Bank Holidays : ఖాతాదారులకు అలర్ట్.. ఈ వారం ఏకంగా 4 రోజులు బ్యాంకులు బంద్
Bank Holidays : జూన్ 22 నుంచి 28 మధ్య మొహర్రం, నాలుగో శనివారం, ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు 4 రోజులు మూతపడనున్నాయి. ఆన్‌లైన్, యూపీఐ సేవలు యథావిధిగా పనిచేస్తాయి.
Bank Holidays
Bank Holidays : మీకు బ్యాంకులో చెక్కులు డిపాజిట్ చేయడం, డిమాండ్ డ్రాఫ్ట్ తీయడం లేదా కొత్త ఖాతా తెరవడం వంటి పనులు ఉంటే ఈ వారంలో ప్లాన్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆర్‌బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. జూన్ 22 నుంచి జూన్ 28 మధ్య దేశంలో వేర్వేరు రాష్ట్రాల పండుగలు, ఐదో వీకెండ్స్ కారణంగా నాలుగు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఈ జూన్ నెలలో శని, ఆదివారాలు, ప్రాంతీయ పండుగలతో కలిపి మొత్తంగా 11 రోజులు బ్యాంకులకు సెలవు దినాలుగా ప్రకటించారు.
ఏ రోజు ఎక్కడెక్కడ సెలవులంటే?
ఈ వారంలో జూన్ 25, జూన్ 26, జూన్ 27, జూన్ 28 తేదీలలో బ్యాంకులు మూతపడనున్నాయి.
* జూన్ 25 (గురువారం): మొహర్రం సందర్భంగా కేవలం విజయవాడ (ఆంధ్రప్రదేశ్) ప్రాంతంలో బ్యాంకులు పనిచేయవు.
* జూన్ 26 (శుక్రవారం): మొహర్రం పండుగ కారణంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, లక్నో, కాన్పూర్, భోపాల్, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, జమ్మూ, శ్రీనగర్, అగర్తలా, ఐజ్వాల్, నాగ్‌పూర్, బెలాపూర్ నగరాల్లో బ్యాంకులు బంద్ అవుతాయి.
* జూన్ 27 (శనివారం): నెలలోని నాలుగో శనివారం అయినందున దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు క్లోజ్ అవుతాయి.
* జూన్ 28 (ఆదివారం): వీక్లీ హాలిడే కావడంతో దేశంలోని అన్ని బ్యాంకు శాఖలకు సెలవు ఉంటుంది.
జూన్ నెలలోని మరికొన్ని సెలవులు
రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. ప్రతి నెలలో రెండు, నాలుగో శనివారాలతో పాటు అన్ని ఆదివారాలు బ్యాంకులకు అధికారిక సెలవులు ఉంటాయి. ఈ క్రమంలో జూన్ 7, 14, 21, 28 తేదీలలో ఆదివారాల వల్ల బ్యాంకులు పనిచేయలేదు. అలాగే జూన్ 13న రెండో శనివారం, జూన్ 27న నాలుగో శనివారం సెలవు వచ్చింది. ఇవి కాకుండా జూన్ 29న షిమ్లాలో సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా, జూన్ 30న ఐజ్వాల్‌లో ప్రాంతీయ పండుగ రెమనా నీ కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి.
అందుబాటులో ఉండనున్న డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులు
బ్యాంకు బ్రాంచ్‌లు మూతపడినప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. కస్టమర్లు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ ద్వారా డబ్బులు పంపుకోవచ్చు. అలాగే మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు, డెబిట్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలు ఎప్పటిలాగే పనిచేస్తాయి. ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్ ద్వారా కూడా నిధుల బదిలీ చేసుకోవచ్చు. కాబట్టి బ్యాంకుకు వెళ్లే పని ఉంటే మాత్రం ఈ సెలవుల లిస్ట్ చూసుకుని మీ పనులను ముందే ప్లాన్ చేసుకోండి.