Gold Price Today : పసిడి ప్రేమికులకు భారీ షాక్.. ఒకే వారంలో రూ.6,800 పైగా పెరిగిన బంగారం ధర

Gold Price Today : కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుతూ సామాన్యులకు, ముఖ్యంగా మహిళలకు కాస్త ఊరటనిచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా మళ్లీ రెక్కలు విప్పుకున్నాయి.

Update: 2026-07-05 01:13 GMT

Gold Price Today

 Gold Price Today : గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుతూ సామాన్యులకు, ముఖ్యంగా మహిళలకు కాస్త ఊరటనిచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా మళ్లీ రెక్కలు విప్పుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిరంతరం కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గడచిన ఒకే ఒక్క వారంలోనే తులం బంగారం ధర రూ.6,000 పైగా పెరగడం విశేషం. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1.47 లక్షల మార్కును దాటగా, కిలో వెండి ధర రూ.2.40 లక్షల పైకి ఎగబాకింది. ధరలు ఈ స్థాయిలో పెరిగిపోతుండటంతో ఇప్పుడు బంగారం కొనడం తెలివైన పనా, లేక రేట్లు తగ్గే వరకు వేచి చూడాలా అని కొనుగోలుదారులు అయోమయంలో పడ్డారు.

దేశీయంగా జూలై 5వ తేదీ నాటి బులియన్ మార్కెట్ తాజా ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,730 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,500 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికొస్తే, పారిశ్రామిక అవసరాలు, ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పెరగడంతో కిలో వెండి ధర ఏకంగా రూ.2,50,000 కొండెక్కి కూర్చుంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ఈ ధరల పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారాన్ని మోపుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,46,880గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,34,650 వద్ద విక్రయించబడుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు బెంగళూరు, కోల్‌కతా, మన తెలుగు రాష్ట్రాల ప్రధాన కేంద్రమైన హైదరాబాద్ నగరాల్లో ధరలు ఒకేలా ఉన్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1,46,730 గాను, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,34,450 గాను నమోదైంది. అయితే తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం ధరలు మరింత మండిపోతున్నాయి. అక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,49,460 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,37,000 పలికి దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది.

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) అధికారిక గణాంకాల ప్రకారం.. గడచిన వారం రోజుల్లోనే 24-క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,39,873 నుంచి ఏకంగా రూ.1,46,730కు పెరిగింది. అంటే కేవలం ఏడు రోజుల్లోనే వినియోగదారుడిపై రూ.6,857 అదనపు భారం పడింది. అదేవిధంగా, 22-క్యారెట్ల బంగారం ధర రూ.1,28,124 నుంచి రూ.1,34,450కు చేరగా, సాధారణ మధ్యతరగతి వారు కొనే 18-క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,04,905 నుంచి రూ.1,09,758కు పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‎లో కూడా ఇదే జోరు కనిపించింది. జూలై 3 నాటి ట్రేడింగ్ ముగిసే సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 1.30 శాతం పైగా పెరిగి రూ.1,47,365 వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 1.62 శాతం లాభంతో కిలోకు రూ.2,37,499 వద్ద ముగిశాయి.

Tags:    

Similar News