Kotappakonda mystery: కోటప్పకొండపై కాకులు ఎందుకు ఉండవు.. మహాశివుడే స్వయంగా చెప్పిన రహస్యం
Kotappakonda mystery: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో వెలసిన కోటప్పకొండ అద్భుతాలకు పుట్టినిల్లు.
Kotappakonda mystery: కోటప్పకొండపై కాకులు ఎందుకు ఉండవు.. మహాశివుడే స్వయంగా చెప్పిన రహస్యం
Kotappakonda mystery: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో వెలసిన కోటప్పకొండ అద్భుతాలకు పుట్టినిల్లు. ఇక్కడ పరమశివుడు దక్షిణామూర్తిగా, బాల గురువుగా కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రంలో అనేక విశేషాలు ఉన్నప్పటికీ, అందరినీ ఆశ్చర్యపరిచే ఒకే ఒక రహస్యం.. ఈ కొండపై కాకులు వాలకపోవడం. ప్రకృతి సహజ సిద్ధంగా ఎక్కడైనా పక్షులు కనిపిస్తాయి కానీ, కోటప్పకొండ పరిసరాల్లో కాకి అరుపు వినిపించదు, ఆ పక్షి నీడ కూడా కొండపై పడదు. ఇదంతా మహాశివుని మహిమగా చెబుతారు.
మహాశివుని మహిమ..గొల్లభామ కథ
పురాణాల ప్రకారం, నేటి కోటప్పకొండను పూర్వం త్రికూటాచలం అని పిలిచేవారు. మూడు శిఖరాలతో కనిపించే ఈ కొండ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా భావించబడుతుంది. ఇక్కడ మహాశివుడు దక్షిణామూర్తి రూపంలో తపస్సు చేసినట్లు పురాణాలు చెబుతాయి. సృష్టికర్త బ్రహ్మకు కూడా ఇక్కడే జ్ఞానబోధ చేసినట్టు విశ్వాసం.
ఈ ప్రాంతంలో సుందుడు అనే యాదవుడు తన పశువులను మేపుతూ నిత్యం స్వామివారిని దర్శించేవాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు అతనికి ఒక ఆడపిల్లను ప్రసాదించాడు. ఆ అమ్మాయికి గొల్లభామ అని పేరు పెట్టారు. చిన్ననాటి నుంచే ఆమెకు త్రికుటేశ్వరుడిపై అపారమైన భక్తి ఏర్పడింది.
ఒక రోజు, గర్భిణిగా ఉన్నప్పటికీ గొల్లభామ స్వామివారికి నైవేద్యం సమర్పించేందుకు కొండపైకి బయలుదేరింది. అలసటతో మధ్యలో కూర్చున్నప్పుడు, ఒక కాకి వచ్చి ఆమె తీసుకెళ్తున్న పెరుగును కింద పడేసింది. ఈ ఘటనతో గొల్లభామ తీవ్రంగా బాధపడింది.
ఆమె బాధను గమనించిన మహాశివుడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై విషయం తెలుసుకున్నాడు. వెంటనే ఆగ్రహంతో “ఇకపై ఈ త్రికూటాచలం పై కాకులు వాలకూడదు” అని శపించాడు. అప్పటి నుంచి ఈ కొండపై కాకులు కనిపించవని భక్తుల విశ్వాసం.
కోటప్పకొండ విశేషాలు
సాధారణంగా శివాలయాల్లో శివుడు లింగ రూపంలో ఉంటాడు, కానీ ఇక్కడ దక్షిణామూర్తిగా కొలువై ఉండటం విశేషం. స్వామి వారు ఇక్కడ బ్రహ్మచారి కావడంతో, ఈ కొండపై వివాహ శుభకార్యాలు నిర్వహించరు. మహాశివరాత్రి రోజున వందల సంఖ్యలో విద్యుత్ ప్రభలు కొండకు తరలివస్తాయి. ఈ వైభవం మరెక్కడా కనిపించదు. శివరాత్రి రోజున కోటప్పకొండకు వచ్చే భక్తజనాన్ని చూసి శ్రీవేంకటేశ్వరుడికి తలపోటు వస్తుందని, అందుకే ఆ రోజు తిరుమలలో స్వామివారికి తలపాగా చుడతారని ఒక ఆసక్తికరమైన నమ్మకం ఉంది.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిరూపమైన ఈ త్రికుటాచలం జ్ఞానాన్ని ప్రసాదించే దివ్యక్షేత్రం. సైన్స్ అందించలేని సమాధానం ఇక్కడ భక్తి రూపంలో కనిపిస్తుంది. ఒక్కసారి ఆ కొండపై అడుగుపెడితే, కాకులు ఎందుకు ఉండవో గమనిస్తే.. ఆ భోళాశంకరుడి మహిమ ఎంతటిదో మనకు ఇట్టే అర్థమవుతుంది. ఇది క్లుప్తంగా కోటప్పకొండ రహస్యం.