Ather Energy : సూపర్ ఫీచర్స్, అదిరిపోయే రేంజ్.. భారీగా పెరిగిన ఫ్యామిలీ స్కూటర్ ధర

Ather Energy : భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు జూన్ 1 నుంచి వేరియంట్ల ఆధారంగా రూ.4,000 వరకు పెరిగాయి.

Update: 2026-06-06 02:36 GMT

Ather Energy 

Ather Energy : భారతదేశంలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ టూ-వీలర్ల రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ సంస్థ ఏథర్ ఎనర్జీ వాహనదారులకు షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ రిజ్తా ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మారిన కొత్త ధరలు జూన్ 1, 2026 నుంచే దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. వివిధ వేరియంట్లను బట్టి ఈ స్కూటర్ ధరను రూ. 3,000 నుంచి రూ. 4,000 వరకు పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

భారత ఈవీ మార్కెట్లో ఓలా, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి దిగ్గజ మోడళ్లకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్న తరుణంలో ఈ ధరల పెంపు చోటుచేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం వాహనాల తయారీకి అయ్యే ప్రొడక్షన్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, దానికి తోడు అంతర్జాతీయంగా గ్లోబల్ సప్లై చైన్లో తలెత్తిన కొన్ని తీవ్రమైన సమస్యల కారణంగానే ధరలను పెంచాల్సి వచ్చిందని ఏథర్ యాజమాన్యం స్పష్టం చేసింది.

ఏథర్ రిజ్తా స్కూటర్ ప్రధానంగా రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో మొదటిది బేస్ మోడల్ అయిన 'రిజ్తా S'. ఇందులో 2.9 కిలోవాట్ అవర్ (kWh) బ్యాటరీ సామర్థ్యం ఉన్న మోడల్ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 1,21,046 కు చేరుకుంది. అలాగే ఇదే వేరియంట్‌లో పెద్ద బ్యాటరీ కలిగిన 3.7 కిలోవాట్ అవర్ (kWh) మోడల్ ధర రూ. 1,43,547 గా నిర్ణయించబడింది. ఈ బేస్ వేరియంట్లలో 4.3 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఇది 22 ఎన్ఎమ్ టాప్ టార్క్‌ను అందిస్తూ గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇవి సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 123 కిమీ నుండి 159 కిమీ వరకు ఐడీసీ రేంజ్ ఇస్తాయి.

ఎక్కువ ఫీచర్లు ఆశించే వారి కోసం అందుబాటులో ఉన్న ప్రీమియం మోడల్ రిజ్తా Z ధరలు కూడా ఇప్పుడు భారీగానే పెరిగాయి. ఇందులో 2.9 కిలోవాట్ అవర్ (kWh) బ్యాటరీ ఆప్షన్ కలిగిన స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,39,045 కాగా.. టాప్ ఎండ్ మోడల్ అయిన 3.7 కిలోవాట్ అవర్ (kWh) బ్యాటరీ వేరియంట్ ధర రూ. 1,59,046 కు పెరిగింది. ఈ జెడ్ వేరియంట్‌లో బ్యాటరీ, రేంజ్ సాధారణ మోడల్‌లాగే ఉన్నప్పటికీ, టెక్నాలజీ, అదనపు సేఫ్టీ ఫీచర్లు చాలా ఎక్కువగా ఉంటాయి.

ధర పెరిగినప్పటికీ ఏథర్ రిజ్టా ఇప్పటికీ ఫ్యామిలీ కస్టమర్ల మొదటి ఛాయిస్‌గా నిలవడానికి అందులోని అడ్వాన్స్డ్ ఫీచర్లే కారణం. బేస్ మోడల్‌లో 7-ఇంచుల డీప్‌వ్యూ డిస్‌ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రీజెనరేటివ్ బ్రేకింగ్, 34 లీటర్ల భారీ స్టోరేజ్ కెపాసిటీ వస్తాయి. ఇక టాప్ వేరియంట్ అయిన జెడ్ (Z) మోడల్‌లో గూగుల్ నావిగేషన్‌తో కూడిన 7-ఇంచుల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, స్కిడ్ కంట్రోల్, రోడ్డుపై గుంతలను హెచ్చరించే పిట్‌హోల్ అలర్ట్, యాక్సిడెంట్ అలర్ట్, లైవ్ లొకేషన్ షేరింగ్, వాట్సాప్ ప్రివ్యూ వంటి మరెన్నో క్రేజీ ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.

Tags:    

Similar News