El Nino impact: ఆగస్టులో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పెరుగుదల.. ఇదే కారణం

El Nino impact: వర్షభావ పరిస్థితులతో ఆగస్టులో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి.

Update: 2026-09-01 22:52 GMT

El Nino impact: ఆగస్టులో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు పెరుగుదల.. ఇదే కారణం

El Nino impact: భారతదేశంలో పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ ఆగస్టులో గణనీయంగా పెరిగింది. అస్థిరమైన రుతుపవన వర్షాల కారణంగా వ్యవసాయ అవసరాలు, వాహనాల రాకపోకలకు ఇంధన వినియోగం పెరగడంతో ప్రభుత్వ రంగంలోని మూడు ప్రధాన చమురు మార్కెటింగ్ సంస్థల అమ్మకాలు వృద్ధి చెందాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) కలిపి ఆగస్టులో పెట్రోల్ అమ్మకాలు 9.1 శాతం పెరిగి 3.48 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 3.19 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.

జూలైలో పెట్రోల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 9.7 శాతం పెరగగా.. ఆగస్టులోనూ దాదాపు అదే స్థాయిలో వృద్ధి కొనసాగింది. 2023 ఆగస్టుతో పోలిస్తే ఈసారి పెట్రోల్ అమ్మకాల పరిమాణం 30.7 శాతం అధికంగా ఉంది. నెలవారీగా చూస్తే జూలైతో పోలిస్తే ఆగస్టులో పెట్రోల్ అమ్మకాలు దాదాపు ఒక శాతం పెరిగి 3.45 మిలియన్ టన్నులకు చేరాయి.

దేశ ఆర్థిక కార్యకలాపాలకు కీలక సూచికగా భావించే డీజిల్ అమ్మకాల్లోనూ గణనీయమైన వృద్ధి నమోదైంది. ఆగస్టులో డీజిల్ అమ్మకాలు 10.2 శాతం పెరిగి 6.27 మిలియన్ టన్నులకు చేరాయి. గత ఏడాది ఆగస్టులో ఈ అమ్మకాలు 5.69 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ డిమాండ్‌లో రెండంకెల వార్షిక వృద్ధి నమోదవడం ఇది వరుసగా రెండో నెల. జూలైలోనూ డీజిల్ అమ్మకాలు 10.7 శాతం పెరిగాయి.

భారతదేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనం డీజిల్. రవాణా వాహనాలతో పాటు వ్యవసాయ యంత్రాలు, నీటిపారుదల వ్యవస్థల్లో దీని వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది రుతుపవనాల వర్షాలు ఆలస్యంగా, అస్థిరంగా రావడంతో పంటలకు నీరు అందించేందుకు రైతులు డీజిల్ పంపులను ఎక్కువగా ఉపయోగించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణంగా రుతుపవనాలు చురుగ్గా ఉన్న సమయంలో నీటిపారుదల పంపుల వినియోగం తగ్గడంతో డీజిల్ డిమాండ్ కూడా తగ్గుతుంది. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది.

2023 ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో డీజిల్ అమ్మకాలు 6.3 శాతం అధికంగా ఉన్నాయి. అయితే నెలవారీ ప్రాతిపదికన మాత్రం అమ్మకాలు తగ్గాయి. జూలైలో 7.13 మిలియన్ టన్నులుగా ఉన్న డీజిల్ అమ్మకాలు ఆగస్టులో 12 శాతం తగ్గి 6.27 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి.

ఇదిలా ఉంటే విమాన ఇంధనం అయిన ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) అమ్మకాలు కూడా ఆగస్టులో పెరిగాయి. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ATF అమ్మకాలు 5.6 శాతం పెరిగి 6,77,100 టన్నులకు చేరుకున్నాయి. 2024 ఆగస్టులో నమోదైన 6,39,700 టన్నులతో పోలిస్తే ఇది 5.9 శాతం, 2023 ఆగస్టులోని 5,75,400 టన్నులతో పోలిస్తే 17.7 శాతం ఎక్కువ. జూలైలో 6,68,500 టన్నులుగా ఉన్న అమ్మకాలతో పోలిస్తే నెలవారీగా కూడా 1.3 శాతం వృద్ధి నమోదైంది.

మరోవైపు వంటగ్యాస్ అయిన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) అమ్మకాలు మాత్రం తగ్గాయి. ఆగస్టులో LPG అమ్మకాలు 16.1 శాతం తగ్గి 2.42 మిలియన్ టన్నులకు పడిపోయాయి. జూలైలోనూ LPG డిమాండ్ 17.4 శాతం తగ్గింది. పశ్చిమాసియా సంక్షోభం తర్వాత కొంతమేర LPG వినియోగం పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వైపు మళ్లడం ఈ తగ్గుదలకు ఒక కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

Tags:    

Similar News