Petrol Price Hike : ఐదు రోజుల్లోనే రెండోసారి.. మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Price Hike : మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాకిచ్చాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల, పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి.
Petrol Price Hike
Petrol Price Hike : సామాన్యుడిపై మరోసారి ధరల భారం పడింది. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి చమురు కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచుతూ మంగళవారం (మే 19) నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపు ప్రకారం.. లీటర్ పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరిగాయి. గడచిన ఐదు రోజుల్లోనే ఇలా రేట్లు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత వారమే లీటరుకు సుమారు 3 రూపాయల వరకు పెంచిన కంపెనీలు, ఇప్పుడు మళ్ళీ బాదడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు.
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సాగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్ల పైనే కొనసాగుతోంది. చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద ఆంక్షలు, దిగ్బంధనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. యుద్ధం ముగిసే వరకు ధరలు ఇలాగే పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయాలు ఉన్నప్పటికీ, భారతదేశం వద్ద తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. దేశీయ అవసరాలకు సరిపడా ఇంధన సరఫరాను ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని, దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని కూడా పెంచామని పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని చమురు సంస్థలు వినియోగదారులపై వేయక తప్పడం లేదు. ఫలితంగా వాహనదారులకు ఈ ఇంధన సెగ తగులుతోంది.
తాజా పెంపుతో హైదరాబాద్, అమరావతి, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటి ఎప్పుడో ముందుకు వెళ్ళిపోయాయి. రవాణా ఖర్చులు పెరగడంతో పెట్రోల్ ధరల ప్రభావం కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులపై కూడా పడే అవకాశం ఉంది. యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించకపోవడం, మధ్యవర్తిత్వం కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ముడి చమురు సెగ సామాన్యుడిని మరింత కాలం వేధించేలా ఉంది. ఇంధన పొదుపు ఒక్కటే ఇప్పుడు వాహనదారులకు ఉన్న మార్గంలా కనిపిస్తోంది.