సందేశాలను కూడా నిఘా సంస్థలు గుర్తించినట్లు సమాచారం. అయితే ఆ సమాచారంపై అధికారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. వైట్‌హౌస్ ప్రతినిధి లారెన్ బిస్ స్పందిస్తూ.. అన్ని రకాల ముప్పులపై నిఘా ఉంచామని, ప్రస్తుతానికి అమెరికాకు విశ్వసనీయమైన తక్షణ ముప్పు లేదని స్పష్టం చేశారు.
స్కాట్ బేసెంట్కు భద్రత పెంపు
ఈ నిఘా సమాచారంతో అమెరికా అధికారులు గత వారం పలుమార్లు సమావేశమై ముందస్తు భద్రతా చర్యలపై చర్చించినట్లు CNN తెలిపింది. ఇరాన్ నుంచి ముప్పు ఉండొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బేసెంట్ను సైనిక నివాస సముదాయానికి తరలించినట్లు కూడా కథనం పేర్కొంది. దాడి జరిగితే ఎలా స్పందించాలి? కీలక అధికారులకు ఎలాంటి రక్షణ కల్పించాలి? అనే అంశాలపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇరాన్ గతంలోనూ ప్రస్తుత, మాజీ అమెరికా అధికారులపై దాడులకు కుట్ర పన్నిందని వాషింగ్టన్ ఆరోపించింది. 2024లో అప్పటి అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు కుట్ర పన్నినట్లు అమెరికా అధికారులు ఆరోపించారు.
రసాయన ఆయుధాల ఆరోపణలను ఖండించిన ఇరాన్
అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వ అధికారులపై దాడి చేసే అవకాశాలే కాకుండా, మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనికులపై రసాయన ఆయుధాలు ప్రయోగించే ప్రమాదం ఉందన్న సమాచారాన్ని కూడా నిఘా సంస్థలు పరిశీలిస్తున్నట్లు CNN తెలిపింది. దీంతో ఆ ప్రాంతంలోని అమెరికా దౌత్య, నిఘా సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు, శిక్షణ అందించే అంశంపై ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అయితే రసాయన ఆయుధాల వినియోగంపై వచ్చిన ఆరోపణలను ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ దౌత్య కార్యాలయం ఖండించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ రసాయన ఆయుధాల వినియోగాన్ని తమ దేశం సమర్థించదని, ఈ ఆరోపణలు అవాస్తవమని పేర్కొంది. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ముగించే దౌత్య ప్రయత్నాలు ఇంకా ముందుకు సాగడం లేదు. అమెరికా ఆంక్షలు, హోర్ముజ్ జలసంధి అంశాలపై రెండు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
డర్టీ బాంబు అంటే ఏమిటి?
డర్టీ బాంబును రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైస్ అని కూడా పిలుస్తారు. ఇందులో సాధారణ పేలుడు పదార్థాలతో పాటు రేడియోధార్మిక పదార్థాలు ఉంటాయి. పేలుడు జరిగినప్పుడు ఆ రేడియోధార్మిక పదార్థాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపిస్తాయి. అయితే ఇది అణుబాంబు కాదు. అణుబాంబులా భారీ అణు విస్ఫోటనం జరగదు. అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (CDC) వివరాల ప్రకారం.. ఇలాంటి బాంబులో పేలుడు వల్ల కలిగే గాయాలు, నష్టమే తక్షణ ప్రమాదంలో ప్రధానమైనవి. రేడియోధార్మిక ధూళి గాలి ద్వారా వ్యాపించి ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఎంత దూరం వరకు ప్రభావం ఉంటుందనేది ఉపయోగించిన పదార్థాలు, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఇలాంటి ఘటన జరిగితే ప్రభావిత ప్రాంతాన్ని ఖాళీ చేయించడం, రేడియేషన్ పరీక్షలు నిర్వహించడం, శుభ్రపరిచే చర్యలు చేపట్టడం అవసరం అవుతుంది. ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్న సమాచారం దాడి ఖాయమని చెప్పడం లేదు.