TVS : సిటీ రైడింగ్, హైవే టూరింగ్‌కు బెస్ట్ ఛాయిస్.. భారీ ఫీచర్లతో వస్తున్న టీవీఎస్ మ్యాక్సీ స్కూటర్

TVS : భారత మార్కెట్లోకి టీవీఎస్ కంపెనీ సరికొత్త 160cc మ్యాక్సీ స్కూటర్ తీసుకురానుంది. యమహా ఏరాక్స్ 155, హీరో జూమ్ 160 మోడళ్లకు పోటీగా 2027 చివరి నాటికి ఇది లాంచ్ కానుంది.

Update: 2026-06-08 02:48 GMT

TVS Scooter

TVS : టూ వీలర్ లవర్స్‌కు టీవీఎస్ మోటార్ కంపెనీ ఒక క్రేజీ అప్‌డేట్ అందించింది. భారతీయ మార్కెట్లో రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఒక సరికొత్త 160cc మ్యాక్సీ స్కూటర్‎ను డెవలప్ చేస్తోంది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్, 2027 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆటోమొబైల్ వర్గాల సమాచారం. ప్రీమియం సెగ్మెంట్‌లో రాబోతున్న ఈ స్కూటర్, ఇప్పటికే మార్కెట్లో దూసుకుపోతున్న యమహా ఏరాక్స్ 155, హీరో జూమ్ 160 మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

మారుతున్న కస్టమర్ల ట్రెండ్

గత కొన్నేళ్లుగా భారతీయ కస్టమర్ల మైండ్‌సెట్, కొనుగోలు శైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం ఆఫీసులకు, ఇళ్లకు తిరగడానికి మైలేజ్ ఇచ్చే సాధారణ ఫ్యామిలీ స్కూటర్లను మాత్రమే ఇష్టపడేవారు. కానీ, ఇప్పుడు యువత ఎక్కువగా స్టైలిష్ లుక్, స్పోర్టీ డిజైన్, లాంగ్ టూర్స్ వెళ్లడానికి వీలుగా ఉండే పవర్‌ఫుల్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కస్టమర్లలో వస్తున్న ఈ మార్పును సరిగ్గా క్యాచ్ చేసిన టీవీఎస్ యాజమాన్యం, ఈ సరికొత్త పవర్‌ఫుల్ మోడల్‌ను రూపొందిస్తోంది.

కొత్త ప్లాట్‌ఫామ్.. సరికొత్త లిక్విడ్ కూల్డ్ ఇంజిన్

తాజా సమాచారం ప్రకారం.. ఈ కొత్త 160cc స్కూటర్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎన్‌టార్క్ సిరీస్ కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీని కోసం కంపెనీ సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో టెక్నాలజీ పరంగా ఎంతో అడ్వాన్స్‌డ్‌గా ఉండే లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‎ను ఉపయోగించబోతున్నారు. ఈ ఇంజిన్ పవర్ అవుట్‌పుట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా బయటకు రానప్పటికీ, ఇది తన రైవల్స్ అయిన యమహా, హీరో స్కూటర్ల రేంజ్‌లోనే దాదాపు 14 నుంచి 15 హార్స్‌పవర్ శక్తిని జనరేట్ చేసేలా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కిల్లర్ లుక్ అండ్ అదిరిపోయే డిజైన్

ఈ స్కూటర్ డిజైన్ ఎలా ఉండబోతుందనే దానిపై ఆటోమొబైల్ మార్కెట్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. యమహా ఏరాక్స్ లాగా ప్యూర్ స్పోర్టీ లుక్‌తో వస్తుందా లేదా హీరో జూమ్, హోండా ADV160 తరహాలో ఒక అడ్వెంచర్ స్టైల్ లుక్‌తో రాబోతుందా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. అయినప్పటికీ, ఇందులో పెద్ద 14-ఇంచుల వీల్స్, గాలి తగలకుండా ప్రొటెక్ట్ చేసే విండ్‌స్క్రీన్, లాంగ్ రైడింగ్‌లో అలసట రాకుండా ఉండేలా మంచి సీటింగ్ పొజిషన్ ఇవ్వబోతున్నారని సమాచారం. దీనివల్ల సిటీ రోడ్లపైనే కాకుండా హైవేలపై కూడా ఈజీగా ప్రయాణించవచ్చు.

నెక్స్ట్ లెవెల్ స్మార్ట్ ఫీచర్లు

టీవీఎస్ కంపెనీ తన వెహికల్స్‌లో కనెక్టివిటీ ఫీచర్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అందరికీ తెలిసిందే. ఈ కొత్త మ్యాక్సీ స్కూటర్ లో కూడా బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నేవిగేషన్ సపోర్ట్, ఫుల్లీ డిజిటల్ డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ లాంటి నెక్స్ట్ లెవెల్ ఫీచర్లు ఉండబోతున్నాయి. వీటితో పాటు సీటు కింద భారీ అండర్‌సీట్ స్టోరేజ్, మెరుగైన బ్రేకింగ్ కోసం డిస్క్ బ్రేక్స్, మరిన్ని ప్రీమియం హంగులను జోడించనున్నారు. ప్రీమియం రేంజ్ లో బడ్జెట్ ధరలో వస్తే మాత్రం ఈ స్కూటర్ కుర్రాళ్లకు ఫేవరెట్ అవ్వడం ఖాయం.

Tags:    

Similar News