ఒక్కసారి ఫుల్ చేస్తే 1000 కిమీ మైలేజ్.. జూన్ 9న మార్కెట్‌ను షేక్ చేయబోతున్న హైబ్రిడ్ కారు!
BYD Hybrid Car India: మనదేశంలో ఇప్పటివరకు కేవలం ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయిస్తూ పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకున్న బీవైడీ సంస్థ, ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది.
ఒక్కసారి ఫుల్ చేస్తే 1000 కిమీ మైలేజ్.. జూన్ 9న మార్కెట్‌ను షేక్ చేయబోతున్న హైబ్రిడ్ కారు!
BYD Hybrid Car India: భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలతో సంచలనాలు సృష్టిస్తున్న చైనా దిగ్గజం బీవైడీ (BYD), ఇప్పుడు దేశీయ మార్కెట్లో మరో పెను సంచలనానికి తెరలేపింది. జూన్ 9వ తేదీన తన మొట్టమొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) కారును భారతదేశంలో అధికారికంగా విడుదల చేయబోతోంది. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 1,000 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ అద్భుత వాహనం మార్కెట్ ముఖచిత్రాన్ని మార్చబోతోంది.
భారత మార్కెట్లోకి బీవైడీ సరికొత్త అడుగు..
మనదేశంలో ఇప్పటివరకు కేవలం ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయిస్తూ పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకున్న బీవైడీ సంస్థ, ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. చార్జింగ్ మౌలిక వసతుల కొరతతో ఇబ్బంది పడే వాహనదారుల కోసం విప్లవాత్మకమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్‌ను పరిచయం చేస్తోంది. మే 26న విడుదలైన అధికారిక టీజర్‌తోనే ఈ కారుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సరికొత్త సిరీస్‌లో బీవైడీ సంస్థ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన 'DM-i సూపర్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఈవీ' పవర్‌ట్రెయిన్ సాంకేతికతను ఉపయోగించనున్నారు.
ప్రస్తుతం భారత మార్కెట్లోకి రాబోయే మోడల్ పేరుపై కంపెనీ సస్పెన్స్ కొనసాగిస్తున్నప్పటికీ, ఆటోమొబైల్ వర్గాల సమాచారం ప్రకారం రెండు విభిన్నమైన కార్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అవే 'బీవైడీ అట్టో 2', శ 'బీవైడీ సీలియన్ 6'.
మధ్యతరగతికి సైతం చేరువగా.. 'బీవైడీ అట్టో 2' (BYD Atto 2 DM-i)
భారతదేశంలో ఎంతో ఆదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా కొలతలకు సమానంగా, ఎంతో స్టైలిష్ లుక్‌తో ఈ కారు అలరించనుంది. ఇందులో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు.
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 7.8 కిలోవాట్ అవర్ లేదా 18 కిలోవాట్ అవర్ కెపాసిటీ ఉన్న రెండు బ్యాటరీ ఆప్షన్లను సంస్థ అందిస్తోంది. ఇవి వరుసగా 166 హార్స్‌పవర్, 212 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి.
అంతర్జాతీయ ప్రమాణాల (WLTP) ప్రకారం చూస్తే, చిన్న బ్యాటరీ వేరియంట్ మొత్తం 928 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, పెద్ద బ్యాటరీ వేరియంట్ ఏకంగా 998 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ఈ కారుతో 39 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
లగ్జరీ హంగులతో మెరిసిపోతున్న 'బీవైడీ సీలియన్ 6' (BYD Sealion 6)..
అట్టో 2 కంటే ఒక సెగ్మెంట్ పైన, ప్రీమియం కేటగిరీలో లగ్జరీగా ఉండబోయే మరో మోడల్ సీలియన్ 6. లుక్ పరంగా ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ ఎస్‌యూవీలో 1.5 లీటర్ పెట్రోల్, టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. వీటికి 18.3 కిలోవాట్ అవర్ లేదా 26.6 కిలోవాట్ అవర్ బ్యాటరీలను జత చేశారు.
దీని సాధారణ హైబ్రిడ్ సెటప్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో 218 హార్స్‌పవర్ అందిస్తూ, కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 140 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇక టర్బో-పెట్రోల్ వేరియంట్ ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీతో 344 హార్స్‌పవర్ ఇస్తూ, ఎలక్ట్రిక్ మోడ్‌లో 128 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తుంది. పెట్రోల్, బ్యాటరీ సామర్థ్యం రెండూ కలిపి వాడితే ఈ లగ్జరీ కారు ఏకంగా 1,092 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ గట్టిగా చెప్తోంది.
అంతర్జాతీయంగా డాల్ఫిన్ జీ హల్‌చల్..
భారతదేశంలో లాంచ్ కంటే ముందే బీవైడీ సంస్థ గ్లోబల్ మార్కెట్ కోసం సరికొత్త 'డాల్ఫిన్ జీ డిఎమ్-ఐ' కాంపాక్ట్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ హ్యాచ్‌బ్యాక్ కారును అధికారికంగా లాంచ్ చేసింది. యూరోపియన్ మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా డిజైన్ చేసిన ఈ మోడల్, చార్జింగ్ స్టేషన్లపై పూర్తిగా ఆధారపడకుండా లాంగ్ డ్రైవ్స్ వెళ్లాలనుకునే వారికి వరం కానుంది. ఇది కూడా ఒక్కసారి ఫుల్ ట్యాంక్, ఫుల్ చార్జింగ్ చేస్తే 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను సునాయాసంగా ఇస్తుంది.
సాధారణంగా చాలా కంపెనీలు మైల్డ్-హైబ్రిడ్ లేదా స్ట్రాంగ్-హైబ్రిడ్ వ్యవస్థలను వాడుతుంటే, బీవైడీ మాత్రం పూర్తి స్థాయి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌తో భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ప్యూర్ ఎలక్ట్రిక్ కార్ల లాంటి నిశ్శబ్దమైన డ్రైవింగ్ అనుభూతిని పొందుతూనే, మైలేజ్ భయాలు లేకుండా లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వారికి జూన్ 9న రాబోయే ఈ సరికొత్త బీవైడీ కారు ఒక అద్భుతమైన ఎంపిక కానుంది. మరి భారతీయ మార్కెట్లో దీని ధర ఎంత ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!