Telangana: జూన్ 12న కాదు.. సెలవుల కలిసిరావడంతో మారిన స్కూల్స్ రీఓపెనింగ్ షెడ్యూల్!
Telangana: తెలంగాణలో పాఠశాలల పునః ప్రారంభం వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న స్కూళ్లు తెరవాల్సి ఉండగా, విద్యాశాఖ తాజాగా ఈ తేదీని మార్చింది.
Telangana: జూన్ 12న కాదు.. సెలవుల కలిసిరావడంతో మారిన స్కూల్స్ రీఓపెనింగ్ షెడ్యూల్!
Telangana: తెలంగాణలో పాఠశాలల పునః ప్రారంభం (Schools Reopening) తేదీలో స్వల్ప మార్పు జరిగింది. రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు జూన్ 15వ తేదీన పునః ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన అకడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారం జూన్ 12నే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వరుస సెలవుల నేపథ్యంలో ఈ తేదీని విద్యాశాఖ సవరించింది.
ముందుగా అనుకున్నట్లు జూన్ 12న స్కూళ్లు తెరిస్తే.. ఆ తర్వాతి రోజైన జూన్ 13వ తేదీ రెండో శనివారం (Second Saturday) కావడంతో విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఆపై జూన్ 14న ఆదివారం (Sunday) ఎలాగూ సాధారణ సెలవు దినం. కేవలం ఒకే ఒక్క రోజు (జూన్ 12) కోసం స్కూళ్లను తెరిచి, మళ్లీ వరుసగా రెండు రోజులు సెలవులు ఇవ్వడం కంటే.. నేరుగా సోమవారం నుంచే విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడం సముచితంగా ఉంటుందని విద్యాశాఖ భావించింది. అందుకే షెడ్యూల్‌లో మార్పు చేస్తూ జూన్ 15 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో విద్యార్థులకు మరో మూడు రోజులు అదనంగా వేసవి సెలవులు కలిసివచ్చినట్లయింది.
ఈ షెడ్యూల్ మార్పుల నేపథ్యంలో విద్యాశాఖ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. జూన్ 13వ తేదీన వచ్చే రెండో శనివారం సెలవుకు ప్రత్యామ్నాయంగా.. జులై 11న (రెండో శనివారం) పాఠశాలలను యథావిధిగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు (DEOs), పాఠశాలల యాజమాన్యాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది.