EPFO: పీఎఫ్ అకౌంట్ ఉంటే చాలు.. రూపాయి చెల్లించకపోయినా రూ. 7 లక్షల బీమా
EPFO: ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన ప్రయోజనం ఉంది.
EPFO: ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన ప్రయోజనం ఉంది. మీ జీతం నుంచి పీఎఫ్ (PF) కట్ అవుతుంటే, మీరు ఆటోమేటిక్‌గా ఒక ప్రభుత్వ బీమా పథకానికి అర్హులు అవుతారు. ఈ పథకం ద్వారా ఉద్యోగి కుటుంబానికి గరిష్టంగా రూ.7 లక్షల వరకు ఆర్థిక భద్రత లభిస్తుంది.
EDLI పథకం అంటే ఏమిటి?
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) అమలు చేస్తున్న ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద ఈ బీమా రక్షణ లభిస్తుంది. ఒక ఉద్యోగి పనిచేస్తున్న సమయంలో అనుకోకుండా మరణిస్తే, అతని కుటుంబ సభ్యులు లేదా నామినీకి ఒకేసారి బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ పథకంలో చేరేందుకు ప్రత్యేకంగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. పీఎఫ్ ఖాతా ప్రారంభమైన వెంటనే ఉద్యోగి ఈ బీమా రక్షణ పరిధిలోకి వస్తారు.
ఉద్యోగి ఒక్క రూపాయి కట్టాల్సిన పనిలేదు
ఈ బీమా పథకంలోని ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, ఉద్యోగి నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయరు. ఉద్యోగి జీతంలో నుంచి దీనికోసం అదనంగా డబ్బు కట్ చేయరు. ఉద్యోగి పనిచేస్తున్న సంస్థే ఈ బీమా కోసం నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తుంది. పీఎఫ్ ఖాతా యాక్టివ్‌గా ఉన్నంత కాలం ఈ బీమా కవరేజ్ కొనసాగుతుంది. ఉద్యోగి మరణించిన సందర్భంలో కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఈ మొత్తం అందుతుంది.
PF, EPS, EDLI.. మీ డబ్బు ఎలా విభజిస్తారు?
ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం EPFO మూడు ప్రధాన పథకాలను అమలు చేస్తోంది.
ఈపీఎఫ్ (Employee Provident Fund)
ఉద్యోగి బేసిక్ జీతంలో 12 శాతం ఈ ఖాతాలో జమ అవుతుంది. సంస్థ కూడా సమాన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇది రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పిస్తుంది.
ఈపీఎస్ (Employee Pension Scheme)
ఉద్యోగి నుంచి డబ్బు కట్ చేయరు. సంస్థ చెల్లించే వాటాలో కొంత భాగం పెన్షన్ నిధికి వెళ్తుంది. దీని ద్వారా భవిష్యత్‌లో నెలవారీ పెన్షన్ లభిస్తుంది.
ఈడీఎల్ఐ (Insurance Scheme)
ఈ బీమా పథకానికి కూడా ఉద్యోగి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. సంస్థ ఉద్యోగి బేసిక్ జీతంలో 0.5 శాతం వరకు బీమా నిధికి జమ చేస్తుంది.
రూ.7 లక్షల బీమా మొత్తం ఎలా లెక్కిస్తారు?
EDLI పథకం కింద చెల్లించే బీమా మొత్తం ఉద్యోగి గత 12 నెలల సగటు వేతనం, పీఎఫ్ బ్యాలెన్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. గత 12 నెలల సగటు నెల జీతానికి 35 రెట్లు వరకు లెక్కిస్తారు. ఈ లెక్కింపులో గరిష్ట వేతన పరిమితి రూ.15,000గా పరిగణిస్తారు. దీంతో గరిష్టంగా రూ.5.25 లక్షల వరకు బీమా మొత్తం వస్తుంది. అదనంగా, ఉద్యోగి పీఎఫ్ బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు బోనస్ రూపంలో చెల్లిస్తారు. ఈ బోనస్ గరిష్ట పరిమితి రూ.1.75 లక్షలుగా ఉంటుంది. ఈ రెండు కలిపి కుటుంబ సభ్యులు లేదా నామినీ గరిష్టంగా రూ.7 లక్షల వరకు క్లెయిమ్ పొందే అవకాశం ఉంటుంది.
కనీస బీమా ప్రయోజనం కూడా అందుబాటులోనే
తక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగులు లేదా ఇటీవలే ఉద్యోగంలో చేరిన వారి కుటుంబాలకు కూడా రక్షణ కల్పించే నిబంధనలు ఉన్నాయి. సాధారణంగా ఈ పథకం కింద కనీస బీమా ప్రయోజనం రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం మరణించిన ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో సగటు నిల్వ రూ.50,000 కంటే తక్కువగా ఉంటే కూడా కుటుంబానికి కనీసం రూ.50,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది. అందువల్ల పీఎఫ్ కట్ అవుతున్న ప్రతి ఉద్యోగి ఈ ప్రయోజనం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తోంది.