Awa Tribe Amazon: ప్రపంచానికి దూరంగా, దట్టమైన అమెజాన్‌ అడవుల్లో తమదైన జీవన విధానంతో బతుకుతున్న ఓ ఆదివాసీ తెగ అనూహ్యంగా బయటకు వచ్చింది. సాధారణంగా ఇతరులతో సంబంధాలు పెట్టుకోని ఆ తెగకు చెందిన సుమారు 20 మంది సభ్యులు ఆహారం కోసం బ్రెజిల్‌ అధికారులను ఆశ్రయించారు. దుంపల కోసం అడిగి, వాటిని తీసుకుని తిరిగి అడవిలోకి వెళ్లిపోయారు. దశాబ్దాలుగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్న ఈ ప్రజలు ఇలా బయటకు రావడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. వారి జీవన పరిస్థితులపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  ఈ ఘటన నవంబర్‌ 16న బ్రెజిల్‌లోని మారన్యావో రాష్ట్రం పరిధిలో ఉన్న అరారిబోయా ఆదివాసీ ప్రాంతంలో చోటుచేసుకుంది. అమెజాన్‌ అడవుల్లో నివసించే అవా (Awá) తెగకు చెందిన సుమారు 20 మంది సమీపంలోని తవారీ గ్రామం వద్దకు వచ్చారు. అక్కడి ప్రభుత్వ బృందాన్ని సంప్రదించి యామ్స్‌ అనే దుంపలను తీసుకున్నారు. అనంతరం ఎలాంటి హడావుడి లేకుండా తిరిగి అడవిలోకి వెళ్లిపోయారు. పొరుగున ఉన్న గుజాజారా తెగకు చెందిన వ్యక్తులు ఈ ఘటనను చిత్రీకరించారు. నవంబర్‌ 17న సర్వైవల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.

అడవిలోనే జీవనం.. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు?

అవా తెగ ప్రజలు వేట, ఆహార సేకరణపై ఆధారపడి జీవిస్తారు. వందల ఏళ్లుగా అమెజాన్‌ అడవులనే తమ నివాసంగా చేసుకున్నారు. బయటివారితో సంబంధాలు లేకుండా ఉండటానికే ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఇటీవలి కాలంలో వారి నివాస ప్రాంతాల్లోకి అక్రమంగా కలప నరికేవారు, వేటగాళ్లు, పశువుల పెంపకందారులు చొరబడుతున్నట్లు ఆదివాసీ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. అడవుల నరికివేత, భూముల ఆక్రమణ, వాతావరణ మార్పులు వంటి పరిణామాలు వారి సహజ జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నాయి. అడవిలో జంతువులు, ఇతర ఆహార వనరులు తగ్గిపోతే వేటపై ఆధారపడే తెగలకు జీవనం కష్టమవుతుంది. అవా ప్రజలు ఆహారం కోసం బయటకు రావడానికి ఈ పరిస్థితులు ఒక కారణమై ఉండవచ్చని కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే వారు ఎందుకు బయటకు వచ్చారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు.

వ్యాధుల ముప్పుపై అధికారుల ఆందోళన

బయటి ప్రపంచంతో సంబంధాలు లేని తెగలకు సాధారణంగా వ్యాపించే కొన్ని అంటువ్యాధులపై తగిన రోగనిరోధక శక్తి ఉండకపోవచ్చు. అందువల్ల కొద్దిసేపు జరిగిన పరిచయం కూడా వారి ఆరోగ్యానికి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్‌ ఆదివాసీ వ్యవహారాల సంస్థ ఫునాయ్‌ (Funai) పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఆరోగ్య సిబ్బంది, ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. ఇలాంటి పరిచయాల సమయంలో ఆరోగ్యపరమైన ముప్పును తగ్గించేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

అడవిని కాపాడాలని డిమాండ్‌

అవా తెగ రక్షణ కోసం గుజాజారా ఆదివాసీ సమాజానికి చెందిన కొందరు ‘ఫారెస్ట్‌ గార్డియన్స్‌’గా పనిచేస్తున్నారు. అడవుల్లోకి చొరబడే అక్రమ కలప వ్యాపారులు, ఇతర ఆక్రమణదారులను అడ్డుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయినట్లు ఆదివాసీ సంఘాలు చెబుతున్నాయి. అవా ప్రజలు బయటకు రావడం కేవలం ఆహారం కోసం చేసిన విజ్ఞప్తిగా మాత్రమే చూడకూడదని సర్వైవల్‌ ఇంటర్నేషనల్‌ హెచ్చరిస్తోంది. వారి అడవులు క్రమంగా కుంచించుకుపోతున్నాయనడానికి ఇది సంకేతం కావచ్చని సంస్థ అభిప్రాయపడుతోంది. బ్రెజిల్‌ ప్రభుత్వం అరారిబోయా ప్రాంతాన్ని ఆక్రమణల నుంచి కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోంది.

Tags: