SIP: నెలకు రూ. 5 వేలు పెట్టుబడి పెడితే.. 5 ఏళ్లలో ఎంత అవుతుందో తెలుసా.?
SIP: పెట్టుబడులు ప్రారంభించాలనుకునే వారికి ఎక్కువగా వినిపించే సలహా SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్).
SIP: నెలకు రూ. 5 వేలు పెట్టుబడి పెడితే.. 5 ఏళ్లలో ఎంత అవుతుందో తెలుసా.?
SIP: పెట్టుబడులు ప్రారంభించాలనుకునే వారికి ఎక్కువగా వినిపించే సలహా SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్). ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు.
అయితే నెలకు రూ.5,000 SIP చేస్తే 5 సంవత్సరాల తర్వాత ఎంత మొత్తం చేతికి వస్తుంది.? లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్లలో రాబడి ఎలా ఉంటుంది.? ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం.
5 ఏళ్లలో మీరు పెట్టే మొత్తం ఎంత.?
నెలకు రూ.5,000 చొప్పున SIP చేస్తే ఏడాదికి రూ.60,000 పెట్టుబడి పెడతారు. ఇలా వరుసగా 5 సంవత్సరాలు కొనసాగిస్తే మీ మొత్తం పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది. అయితే మ్యూచువల్ ఫండ్లలో మీ పెట్టుబడికి వచ్చే రాబడి మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. అన్ని ఫండ్లు ఒకే రకమైన రిటర్న్స్ ఇవ్వవు. సాధారణంగా లార్జ్ క్యాప్ ఫండ్లలో రిస్క్ తక్కువగా ఉండగా, మిడ్ క్యాప్‌లో కొంత ఎక్కువ, స్మాల్ క్యాప్‌లో అత్యధికంగా ఉంటుంది.
లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో ఎంత వస్తుంది.?
మార్కెట్‌లోని పెద్ద, స్థిరమైన కంపెనీల్లో లార్జ్ క్యాప్ ఫండ్లు పెట్టుబడి పెడతాయి. అందువల్ల ఇతర కేటగిరీలతో పోలిస్తే వీటిలో రిస్క్ కొంత తక్కువగా ఉంటుందని భావిస్తారు. సగటున 10 నుంచి 12 శాతం వార్షిక రాబడి వస్తుందని అంచనా వేసుకుంటే.. 10% రిటర్న్ వస్తే 5 సంవత్సరాల తర్వాత సుమారు రూ.3.85 లక్షలు అవుతుంది.
అదే 12 శాతం రిటర్న్ అంచనా వేస్తే సుమారు రూ.4.05 లక్షలు అవుతుంది. అంటే మీరు పెట్టిన రూ.3 లక్షలపై మార్కెట్ రాబడిని బట్టి అదనపు లాభం పొందే అవకాశం ఉంటుంది. రిస్క్ తక్కువగా తీసుకోవాలనుకునే వారికి లార్జ్ క్యాప్ ఫండ్లు ఒక ఎంపికగా చెప్పొచ్చు.
మిడ్ క్యాప్ ఫండ్స్‌లో రాబడి ఎలా ఉంటుంది.?
మధ్యస్థాయి కంపెనీల్లో పెట్టుబడి పెట్టే మిడ్ క్యాప్ ఫండ్లలో వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. అయితే లార్జ్ క్యాప్‌తో పోలిస్తే మార్కెట్ ఒడిదొడుకుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. సగటున 12 నుంచి 15 శాతం వరకు రాబడి వస్తుందని అంచనా వేసుకుంటే, నెలకు రూ.5,000 SIPపై 5 సంవత్సరాల తర్వాత మంచి మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు.
15% వార్షిక రాబడి వచ్చినట్లయితే, 5 ఏళ్ల తర్వాత సుమారు రూ.4.36 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ మొత్తం పెట్టుబడి రూ.3 లక్షలు కాగా, సుమారు రూ.1.36 లక్షలు లాభం రావచ్చు. అయితే ఇది కేవలం అంచనా మాత్రమే. మార్కెట్ పరిస్థితులను బట్టి వాస్తవ రాబడి తగ్గొచ్చు లేదా పెరగొచ్చు.
స్మాల్ క్యాప్‌లో ఎక్కువ రిటర్న్.. కానీ రిస్క్ కూడా ఎక్కువే
చిన్న కంపెనీల్లో పెట్టుబడి పెట్టే స్మాల్ క్యాప్ ఫండ్లలో వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో రిస్క్ కూడా అధికంగా ఉంటుంది. మార్కెట్ పడిపోయిన సమయంలో ఈ ఫండ్లు భారీగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది.
ఒకవేళ మంచి మార్కెట్ పరిస్థితుల్లో అధిక రాబడి వస్తే.. 20% రిటర్న్ వస్తే 5 సంవత్సరాల తర్వాత సుమారు రూ.4.93 లక్షలు, అదే 25 శాతం రిటర్న్ అంచనా వేస్తే.. సుమారు రూ.5.56 లక్షలు ఫండ్ సమకూరుతుంది.
అయితే 20 నుంచి 25 శాతం రాబడి ప్రతి సంవత్సరం వస్తుందని భావించడం సరైంది కాదు. స్మాల్ క్యాప్ ఫండ్లలో కొన్నిసార్లు స్వల్పకాలంలో నెగెటివ్ రిటర్న్స్ కూడా కనిపించవచ్చు.
అందువల్ల పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఫండ్‌ను ఎంచుకోవాలి. తక్కువ రిస్క్ కోరుకునేవారు లార్జ్ క్యాప్ వైపు, కొంత రిస్క్ తీసుకునేవారు మిడ్ క్యాప్ వైపు, దీర్ఘకాలం పాటు అధిక రిస్క్ భరించగలిగేవారు స్మాల్ క్యాప్ వైపు చూడవచ్చు.
ముఖ్యంగా ఒకే ఫండ్‌లో మొత్తం పెట్టుబడి పెట్టకుండా వివిధ కేటగిరీల్లో పెట్టుబడులను విభజించడం మంచిది. మార్కెట్ రోజువారీ హెచ్చుతగ్గులను చూసి SIPని మధ్యలో ఆపకుండా, దీర్ఘకాల లక్ష్యంతో కొనసాగిస్తే కాంపౌండింగ్ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.
గమనిక: మ్యూచువల్ ఫండ్ల రాబడులు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. పైన పేర్కొన్న మొత్తాలు అంచనా రాబడి ఆధారంగా చేసిన లెక్కలు మాత్రమే. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది. ఈ సమాచారాన్నే ప్రామాణికంగా భావించకూడదు.