Iraq Coup Attempt : వీధుల్లో యుద్ధ ట్యాంకులు, గాల్లో హెలికాప్టర్లు.. ఇరాక్‌లో రాత్రికి రాత్రే తిరుగుబాటు కుట్ర భగ్నం

Iraq Coup Attempt : ఇరాక్ రాజధాని బగ్దాద్‌లో అర్ధరాత్రి భారీ సైనిక చర్య కలకలం రేపింది. గ్రీన్‌జోన్‌లోకి దూసుకెళ్లిన ట్యాంకులు, అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో కాల్పులతో ప్రభుత్వంపై తిరుగుబాటు కుట్రను సైన్యం భగ్నం చేసింది.

Update: 2026-06-29 01:29 GMT

Iraq Coup Attempt : పశ్చిమ ఆసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికాకు కూడా కొరుకుడు పడని ఇరాన్.. తన పొరుగు దేశమైన ఇరాక్‌లో సరికొత్త రాజకీయాన్ని నడుపుతోంది. ఇరాక్‌లో కేవలం విపక్షాలు, తిరుగుబాటు గ్రూపుల హడావుడే అనుకుంటే.. ఏకంగా ప్రభుత్వాన్ని పడగొట్టే ఒక భారీ కుట్ర వెలుగుచూసింది. ఇరాక్ రాజధాని బగ్దాద్‌లో ఆదివారం తెల్లవారుజామునే యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు సైరన్లు మోగిస్తూ వీధుల్లోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రాంతంగా భావించే బగ్దాద్‌లోని గ్రీన్‌జోన్ ఒక్కసారిగా మిలిటరీ కంట్రోల్‌లోకి వెళ్లిపోయింది.

ఆదివారం తెల్లవారుజామున 5 గంటల 54 నిమిషాలకు ఆయుధాలతో కూడిన భారీ సైనిక వాహనాలు గ్రీన్‌జోన్‌లోకి ప్రవేశించాయి. సరిగ్గా 6 గంటల 8 నిమిషాలకు గ్రీన్‌జోన్ పరిధిలో భారీగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఉదయం 8 గంటల సమయంలో ఇరాక్ సైన్యానికి చెందిన ఒక ప్రత్యేక విభాగం గ్రీన్‌జోన్‌లోని సిక్మా కాంప్లెక్స్ పై మెరుపు దాడి చేసింది. ఈ కాంప్లెక్స్ అమెరికా రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడే ఇరాక్ దేశానికి చెందిన పలువురు అగ్రనేతలు, వారి కుటుంబాలు నివసిస్తుంటారు. గొడవ పెద్దదవుతుండడంతో ముందుజాగ్రత్తగా అమెరికా ఎంబసీని తాత్కాలికంగా మూసివేసి సైన్యం ఆపరేషన్ ప్రారంభించింది.

ఈ భారీ మిలిటరీ యాక్షన్‌పై ఇరాక్ ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. ఇదొక సాధారణ కోర్టు ఆదేశాల ప్రకారం జరిగిన చర్య అని, అవినీతికి పాల్పడిన నేతలను అరెస్ట్ చేయడానికి వెళ్లామని ప్రకటించింది. కానీ ఇరాక్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. తెరవెనుక అసలు కథ వేరే ఉంది. అరెస్ట్ అయిన నాయకులలో ఎక్కువ మంది ఇరాన్ దేశానికి మద్దతు ఇచ్చేవాళ్లే కావడం గమనార్హం. ఇరాక్‌లో యాక్టివ్‌గా ఉన్న ఇరాన్ అనుకూల మిలిషియా గ్రూపులతో వీరికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టి ఇరాన్ చేతుల్లోకి అధికారాన్ని అప్పగించేందుకే వీరంతా రహస్యంగా తిరుగుబాటుకు కుట్ర పన్నారని, అందుకే స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి దిగి రాత్రికి రాత్రే వారి ఆట కట్టించాయని తెలుస్తోంది.

అమెరికా రాయబార కార్యాలయానికి ఇంత దగ్గరగా ఇంత పెద్ద సైనిక చర్య జరగడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ఇరాక్ దేశం నేటికీ అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న దౌత్యపరమైన ప్రాక్సీ వార్ కు ప్రధాన అడ్డాగా మారిందని ఈ ఘటన నిరూపించింది. అవినీతిపై వారెంట్లు అనే పేరుతో.. ఇరాన్ దేశ రాజధాని టెహ్రాన్ ఇషాచొప్పున బగ్దాద్‌ను నడిపించాలని చూస్తున్న ఒక పెద్ద నెట్‌వర్క్‌ను ఇరాక్ సైన్యం బ్రేక్ చేసింది. ప్రస్తుతం బగ్దాద్ వీధుల్లో ఆపరేషన్ ముగిసినప్పటికీ, ఉద్రిక్తతలు మాత్రం చల్లారలేదు.

ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులపై ఇరాక్ ప్రభుత్వం నేరుగా యాక్షన్ తీసుకోవడం మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర సంచలనంగా మారింది. సైన్యం అదుపులోకి తీసుకున్న నేతల అనుచరులు, మిలిషియా గ్రూపులు రాబోయే రోజుల్లో బగ్దాద్ వీధుల్లో తీవ్రమైన హంగామా సృష్టించే అవకాశం ఉంది. రాజకీయ, సైనిక పరంగా ఇరాక్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ సైలెన్స్.. రాబోయే పెద్ద తుఫానుకు సంకేతమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News