H1B Visa: ఇక అమెరికా డ్రీమ్ మరింత ప్రియం.. హెచ్-1బీ వీసాదారులకు ట్రంప్ కోలుకోలేని షాక్
H1B Visa: హెచ్-1బీ వీసా దరఖాస్తులపై ఏకంగా 1,03,265 అమెరికన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ.86 లక్షలకు పైగా) అదనపు రుసుమును విధించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది.
H1B Visa
H1B Visa: అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే భారతీయ ఐటీ నిపుణులకు, విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ప్రతిష్టాత్మక హెచ్-1బీ వీసా దరఖాస్తులపై ఏకంగా 1,03,265 అమెరికన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ.86 లక్షలకు పైగా) అదనపు రుసుమును విధించాలని ప్రతిపాదించింది. ఈ ఊహించని నిర్ణయం భారతీయ సాంకేతిక నిపుణులపై, వారిని స్పాన్సర్ చేసే అమెరికన్ కంపెనీలపై తీవ్ర ఆర్థిక భార మోపే ప్రమాదం ఏర్పడింది. అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇటీవల ఒక అధికారిక నోటీసు విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న సాధారణ వీసా దరఖాస్తు రుసుములకు అదనంగా ఈ కొత్త ఫీజును వసూలు చేయనున్నారు. అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి మాస్టర్స్ లేదా అంతకంటే ఉన్నత చదువులు పూర్తి చేసిన విదేశీయులకు కేటాయించే 20,000 అదనపు వీసాల కేటగిరీకి కూడా ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. గతంలో కోర్టులు తోసిపుచ్చిన ప్రతిపాదనల స్థానంలో ప్రభుత్వం ఈ నూతన సవరణలను తీసుకురావడం గమనార్హం.
వివిధ ప్రభుత్వ శాఖల ఖర్చుల భర్తీకే ఈ పెంపు
ఈ భారీ రుసుమును ప్రత్యేకంగా ఎందుకు నిర్ణయించాల్సి వచ్చిందో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ స్పష్టం చేసింది. వీసాల జారీ ప్రక్రియలో వివిధ రకాల ప్రభుత్వ విభాగాలు పాల్గొంటాయని, ఆయా శాఖల మధ్య జరిగే నిర్వహణ ఖర్చులను భర్తీ చేయడానికే ఈ మొత్తాన్ని నిర్ణయించినట్లు వెల్లడించింది. సాధారణంగా అమెరికా ప్రతి ఏటా ప్రామాణిక కేటగిరీ కింద 65,000 హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంది. పెంపు ప్రకటన నుంచి మినహాయింపు పొందిన పరిమితి లేని పిటిషన్లకు తప్ప మిగిలిన అన్ని దరఖాస్తులకు ఈ ఫీజు మోత తప్పదు.
భారతీయులపైనే తీవ్ర ప్రభావం
ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యేది భారతీయ పౌరులే కావడం గమనార్హం. అమెరికా జారీ చేసే హెచ్-1బీ వీసాలలో ఏకంగా 70 శాతానికి పైగా వాటాను భారతీయులే దక్కించుకుంటున్నారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 2024 సంవత్సరంలో యుఎస్‌సిఐఎస్ (USCIS) ఆమోదించిన 3,99,402 హెచ్-1బీ పిటిషన్లలో దాదాపు 71 శాతం మనదేశానికి చెందిన నిపుణులకే దక్కాయి. ఇప్పుడు వీసా ధర విపరీతంగా పెరగడంతో అమెరికన్ కంపెనీలు విదేశీ ఉద్యోగులను స్పాన్సర్ చేయడానికి వెనుకాడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ వీసా రుసుముల పెంపు ప్రతిపాదన భారత్ నుంచి అమెరికా వెళ్లాలనుకునే ఐటీ ఉద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. ఈ ప్రతిపాదనలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే అమెరికన్ టెక్ రంగంలో ఉద్యోగ అవకాశాలు క్రమంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.