Chintoor: చింతూరులో అంబులెన్స్ దొరక్క చిన్నారి మృతి: ఐటీడీఏ వద్ద ధర్నా
Chintoor: పోలవరం జిల్లా చింతూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేక 4 ఏళ్ల చిన్నారి సోడే లాస్య మృతి చెందింది.
Chintoor: చింతూరులో అంబులెన్స్ దొరక్క చిన్నారి మృతి: ఐటీడీఏ వద్ద ధర్నా
చింతూరు: చింతూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో చిన్నారి సోడే లాస్య(4) మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే పెద్దసీతనపల్లి గ్రామానికి చెందిన సోడే పాపయ్య కుమార్తె లాస్య మలేరియా జ్వరంతో బాధపడుతుంది.
చిన్నారిని వైద్యం నిమిత్తం శుక్రవారం చింతూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకుని వచ్చారు. చిన్నారికి వైద్యం అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు రిఫర్ చేశారు. ఆ సమయంలో 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో చిన్నారిని భద్రాచలం తీసుకు వెళ్లలేకపోయారు. ఐటీడీఏకు చెందిన అంబులెన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ డీజిల్ బాధితులు కొట్టించుకోవాలని తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
డీజిల్ కొట్టించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో చిన్నారి ని తీసుకొని వెళ్లలేకపోయారు. కొంత సమయం తర్వాత చిన్నారి హాస్పటల్ వద్ద మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి (చిట్టిబాబు) హుటా హుటిన వైద్యశాలకు వెళ్లి చిన్నారి మృతి పై ఆరా తీశారు. మెరుగైన వైద్యం కోసం చిన్నారిని భద్రాచలం తీసుకువెళ్లడానికి అందుబాటులో అంబులెన్స్ లేకపోవడంతోనే చిన్నారి మృతి చెందిందని చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు.
దీంతో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి ఆధ్వర్యంలో చింతూరు ఐటిడిఏ వద్ద మృతి చెందిన చిన్నారితో కుటుంబ సభ్యులు బైఠాయించారు. ఐటిడిఏ పి ఓ శుభం నోక్వాల్ సంఘటన స్థలం వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారి మృతి పై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.