Serilingampally: జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ యువజన దినోత్సవం!

Serilingampally: BHEL శేరిలింగంపల్లి జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు.

Update: 2026-08-12 08:40 GMT

Serilingampally: జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ యువజన దినోత్సవం!

Serilingampally: ఈరోజు ఉదయము అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని BHEL లో గల శేరిలింగంపల్లి జూనియర్ కళాశాల నందు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ G రవిందర్ గారు అధ్యక్షుత వహించారు.

ముఖ్య అతిథిగా ఆచార్య చివుకుల ఉషగారు (హెల్త్ ఫిజియాలజీ విభాగం, కేంద్రీయ విశ్వవిద్యాలయం) విచ్చేసి విద్యార్థిని , విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ " ఐక్యరాజ్యసమితి సమితి వారు 2000 సంవత్సరము నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 12నాడు ఒక ప్రత్యేక నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నినాదం ' విభిన్న సందర్భాలలో - ఉమ్మడి ఆకాంక్షలు' అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం యువతకు సంబంధించిన సమస్యలు, విద్య, ఉపాధి, శిక్షణ, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక రంగంతో సహా వివిధ రంగాలలో యువత ప్రాధాన్యత గురించి తెలియజెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం" అని అన్నారు.

" యువశక్తితోనే ఏ దేశ ప్రగతియైన ఆధారపడి ఉంటుంది. యువత ఆలోచనలు మెరుపువేగం. చేతులలో చురుకుదనం, వాళ్లు తలుచుకుంటే ఏదైనా చేసి చూపించే సత్తా వాళ్ళ స్వంతం. యువత బాధ్యతతో మెలగాలి. తమ కుటుంబాలను, సమాజాన్ని, దేశాన్ని కాపాడాలి. ఈనాడు సమాజంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో క్రొత్త క్రొత్త సాంకేతికత వచ్చింది. ఆ సాంకేతికతలను అందిపుచ్చుకొని విద్యా, ఉపాధి రంగాలలో పురోభివృద్ధి సాధించాలంటే ఏకాగ్రత, పట్టుదల, కృషి ఎంతైనా అవసరం.

యువతలో కొందరు మద్యపానము, ధూమపానం అలాగే మాదకద్రవ్యాలను అధికంగా వినియోగించడంతో పాటు తమ విలువైన సమయాన్ని సోషల్ మీడియా మరియు అంతర్జాలంలో వృథా చేస్తున్నారు. ప్రపంచంలో యువశక్తి అధికంగా ఉన్న దేశాలు ఇండియా, చైనా, నైజీరియా, ఇండోనేషియా, పాకిస్థాన్ మొదలగునవి. భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉండాలంటే అత్యధిక యువశక్తి ఉన్న భారతదేశంలో ప్రభుత్వాలు ఒక దశ, దిశ నిర్దేశించడానికి యువశక్తి అవసరం.

అలాగే మన దేశ యువత కూడా అన్ని ఉపాధి రంగాలలో పోటీపడి నూతన సాంకేతికతతో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొన్నప్పుడే మన దేశం కూడా పురోభివృద్ధి చెందుతుంది" అని అన్నారు. " యువత విలువలతో కూడిన గుణాత్మక విద్యను అభ్యసించడంతో పాటు దురలవాట్లకు దూరంగా ఉండుట, శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా, ధ్యానం, ఆధ్యాత్మికతను అలవరచుకోవడం మరియు పౌష్టికాహారం తీసుకుని యువత అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి చెంది దేశ ప్రతిష్ఠను యినుమడింపజేయాలి. దీనికి తల్లిదండ్రులు, పౌర సమాజం, అధ్యాపకులు, ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది" అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థుల చేత చెడు అలవాట్లకు దూరంగా ఉంటామని, జాతీయ సమైక్యతను, సమగ్రతను కాపాడుతూ దేశ అభివృద్ధిలో పాలుపంచుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. 15 నుంచి 35 సంవత్సరంలు వయసు ఉన్నవారిని యువత అంటారు. ఆ వయసు ఉన్న వారిని యువతగా భావిస్తాము అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మధుసూధనరావు , విద్యార్థినీ, విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాలం శ్రీను , జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News