Hyderabad Traffic Alert : హైదరాబాదీలకు అలర్ట్.. ఆ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. దారి మళ్లింపులు ఇవే

Hyderabad Traffic Alert : ఉప్పల్ రింగ్ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం (ఏప్రిల్ 26) నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

Update: 2026-04-27 01:54 GMT

Hyderabad Traffic Alert 

Hyderabad Traffic Alert : హైదరాబాద్ నగరం వడివడిగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ట్రాఫిక్ కష్టాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉప్పల్ ప్రాంతంలో ప్రయాణించాలంటే వాహనదారులు చుక్కలు చూడాల్సి వస్తోంది. చాలా కాలంగా కొనసాగుతున్న ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇప్పుడు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. ఆదివారం (ఏప్రిల్ 26) నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మరి మీరు ఉప్పల్ రూట్‌లో వెళ్తున్నారా? అయితే ఏ దారిలో వెళ్లాలో.. ఎక్కడ మళ్లింపులు ఉన్నాయో తెలుసుకోవాల్సిందే.

ఉప్పల్ నుంచి నారపల్లి వరకు సుమారు 6.2 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న భారీ ఎలివేటెడ్ కారిడార్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్డులోని ఎలక్ట్రిక్ జంక్షన్ వద్ద పిల్లర్ల నిర్మాణం, గార్డర్ల ఏర్పాటు పనుల నిమిత్తం ఉప్పల్ నుంచి వరంగల్ వైపు వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. ఈ పనుల వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.

వరంగల్, హన్మకొండ, యాదగిరిగుట్ట వైపు వెళ్లే ప్రయాణికులకు ఒక ముఖ్యమైన మార్పు ఉంది. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉండే బస్టాండ్‌ను తాత్కాలికంగా నల్లచెరువు కట్ట సమీపానికి మార్చారు. అంటే మీరు వరంగల్ వైపు బస్సు ఎక్కాలంటే ఉప్పల్ రింగ్ రోడ్డులో వెతకకుండా నేరుగా నల్లచెరువు కట్ట దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇకపై ఆ మార్గంలో వెళ్లే ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు అక్కడి నుంచే తమ సర్వీసులను నడుపుతాయి.

సికింద్రాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్లే లారీలు, ఇతర భారీ వాహనాలను హబ్సిగూడ చౌరస్తా వద్దే మళ్లిస్తున్నారు. ఈ వాహనాలు హబ్సిగూడ నుంచి నాచారం, మల్లాపూర్ మీదుగా ఐఓసీ (IOC) జంక్షన్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి చెంగిచర్ల మీదుగా నేషనల్ హైవే 163 (వరంగల్ రహదారి)కి చేరుకోవచ్చు. దీనివల్ల ఉప్పల్ రింగ్ రోడ్డుపై లోడ్ తగ్గుతుందని పోలీసులు భావిస్తున్నారు.

కార్లు, బైకులపై వెళ్లే వారి కోసం పోలీసులు కొన్ని సందులు, ప్రత్యామ్నాయ దారులను సూచించారు. ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే చిన్న వాహనాలు ఇందిరాగాంధీ పార్కు వద్ద నుంచి లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక ఉన్న రోడ్డు ద్వారా ప్రధాన రహదారికి చేరుకోవచ్చు. అలాగే బోడుప్పల్ నుంచి నాగోల్ వైపు వెళ్లే వారు ఏషియన్ థియేటర్ నుంచి భగాయత్ లేఅవుట్ మార్గాన్ని ఎంచుకోవాలి. నాగోల్ నుంచి ఉప్పల్, సికింద్రాబాద్ వెళ్లే బైక్ రైడర్లు మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 81, 813 మీదుగా ప్రయాణించవచ్చు.

ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ని రోజులు అమల్లో ఉంటాయనే దానిపై స్పష్టత లేనప్పటికీ, పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. అనవసరమైన ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకోకుండా ఉండేందుకు సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. ఉప్పల్ జంక్షన్‌లో ట్రాఫిక్ రద్దీని అదుపు చేయడానికి అదనపు బలగాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News