అమెరికా రాడార్‌ను ధ్వంసం చేశామన్న ఇరాన్.. బహ్రెయిన్‌లో కలకలం
Iran US Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. ఇరాన్‌పై అమెరికా ఎలాంటి దాడులకు పాల్పడినా మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తామని.
అమెరికా రాడార్‌ను ధ్వంసం చేశామన్న ఇరాన్.. బహ్రెయిన్‌లో కలకలం
Iran US Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. ఇరాన్‌పై అమెరికా ఎలాంటి దాడులకు పాల్పడినా మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరిస్తూ వస్తున్న ఇరాన్ తాజాగా ఒక సంచలన ప్రకటనతో పశ్చిమాసియాలో కలకలం రేపింది. బహ్రెయిన్‌లోని అమెరికాకు చెందిన వ్యూహాత్మక ముందస్తు హెచ్చరిక (ఎర్లీ వార్నింగ్) రాడార్ వ్యవస్థను తాము పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఇరాన్‌కు చెందిన శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధికారికంగా ప్రకటించింది. అమెరికా దూకుడుకు ఇది గట్టి హెచ్చరిక అని తేల్చిచెప్పింది.
టెలికమ్యూనికేషన్ టవర్ దాడికి ప్రతీకారం
ఫార్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన కథనం ప్రకారం.. ఇరాన్‌లోని సిరిక్ ప్రాంతంలో ఉన్న ఒక టెలికమ్యూనికేషన్ టవర్‌పై అమెరికా వైమానిక దళాలు దాడి చేశాయని IRGC ఆరోపించింది. ఈ దాడి జరిగిన గంట వ్యవధిలోనే తమ ఏరోస్పేస్ దళాలు ప్రతీకార చర్యకు దిగాయని తెలిపింది. బహ్రెయిన్ ద్వీపంలో అమెరికా సైన్యం ఏర్పాటు చేసిన ఎర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించి, దాన్ని నేలమట్టం చేశామని వెల్లడించింది. అమెరికా వైమానిక కవ్వింపు చర్యలకు అడ్డుకట్ట వేయడం, తమ సరిహద్దులను ఉల్లంఘిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించడమే ఈ దాడి ప్రధాన ఉద్దేశమని IRGC స్పష్టం చేసింది. అంతేకాకుండా, వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో అమెరికా చమురు అక్రమ రవాణాకు పాల్పడుతోందని ఇరాన్ తీవ్ర ఆరోపణలు గుప్పించింది.
ఇతర దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు
అమెరికాతో కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ ఇతర దేశాలకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చింది. అమెరికా చేపట్టే సైనిక చర్యలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ దేశమైనా సహకరిస్తే, వారిని కూడా తమపై దాడిలో భాగస్వాములుగానే పరిగణిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలను ఉటంకిస్తూ ఆయన 'ఎక్స్' వేదికగా ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఒక కొరియన్ సామెతను ప్రస్తావిస్తూ.. "కొంగ వెనుక ఎగరాలని ప్రయత్నించే పిచ్చుక చివరకు తన కాళ్లను విరగ్గొట్టుకుంటుంది" అని వ్యాఖ్యానించారు. అంటే అమెరికా వెనుక నడిచి ఇరాన్‌ను కెలికే దేశాలు చివరికి తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటాయని పరోక్షంగా హెచ్చరించారు.
అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం
ఇరాన్ తాజా ప్రకటనలతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలు , ప్రపంచ చమురు రవాణాకు నాడీ కేంద్రమైన హార్ముజ్ జలసంధి ప్రాంతం ప్రస్తుతం అత్యంత సమస్యాత్మకంగా మారాయి. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే అది అంతర్జాతీయంగా చమురు సరఫరాపైనా, ముడిచమురు ధరలపైనా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అయితే, బహ్రెయిన్‌లోని తమ రాడార్ వ్యవస్థను ఇరాన్ ధ్వంసం చేసిందన్న వార్తలపై అమెరికా వైపు నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడుతుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య ఈ వివాదం ఏలు దారితీస్తుందోనని అంతర్జాతీయ సమాజం ఆందోళనగా గమనిస్తోంది.