Alcohol Prices : బ్లాక్ లేబుల్ తాగే వాళ్లకు బంపర్ బొనాంజా.. క్వార్టర్ కొట్టే సామాన్యుడికి మాత్రం కన్నీళ్లే

Alcohol Prices : కర్ణాటక ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. ఆల్కహాల్ శాతం ఆధారంగా పన్నులు విధించడంతో సాధారణ మద్యం ధరలు పెరిగాయి, విదేశీ బ్రాండ్ల ధరలు భారీగా తగ్గాయి.

Update: 2026-05-18 03:12 GMT

Liquor Policy

Alcohol Prices : కర్ణాటక ప్రభుత్వం మద్యం విక్రయాల విషయంలో దశాబ్దాల నాటి పాత పద్ధతికి స్వస్తి పలికి, సరికొత్త ఆల్కహాల్ పర్సంటేజ్ ఆధారిత పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు బల్క్ లీటర్లు లేదా బ్రాండ్‌ను బట్టి పన్నులు ఉండేవి, కానీ ఇకపై పానీయంలో ఉండే ఆల్కహాల్ శాతాన్ని బట్టి ట్యాక్స్ డిసైడ్ చేస్తారు. ఈ మేరకు గతంలో ఉన్న 16 ఎక్సైజ్ ట్యాక్స్ స్లాబ్‌లను ప్రభుత్వం 8కి తగ్గించింది. ఈ అనూహ్య నిర్ణయంతో రాష్ట్రంలో మద్యం ధరల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. సాధారణ మద్యం ధరలు పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంటే, ప్రీమియం, విదేశీ మద్యం ధరలు భారీగా తగ్గి ధనికులకు పండగలా మారింది.

రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే బడ్జెట్ బ్రాండ్ల ధరలు 20% నుంచి 30% వరకు పెరిగాయి. ముఖ్యంగా మొదటి 5 స్లాబ్‌లలో ఉండే సాధారణ విస్కీ, రమ్, బ్రాందీ, వోడ్కా వంటి వాటిపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం పెంచింది. దీనివల్ల 180 మి.లీ క్వార్టర్ బాటిళ్లు, టెట్రా ప్యాక్‌ల ధరలు అమాంతం పెరిగాయి. ఉదాహరణకు, నిన్నటి వరకు రూ.80కే దొరికే ఒక సాధారణ క్వార్టర్ బాటిల్ ధర ఇప్పుడు దాదాపు రూ.105కు చేరింది. సామాన్యుడు ఎక్కువగా వాడే ఈ స్లాబ్‌ల నుంచే ప్రభుత్వానికి 75 శాతం ఆదాయం వస్తుండటం గమనార్హం.

కొత్త పాలసీ వల్ల అత్యంత ఖరీదైన ప్రీమియం, ఇంపోర్టెడ్ మద్యం ధరలు మాత్రం గణనీయంగా తగ్గాయి. 6 నుంచి 8వ స్లాబ్‌ల వరకు ఉన్న మద్యంపై సుంకాన్ని 10% నుంచి 15% తగ్గించడం వల్ల లగ్జరీ బ్రాండ్ల ధరలు 16% నుంచి 25% వరకు దిగివచ్చాయి. గతంలో రూ.5,190 పలికే 750 మి.లీ బ్లాక్ లేబుల్ లేదా చివాస్ రీగల్ బాటిల్ ధర ఏకంగా రూ.4,100కి పడిపోయింది. అంటే ఒక్కో బాటిల్‌పై వెయ్యి రూపాయలకు పైగా తగ్గుదల కనిపించింది. అలాగే కొన్ని రకాల మైల్డ్ బీర్ల ధరలు కూడా బ్రాండ్‌ను బట్టి రూ.20 నుంచి రూ.75 వరకు తగ్గాయి.

సరిహద్దుల నుంచి స్మగ్లింగ్‌కు చెక్ పెట్టేందుకేనా?

కర్ణాటక ప్రభుత్వం ఈ మార్పులు చేయడానికి ప్రధాన కారణం పొరుగు రాష్ట్రాలైన గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులతో మద్యం ధరలను సమం చేయడమే. కర్ణాటకలో ప్రీమియం బ్రాండ్ల ధరలు ఎక్కువగా ఉండటంతో పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా అవుతోందని ప్రభుత్వం గుర్తించింది. ధరలను తగ్గించడం ద్వారా ఈ స్మగ్లింగ్‌ను అరికట్టవచ్చని భావిస్తోంది. అలాగే తయారీదారులు మార్కెట్ పరిస్థితులను బట్టి తమ ఉత్పత్తులను తగిన స్లాబ్‌లలో ఉంచుకునేలా ధరల నియంత్రణను కూడా సడలించింది.

స్థానిక డిస్టిల్లర్ల నుంచి నిరసన సెగ

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కర్ణాటక బ్రూవర్స్ అండ్ డిస్టిల్లర్స్ అసోసియేషన్ (KBDA) కొంత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎక్సైజ్ ఆదాయంలో అత్యధిక భాగం సామాన్యులు కొనే మద్యం నుంచే వస్తుందని, ఇప్పుడు వాటి ధరలు పెంచడం వల్ల వినియోగం తగ్గి ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. కొత్త పాలసీ భారం ఎక్కువగా పేదవారిపైనే పడుతుందని, ధనికులకు మాత్రం రాయితీలు ఇచ్చినట్లు ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, ఈ కొత్త విధానం ఇప్పుడు రాష్ట్రంలో పెను చర్చకు దారితీసింది.

Tags:    

Similar News