Khairatabad: ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ 1000 రోజుల అభివృద్ధి ఏది?: గోవర్ధన్ రెడ్డి!

Khairatabad: కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ఖైరతాబాద్ అభివృద్ధి శూన్యమని, ఎమ్మెల్యే దానం నాగేందర్ భూదందాల్లో మునిగిపోయారని బీఆర్‌ఎస్ నేత మన్నే గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.

Update: 2026-09-01 17:04 GMT

Khairatabad: ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ 1000 రోజుల అభివృద్ధి ఏది?: గోవర్ధన్ రెడ్డి!

ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌ నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఖైరతాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మన్నే గోవర్ధన్‌ రెడ్డి ఆరోపించారు. చాణక్య స్ట్రాటజీస్‌ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌ ఎమ్మెల్యేల పనితీరు ర్యాంకుల్లో దానం నాగేందర్‌ అత్యంత చివరి స్థానంలో నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే పనితీరుపై వచ్చిన ఈ ఫలితం ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి తలవంపులు తెచ్చేలా ఉందని విమర్శించారు.

మంగళవారం ఎమ్మెల్యే కాలనీలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన ఎమ్మెల్యే.. భూదందాలు, సెటిల్‌మెంట్ల వ్యవహారాల్లో తలమునకలవుతున్నారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో రాష్ట్రంతో పాటు ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోనూ అభివృద్ధి కుంటుపడిందని గోవర్ధన్‌ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో హైదరాబాద్‌ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తాగునీరు, విద్యుత్‌, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేశామని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖైరతాబాద్‌లో పెండింగ్‌ అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు.

వైఫల్యాలపై నియోజక వర్గంలో సెప్టెంబర్‌ 8 వరకు నిరసనలు

కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వివిధ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మన్నే గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్‌ 8 వరకు నిర్వహించే కార్యక్రమాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఖైరతాబాద్‌ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాడుతుందని, ప్రజలకు అండగా ఉంటుందని గోవర్ధన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నరసింహ, అయూబ్, నవీన్, ముస్తాక్ మరియు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News