LB Nagar: మైనర్ బాలికను వేధించిన కేసులో నిందితుడికి రెండేళ్ల కఠిన జైలు!
LB Nagar: మైనర్ బాలికను వెంటాడి వేధించిన కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు, బాధితురాలికి రూ.50 వేల పరిహారం విధిస్తూ ఎల్బీనగర్ కోర్టు తీర్పునిచ్చింది.
LB Nagar: మైనర్ బాలికను వేధించిన కేసులో నిందితుడికి రెండేళ్ల కఠిన జైలు!
ఎల్బీనగర్: మైనర్ బాలికను వెంటాడుతూ వేధించిన కేసులో నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. నిందితుడికి రూ.2 వేల జరిమానా విధించడంతోపాటు బాధితురాలికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.
కాలేజీ నుంచి వస్తుండగా వేధింపులు
2023 డిసెంబరు 14న శివాని డిగ్రీ కళాశాల నుంచి ఓమ్ని ఆసుపత్రి బస్టాప్ వైపు వెళ్తున్న బాలిక.. కొత్తపేట రైతుబజార్ వద్దకు చేరుకుంది. అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆమెను వెంబడిస్తూ ఫోన్ నంబర్ అడిగి వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే తండ్రికి ఫోన్ చేసి విషయం తెలిపింది. గతంలోనూ నిందితుడు మద్యం మత్తులో తమ ఇంటికి వచ్చి పిలిచాడని, అప్పట్లో తల్లి అతడితో మాట్లాడిందని బాలిక వెల్లడించింది. అప్పటి నుంచి తనను వెంటాడుతూ వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.
మైనర్‌గా నిర్ధారణ.. ఛార్జిషీట్
చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారు. బాధితురాలి వయస్సును ధ్రువీకరించే పత్రాలను పరిశీలించడంతో ఆమె మైనర్ అని నిర్ధారణ అయింది. బాలిక వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయించారు. నిందితుడిని 2023 డిసెంబరు 15న అరెస్టు చేసి, దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
రెండేళ్ల కఠిన కారాగార శిక్ష
పూర్తిస్థాయి విచారణ అనంతరం ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి పద్మావతి నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఐపీసీ 354డీ, పోక్సో చట్టంలోని 11, 12 సెక్షన్ల కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
ఈ కేసులో దర్యాప్తు అధికారి ఎంఆర్‌ఎస్‌వీ ప్రసాద్ (ఎస్సై), అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పి.సత్యనారాయణ, కృష్ణ ప్రసన్న కృషిని మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ అభినందించింది.