బంగ్లాదేశ్‌లో రగులుతున్న 'రాముడి' సెగ.. ఢాకా వీధుల్లో 'జై శ్రీరామ్' నినాదాలు!

Bangladesh: బంగ్లాదేశ్‌లో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఇస్లామిక్ వర్గాల బెదిరింపులు.

Update: 2026-06-20 09:22 GMT

బంగ్లాదేశ్‌లో రగులుతున్న 'రాముడి' సెగ.. ఢాకా వీధుల్లో 'జై శ్రీరామ్' నినాదాలు!

Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్న అణచివేత, మతపరమైన వేధింపులు మరోసారి అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అక్కడ నిర్మిస్తున్న ఒక భారీ శ్రీరాముడి విగ్రహం చుట్టూ మొదలైన వివాదం.. ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమంగా రూపాంతరం చెందుతోంది. రాముడి విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ఇస్లామిక్ వర్గాలు చేసిన చర్యలు, దేవుడి చిత్రాన్ని అవమానించారనే వార్తలు హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఈ ఘటనను నిరసిస్తూ వేలాది మంది హిందువులు శుక్రవారం రాజధాని ఢాకా వీధుల్లోకి వచ్చి ‘జై శ్రీరామ్’ నినాదాలతో భారీ ప్రదర్శనలు నిర్వహించారు.

రాజధాని ఢాకాలోని అత్యంత కీలకమైన షాబాగ్ ప్రాంతం శుక్రవారం నిరసనకారులతో కిక్కిరిసిపోయింది. బంగ్లాదేశ్ జాతీయ ‘హిందూ మహాజోట్’ పిలుపుతో విద్యార్థులు, వివిధ హిందూ సంఘాలు కలిసి భారీ ప్రదర్శన చేపట్టాయి. షాబాగ్ నుంచి జాతీయ ప్రెస్ క్లబ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. నిరసనకారులు కొవ్వొత్తులు, కాగడాలు చేతబూని ప్రదర్శనలో పాల్గొన్నారు. రాముడి చిత్రాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.

ఈ నెల ప్రారంభంలో బంగ్లాదేశ్‌లోని గైబంధా జిల్లాలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో, కొందరు మత ఛాందసవాదులు శ్రీరాముడి చిత్రంపై చెప్పు ఉంచి అవమానించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘోర ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనా.. ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడంపై హిందువులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితులను పట్టుకునేందుకు హిందూ సంఘాలు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి 72 గంటల గడువు విధించాయి. అప్పటిలోగా కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించాయి.

ఉత్తర బంగ్లాదేశ్‌లోని పలాష్‌బారిలో 81 అడుగుల ఎత్తుతో ఒక భారీ శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఈ విగ్రహ నిర్మాణం గనుక పూర్తయితే, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహంగా రికార్డు సృష్టించేది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఆలయ సముదాయంలోనే 50 అడుగుల కృష్ణుడి విగ్రహం, 30 అడుగుల శివుడి విగ్రహాన్ని కూడా నిర్మించాలనేది ఆలయ కమిటీ ప్రణాళిక.

అయితే, ఈ విగ్రహ నిర్మాణానికి వ్యతిరేకంగా కొన్ని స్థానిక ఇస్లామిక్ సంస్థలు తీవ్ర బెదిరింపులకు దిగినట్లు ఆలయ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. ఓ మత బోధకుడు బహిరంగంగానే బుల్డోజర్‌తో వచ్చి విగ్రహాన్ని కూల్చేస్తానని హెచ్చరించాడని ఆరోపించారు. ఈ క్రమంలో అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉండటంతో, వివాదాలు వద్దనే ఉద్దేశంతో విగ్రహ పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ప్రకటించారు.

హిందూ మహాజోట్ సంచలన ప్రకటన: విగ్రహ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను ప్రభుత్వం వెంటనే తొలగించకపోతే, బంగ్లాదేశ్‌లోని మొత్తం 64 జిల్లాల్లో ఒక్కో రామాలయాన్ని నిర్మించి తీరుతామని హిందూ మహాజోట్ హెచ్చరించింది. మరోవైపు, పూజా ఉత్సవాల జాతీయ కమిటీ శనివారం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునివ్వడంతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం బంగ్లాదేశ్ మొత్తం జనాభాలో హిందువులు సుమారు 8 శాతం మంది ఉన్నారు. అయితే, ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే అక్కడ దాదాపు 133 సామాజిక, మత ఘర్షణల ఘటనలు నమోదైనట్లు స్థానిక మానవ హక్కుల వర్గాలు చెబుతున్నాయి. ఈ తాజా విగ్రహ వివాదంతో బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రత, మత స్వేచ్ఛ మరియు వారి ప్రాథమిక హక్కుల అంశాలు మరోసారి అంతర్జాతీయ వేదికపై చర్చకు వచ్చాయి.

Tags:    

Similar News