TG Inter Results 2026: TG ఇంటర్ ఫలితాలు వాట్సాప్‌లోనే రిజల్ట్స్.. ఇలా చెక్ చేయండి
TG Inter Results 2026 via WhatsApp: తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026ను వాట్సాప్ ద్వారా సులభంగా పొందండి. హాల్ టికెట్ నంబర్‌తో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా రిజల్ట్ వెంటనే తెలుసుకోండి.
TG Inter Results 2026
TG Inter Results 2026 via WhatsApp: తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. రేపు విడుదల కానున్న ఇంటర్ ఫలితాలను ఇప్పుడు విద్యార్థులు నేరుగా వాట్సాప్ ద్వారా తమ మొబైల్ ఫోన్లలోనే పొందే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫలితాల కోసం ఎటువంటి వెబ్‌సైట్ లాగిన్ అవసరం లేకుండా, మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ సేవను వినియోగించుకోవచ్చు.
అధికారుల వివరాల ప్రకారం, గతంలో ఇదే విధానంలో హాల్ టికెట్లు విజయవంతంగా పంపిణీ చేయగా, ఇప్పుడు ఫలితాలను కూడా ఇదే ప్లాట్‌ఫారమ్ ద్వారా అందిస్తున్నారు. విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్‌లో 8096958096 నంబర్‌ను సేవ్ చేసి ‘Hi’ అని మెసేజ్ పంపాలి. అనంతరం మెనూలో “BIE Exam Result” ఎంపికను ఎంచుకుని, హాల్ టికెట్ నంబర్, సంవత్సరం (1వ సంవత్సరం/2వ సంవత్సరం), స్ట్రీమ్ (General/Vocational) వివరాలను నమోదు చేయాలి. వివరాలు సమర్పించిన వెంటనే ఫలితాలు మెసేజ్ రూపంలో ప్రత్యక్షమవుతాయి.
డిజిటల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగా, ఐటీ శాఖ ఈ మీసేవ వాట్సాప్ చాట్‌బాట్ సేవలను 2025 నవంబర్ 18న ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా 580కు పైగా ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయి. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రజలు ప్రతిరోజూ ఉపయోగించే సాంకేతికత ద్వారా ప్రభుత్వ సేవలను గడపగడపకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు.