EPFO 3.0: అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్ఓ 3.0... దీంతో జరిగే మార్పు ఏంటి.? ఉద్యోగులకు జరిగే లాభం ఏంటి.?
EPFO 3.0: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సేవలను మరింత సులభతరం చేసే దిశగా కీలక అడుగు వేసింది.
EPFO 3.0: అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్ఓ 3.0... దీంతో జరిగే మార్పు ఏంటి.? ఉద్యోగులకు జరిగే లాభం ఏంటి.?
EPFO 3.0: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సేవలను మరింత సులభతరం చేసే దిశగా కీలక అడుగు వేసింది. CITES (Centralised IT Enabled Services) ప్రాజెక్ట్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న సభ్యుల డేటాను ఒకే కేంద్ర డేటాబేస్‌లోకి మార్చింది. దీంతో పీఎఫ్ క్లెయిమ్, యూఏఎన్ ట్రాన్స్‌ఫర్, పాస్‌బుక్, పెన్షన్ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి రానున్నాయి.
CITES ప్రాజెక్ట్ అంటే ఏమిటి?
ఇప్పటి వరకు ప్రతి ప్రాంతీయ EPFO కార్యాలయానికి వేర్వేరు డేటాబేస్ ఉండేది. అందువల్ల సభ్యులు తమకు సంబంధించిన సేవల కోసం ఆయా కార్యాలయాలపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు CITES ప్రాజెక్ట్ ద్వారా దేశంలోని సభ్యులందరి వివరాలను ఒకే జాతీయ డేటాబేస్‌లోకి మార్చారు. దీంతో దేశంలోని ఏ EPFO కార్యాలయం నుంచైనా సభ్యుల దరఖాస్తులను పరిశీలించి సేవలు అందించే అవకాశం ఏర్పడింది. పీఎఫ్ క్లెయిమ్, పెన్షన్, యూఏఎన్ ట్రాన్స్‌ఫర్ వంటి సేవలు మరింత వేగంగా పూర్తవుతాయి.
సభ్యులకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే
EPFO 3.0తో సభ్యులకు అనేక కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. పీఎఫ్ క్లెయిమ్‌లు వేగంగా ప్రాసెస్ అవుతాయి. క్లెయిమ్ ఆమోదం పొందిన రోజే డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధానం అమలు అవుతుంది. పీఎఫ్ తుది సెటిల్‌మెంట్‌లో చెల్లింపు ఆమోదించిన తేదీ వరకు వడ్డీ లభిస్తుంది. దీంతో సభ్యులకు గతంతో పోలిస్తే ఎక్కువ వడ్డీ వస్తుంది. ఒకే పోర్టల్‌లో పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ స్థితి, సభ్యత్వ వివరాలు, పెన్షన్ సేవల సమాచారం, పొందిన ప్రయోజనాలు అన్నీ చూడవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ జమ అయిన వెంటనే పాస్‌బుక్‌లో కూడా కనిపిస్తుంది. క్లెయిమ్ తిరస్కరణలు తగ్గుతాయి.. పీఎఫ్ ఉపసంహరణ కూడా సులభమవుతుంది.
కొత్త వ్యవస్థలో క్లెయిమ్ దాఖలు చేసే ముందు అవసరమైన పత్రాలు, వివరాలను సిస్టమ్ ఆటోమేటిక్‌గా చెక్ చేస్తుంది. ఏదైనా లోపం ఉంటే వెంటనే సభ్యుడికి తెలియజేస్తుంది. దీంతో క్లెయిమ్ తిరస్కరణలు తగ్గే అవకాశం ఉంది. అలాగే వివిధ అవసరాలకు ఎంత వరకు పీఎఫ్ తీసుకోవచ్చో కూడా సభ్యులు ముందుగానే తెలుసుకోగలరు. గతంలో తెలియక ఎక్కువ మొత్తం కోరడం వల్ల క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యేవి. ఇక కొత్త నిబంధనల ప్రకారం సభ్యులు తమ మొత్తం పీఎఫ్ నిల్వలో 75 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, పూర్తిగా KYC పూర్తి చేసిన సభ్యులు రూ.5 లక్షల వరకు అడ్వాన్స్ పీఎఫ్ క్లెయిమ్ చేస్తే ఆటో సెటిల్‌మెంట్ ద్వారా త్వరగా పరిష్కారం లభిస్తుంది. గతంలో ఈ పరిమితి రూ.1 లక్ష మాత్రమే ఉండేది.
ఉద్యోగం మారితే పీఎఫ్ ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్
ఆధార్‌తో అనుసంధానమైన యూఏఎన్ ఉన్న సభ్యులకు ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఖాతా ఆటోమేటిక్‌గా కొత్త సంస్థకు బదిలీ అవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు. పాత, కొత్త యజమానుల ఆమోదం కూడా అవసరం లేదు. క్లెయిమ్ పరిశీలన సమయంలో అదనపు సమాచారం అవసరమైతే సభ్యులు ఆన్‌లైన్‌లోనే సమాధానం ఇవ్వొచ్చు. దీంతో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. అలాగే పీఎఫ్ ఉపసంహరణ నిబంధనలను కూడా సులభతరం చేశారు. గతంలో ఉన్న 13 వేర్వేరు నియమాలను ఇప్పుడు అత్యవసర అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు విభాగాలుగా మార్చారు.
EPFO అమ్నెస్టీ స్కీమ్ 2026 కూడా ప్రారంభం
EPFO అమ్నెస్టీ స్కీమ్ 2026ను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం 2026 జూన్ 29 నుంచి ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం కింద గుర్తింపు పొందినా, EPF చట్టం ప్రకారం అవసరమైన మినహాయింపు పొందని ఎగ్జెంప్టెడ్ పీఎఫ్ ట్రస్టులకు తమ చట్టపరమైన స్థితిని సరిచేసుకునేందుకు ఇది ఒక ప్రత్యేక అవకాశం. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న సంస్థలు భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు లేకుండా తమ నమోదును క్రమబద్ధీకరించుకోవచ్చు.