US Canada Trade war: యూఎస్ వర్సెస్ కెనడా ట్రేడ్‌వార్... డాలర్‌కు డాలర్‌తోనే బదులు
యూఎస్ కెనడా ట్రేడ్ చర్చలు విఫలం కావడంతో రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలైంది. కెనడా ఉత్పత్తులపై 50 టారిఫ్ విధించడంతో కెనడా బదులుగా డాలర్‌తో బదులిస్తామని ప్రకటించింది.
US Canada Trade war: ఉత్తర అమెరికా ఖండంలో రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, కెనడాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వాణిజ్య సంబంధాలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయాయి. శుక్రవారం అర్థరాత్రి వరకు వాషింగ్టన్‌లో సాగిన సుదీర్ఘ చర్చలు ఘోరంగా విఫలమవడంతో, కెనడా నుండి వచ్చే ఉత్పత్తులపై వైట్ హౌస్ అత్యంత కఠినమైన 50 శాతం టారిఫ్‌లను అమలులోకి తెచ్చింది. దీనికి నిరసనగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ చర్చల ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, తమ ప్రతినిధులను తిరిగి రాజధాని ఒట్టావాకు రప్పించారు.
20 బిలియన్ డాలర్ల వ్యాపారానికి భారీ గండి
అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం విడుదల చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ పన్నుల బాదుడు వల్ల దాదాపు 20 బిలియన్ డాలర్లు అంటే సుమారు 1,65,000 కోట్లు విలువైన కెనడియన్ ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. ఇరు దేశాల ప్రతినిధులు డోమినిక్ లీ బ్లాంక్, జేమీసన్ గ్రీర్‌లు రాత్రి 10:30 గంటల సమయం దాటే వరకు చర్చలు జరిపినప్పటికీ, అమెరికా విధించిన అవాస్తవిక షరతుల వల్ల ఒప్పందం కుదరలేదు. "అమెరికా తీరు పూర్తిగా మారిపోయిందని మేము మొదటి నుంచీ గ్రహించాం. కానీ మన భవిష్యత్తును నిర్ణయించే హక్కు వేరే దేశానికి ఇవ్వం" అని ప్రధాని కార్నీ స్పష్టం చేశారు. అమెరికా విధించే ప్రతి టారిఫ్‌కు ప్రతిగా కెనడా కూడా "డాలర్‌కు డాలర్" చొప్పున అమెరికా ఉత్పత్తులపై రిటాలియేటరీ పన్నులు విధిస్తుందని తేల్చి చెప్పారు.
అంతర్గత వివాదాలు ... ముదిరిన వాణిజ్య పోరు
ఈ చర్చలు విఫలం కావడం వెనుక కెనడాలోని ప్రాంతీయ ప్రావిన్సుల ఒత్తిడి కూడా ప్రధాన కారణమైంది. అమెరికా ఆల్కహాల్ విక్రయాలపై తమ దేశంలోని ప్రావిన్సులు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికా డిమాండ్ చేయగా, దానికి స్థానిక నాయకులు తీవ్రంగా నిరసన తెలిపారు. మేనిటోబా ప్రీమియర్ వాబ్ కిన్యూ వంటి కీలక నేతలు అమెరికా బెదిరింపులకు లొంగిపోవద్దని ప్రధానిపై ఒత్తిడి తెచ్చారు. ఒకవైపు గ్లోబల్ మార్కెట్‌లో చైనా, రష్యాలతో పోటీపడుతున్న అమెరికా, ఇప్పుడు తన పక్కనే ఉన్న మిత్రదేశం కెనడాతో ఇలాంటి నేరుగా "వాణిజ్య యుద్ధానికి" దిగడం అంతర్జాతీయ ఆర్థిక రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ట్రేడ్ వార్ వల్ల ఇరు దేశాల్లోనూ నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.