LPG Connection: కొత్త ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లపై కేంద్రం బిగ్ అప్‌డేట్.. రీ-ఓపెన్ ఎప్పుడంటే?
LPG Connection: అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా నిలిపివేసిన 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ల పునరుద్ధరణపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ అసలు క్లారిటీ ఇచ్చింది.
LPG Gas
LPG Connection: దేశంలో కొత్త ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు పొందాలని చూస్తున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం అందించింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా నిలిపివేసిన 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ల పునరుద్ధరణపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ అసలు క్లారిటీ ఇచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల క్రమంలో అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి నెల నుంచి 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల కొత్త కనెక్షన్ల జారీని తాత్కాలికంగా పక్కనబెట్టింది. చమురు కంపెనీలు కూడా కొత్త కనెక్షన్ల దరఖాస్తులను స్వీకరించడం నిలిపివేశాయి. విదేశాల నుంచి భారత్‌కు చేరుకోవాల్సిన గ్యాస్ నౌకల రాకపై స్పష్టత లేకపోవడమే ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణం.
కొత్త కనెక్షన్ల పునరుద్ధరణ ఎప్పుడంటే?
కొత్త గ్యాస్ కనెక్షన్ల ప్రక్రియను శాశ్వతంగా నిలిపివేయలేదని, ఇది కేవలం తాత్కాలిక ఏర్పాటేనని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రపంచ మార్కెట్లో ఎల్పీజీ లభ్యత, సరఫరా యథాస్థితికి చేరుకున్న వెంటనే కొత్త కనెక్షన్ల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించింది. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ప్రభుత్వ తదుపరి అధికారిక ప్రకటన వచ్చేవరకు ప్రజలు వేచి చూడక తప్పదు.
చిన్న సిలిండర్లతో ప్రత్యామ్నాయం
కొత్త కనెక్షన్లు రాక ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. 5 కిలోలు, 10 కిలోల చిన్న సైజు సిలిండర్లను తీసుకోవచ్చని సూచించింది. ఏదైనా గుర్తింపు కార్డు చూపించి సమీపంలోని గ్యాస్ ఏజెన్సీలు లేదా రిటైల్ అవుట్‌లెట్లలో వీటిని నేరుగా పొందే వీలుంది. ముఖ్యంగా నగరాల్లో 10 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్లకు గిరాకీ పెరిగింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఈ సిలిండర్లు నేరుగా ఇంటికే డెలివరీ అవుతున్నాయి.
కేవైసీ ఆడిట్, వేగవంతమైన డెలివరీ
ప్రస్తుతం చమురు సంస్థలు ఉన్న వినియోగదారులకు సేవలు అందించడంపైనే పూర్తిగా దృష్టి సారించాయి. బోగస్ కనెక్షన్లు, ఒకరి పేరిటే ఉన్న రెండు కనెక్షన్లను గుర్తించేందుకు ఈ సమయాన్ని కేవైసీ అప్‌డేట్ కోసం ఉపయోగిస్తున్నాయి. సరఫరా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బుకింగ్ చేసిన ఒక్క రోజులోనే ఎల్పీజీ సిలిండర్ ఇంటికి చేరేలా వేగవంతమైన డెలివరీ వ్యవస్థను అమలు చేస్తున్నాయి.