Loan: హోమ్ లోన్ టాప్ అప్ తీసుకోవాలా.? పర్సనల్ లోన్ తీసుకోవాలా.? ఏది బెస్ట్!
Loan:జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఖర్చు వస్తుందో చెప్పలేం. ఇలాంటి సమయంలో ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్నవారికి హోమ్ లోన్ టాప్-అప్ ఒక మార్గం. మరోవైపు, ఎలాంటి హామీ లేకుండా తీసుకునే పర్సనల్ లోన్ కూడా అందుబాటులో ఉంటుంది. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్.
Loan: హోమ్ లోన్ టాప్ అప్ తీసుకోవాలా.? పర్సనల్ లోన్ తీసుకోవాలా.? ఏది బెస్ట్!
Loan: హోమ్ లోన్ టాప్-అప్ అంటే ఏమిటి.?
ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్నవారికి అదే రుణంపై అదనంగా కొంత మొత్తాన్ని బ్యాంకులు అందించే సదుపాయమే హోమ్ లోన్ టాప్-అప్. సాధారణంగా మీ హోమ్ లోన్ చెల్లింపుల రికార్డు సరిగ్గా ఉంటే ఈ రుణం పొందడం కొంత సులభంగా ఉంటుంది. మీ ఇల్లు ఇప్పటికే బ్యాంకు వద్ద తనఖాలో ఉండటంతో, ఇది పర్సనల్ లోన్ కంటే తక్కువ వడ్డీ రేటుకు లభించే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా పెద్ద మొత్తంలో డాక్యుమెంటేషన్ అవసరం లేకపోవచ్చు. ఇంటి మరమ్మతులు, రినోవేషన్ వంటి అవసరాలకు ఈ రుణం ఉపయోగపడుతుంది.
పర్సనల్ లోన్ ప్రత్యేకతలు ఏంటి.?
పర్సనల్ లోన్ అనేది అన్‌సెక్యూర్డ్ లోన్. అంటే ఈ రుణం కోసం ఇంటిని లేదా ఇతర ఆస్తిని బ్యాంకు వద్ద తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు. అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు పర్సనల్ లోన్ ద్వారా త్వరగా నిధులు పొందే అవకాశం ఉంటుంది. ఈ డబ్బును సాధారణంగా మీ అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. అయితే బ్యాంకుకు ఎలాంటి ఆస్తి భద్రత ఉండదు కాబట్టి పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు హోమ్ లోన్ టాప్-అప్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం, రుణ చరిత్ర ఆధారంగా వడ్డీ రేటు మారవచ్చు.
తక్కువ ఈఎంఐ చూసి నిర్ణయం తీసుకోవద్దు
రుణం తీసుకునేటప్పుడు చాలామంది నెలకు ఎంత ఈఎంఐ చెల్లించాలి అనే విషయాన్నే చూస్తారు. కానీ మొత్తం ఎంత వడ్డీ చెల్లించాలి అనేది కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకు, హోమ్ లోన్ టాప్-అప్‌పై వడ్డీ తక్కువగా ఉన్నా దాన్ని 15 లేదా 20 ఏళ్ల సుదీర్ఘ కాలానికి తీసుకుంటే ఎక్కువ కాలం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దీంతో మొత్తం చెల్లించే వడ్డీ పెరగవచ్చు. మరోవైపు పర్సనల్ లోన్‌పై వడ్డీ ఎక్కువగా ఉన్నప్పటికీ, దాని రుణ కాలం సాధారణంగా తక్కువగా ఉంటుంది. అందువల్ల నెలవారీ ఈఎంఐ ఎక్కువగా ఉన్నా తక్కువ సమయంలో రుణాన్ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వడ్డీ రేటు, ఈఎంఐతో పాటు మొత్తం రీపేమెంట్ మొత్తాన్ని కూడా లెక్కించాలి.
టాప్-అప్ లోన్‌పై పన్ను ప్రయోజనం అందరికీ ఉండదు
హోమ్ లోన్ టాప్-అప్ తీసుకుంటే వెంటనే పన్ను మినహాయింపు వస్తుందని అనుకోవడం తప్పు. టాప్-అప్ ద్వారా తీసుకున్న డబ్బును ఏ అవసరానికి ఉపయోగించారనే దానిపై పన్ను ప్రయోజనం ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు ఇంటి మరమ్మతులు లేదా రినోవేషన్ కోసం టాప్-అప్ రుణాన్ని ఉపయోగిస్తే, వర్తించే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం కొన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఇతర అవసరాలకు ఉపయోగించినప్పుడు పరిస్థితులు వేరుగా ఉండవచ్చు. అలాగే రుణం తీసుకునే సమయంలో ప్రాసెసింగ్ ఫీజు, లీగల్ ఛార్జీలు, ఇతర రుసుములు ఉన్నాయా అనేది కూడా ముందుగానే తెలుసుకోవాలి. ఇవన్నీ కలిపి రుణం మొత్తం ఖర్చును అంచనా వేయాలి.
మీకు ఏ రుణం సరిపోతుంది.?
* ఇప్పటికే హోమ్ లోన్ ఉండి, పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు, తక్కువ వడ్డీ రేటు కావాలనుకున్నప్పుడు హోమ్ టాప్ అప్ ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటి మరమ్మతులు లేదా రినోవేషన్ వంటి అవసరాలకు ఇది మంచి ఎంపిక కావచ్చు. అయితే వీలైనంత త్వరగా అదనపు రుణాన్ని ప్రీపే చేసి ముగించడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.
* తక్షణ అవసరానికి డబ్బు కావాల్సి వచ్చినప్పుడు, ఆస్తిని తనఖా పెట్టకుండా రుణం తీసుకోవాలనుకున్నప్పుడు
పర్సనల్ లోన్ ఎంచుకోవచ్చు. అయితే వడ్డీ రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, మీ ఆదాయానికి సరిపోయే ఈఎంఐని మాత్రమే ఎంచుకోవాలి.