Fuel Tax Cut: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ట్రోల్, డీజిల్‌పై భారీగా పన్నుల కోత

Fuel Tax Cut: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతి సుంకాలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2026-05-31 04:26 GMT

Fuel Tax Cut

Fuel Tax Cut: ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలకు సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంలపై విధిస్తున్న ప్రత్యేక పన్నులను భారీగా తగ్గిస్తూ మే 30 శనివారం నాడు అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూన్ 1 నుంచి ఈ కొత్త తగ్గింపులు అమల్లోకి రానున్నాయి. అయితే, ఈ పన్నుల తగ్గింపు వల్ల సామాన్య వాహనదారులకు నేరుగా లబ్ధి చేకూరుతుందా లేదా అనే విషయాలపై లీటర్ల వారీగా లెక్కలు ఇలా ఉన్నాయి.

ఎగుమతి సుంకాలపై కేంద్రం కోత.. లీటరుకు ఎంత తగ్గిందంటే?

ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. పెట్రోల్ ఎగుమతిపై లీటరుకు రూ.1.50 చొప్పున పన్ను తగ్గించారు. అలాగే డీజిల్ ఎగుమతిపై ఏకంగా లీటరుకు రూ.13.50, విమానాల్లో వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతిపై లీటరుకు రూ.9.50 మేర సుంకాన్ని తగ్గించారు. అంతర్జాతీయంగా చమురు రేట్లు కాస్త అదుపులోకి రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

దేశీయంగా మనకు ధరలు తగ్గుతాయా..?

కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించింది నిజమే అయినప్పటికీ, దీనివల్ల మన ఊర్లలో బంకుల్లో దొరికే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గవు. ఎందుకంటే ప్రభుత్వం ఈ తగ్గింపును కేవలం ఎగుమతి సుంకాల పై మాత్రమే వర్తింపజేసింది. దేశీయంగా స్థానిక వినియోగం కోసం విక్రయించే ఇంధనాలపై ఎలాంటి పన్నులు మార్చలేదు. కాబట్టి మనకు రోజూవారీగా లభించే పెట్రోల్, డీజిల్ ధరలలో తక్షణమే ఎలాంటి మార్పు ఉండబోదు.

అమెరికా-ఇరాన్ ఒప్పందంతో ఊరట

గత వారంలోనే చమురు కంపెనీలు నాలుగు సార్లు ధరలు పెంచడంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ధరలు ఇంకా పెరిగిపోతాయేమోనన్న భయం అందరిలోనూ మొదలైంది. అయితే, అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించేందుకు తాత్కాలిక ఒప్పందం కుదరడం పెద్ద ప్లస్ పాయింట్ అయింది. దీనివల్ల బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు $93 డాలర్లకు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర బ్యారెల్‌కు $88 డాలర్లకు పడిపోయింది.

ఆదివారం స్థిరంగా ఇంధన ధరలు

పశ్చిమ ఆసియాలో రేగిన ఉద్రిక్తతల వల్ల దేశంలో ఇంధన కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం 2026 మార్చి 27న ఈ ప్రత్యేక పన్నును మొదటిసారిగా ప్రవేశపెట్టింది. చివరిసారిగా మే 16న చమురు కంపెనీలు ధరలను సవరించాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102.12, డీజిల్ రూ.95.20 గా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.69 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.103 వద్ద విక్రయించబడుతోంది.

Tags:    

Similar News