Triumph : ఈ బైక్ కావాలంటే భారీగా డబ్బులే కాదు.. ఎంతో అదృష్టం కూడా చేసుకుని ఉండాలి
Triumph : బ్రిటిష్ ప్రీమియం బైక్ బ్రాండ్ ట్రయంఫ్ ఇండియాలో సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ సూపర్‌బైక్‌ను లాంచ్ చేసింది.
Triumph
Triumph : భారతదేశంలోని ప్రీమియం మోటార్ సైకిల్ లవర్లను టార్గెట్ చేస్తూ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ బైక్స్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ సరికొత్త బైక్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అత్యంత లగ్జరీ ఫీచర్లతో రూపొందించిన స్పీడ్ ట్విన్ 1200 టీఎఫ్‌సీ మోడల్‌ను భారత వెబ్‌సైట్‌లో అధికారికంగా లిస్ట్ చేసింది. ఈ సూపర్‌బైక్ ఎక్స్-షోరూమ్ ధరను భారీ స్థాయిలో రూ.20.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ బైక్ ధర సాధారణ కార్ల కంటే చాలా ఎక్కువ కావడంతో బైక్ లవర్స్ మధ్య దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది.
ఈ మోటార్ సైకిల్ అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఏమిటంటే.. దీనిని చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే తయారు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 750 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు ట్రయంఫ్ సంస్థ స్పష్టం చేసింది. అంటే ప్రపంచ దేశాలన్నింటికీ కలిపి కేవలం 750 మంది అదృష్టవంతులు లేదా సెలబ్రిటీలు మాత్రమే ఈ బైక్‌ను సొంతం చేసుకోగలరు. ట్రయంఫ్ ఫ్యాక్టరీ కస్టమ్ సిరీస్ నుంచి వస్తున్న 5వ మోడల్ ఇది. ఈ సిరీస్ లోని ప్రతి బైక్ కు ఒక ప్రత్యేకమైన సీరియల్ నంబర్ ఇస్తారు. అంతేకాకుండా దీనిని కొనుగోలు చేసిన కస్టమర్లకు కంపెనీ ఒక ఒరిజినాలిటీ సర్టిఫికెట్ కూడా ఇస్తుంది. భవిష్యత్తులో ఈ బైక్ రేర్ కలెక్షన్గా మారిపోయే అవకాశం ఉంది.
సాధారణ మోడళ్లతో పోలిస్తే దీని డిజైన్, లుక్స్ చాలా భిన్నంగా, అత్యంత లగ్జరీగా ఉంటాయి. బైక్ బరువును తగ్గించడానికి, స్ట్రాంగ్‌గా ఉంచడానికి ముందు, వెనుక మడ్‌గార్డులతో పాటు సైడ్ ప్యానల్స్, హీల్ గార్డ్స్ వంటి భాగాలను పూర్తిగా కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో తయారు చేశారు. ఈ బైక్‌ను కస్టమర్ల కోసం ప్రత్యేకంగా అబ్సిడియన్ గోల్డ్ అనే ప్రీమియం కలర్ స్కీమ్‌లో తీసుకొచ్చారు. బైక్ చైన్, ఫ్రంట్ ఫోర్క్స్ వంటి భాగాలకు గోల్డ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. సీట్లను ప్రీమియం లెదర్, సుఎడ్ క్లాత్‌తో చాలా అందంగా డిజైన్ చేశారు. ఈ బైక్ కొనేవారికి అదనపు సదుపాయంగా ఇండోర్ బైక్ కవర్ తో పాటు వాటర్‌ప్రూఫ్ సీట్ కవర్లను కూడా కంపెనీ ఉచితంగా అందిస్తోంది.
పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో 1200 సీసీ సామర్థ్యం గల బాన్‌విల్లే పారలల్-ట్విన్ ఇంజన్‌ను అమర్చారు. ఈ భారీ ఇంజన్ 105 బీహెచ్‌పీ అత్యధిక పవర్‌ను, 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. బైక్ నుంచి వచ్చే సౌండ్ స్పోర్టీగా ఉండేందుకు, పర్ఫార్మెన్స్ మరింత పెంచేందుకు ఇందులో ప్రత్యేకంగా అక్రాపోవిక్ టైటానియం సైలెన్సర్స్ వాడారు. వీటికి కూడా చివర్లో కార్బన్ ఫైబర్ క్యాప్స్ అమర్చడం విశేషం.
ఈ సరికొత్త లగ్జరీ బైక్‌లో రైడర్ల సౌకర్యం కోసం ఎన్నో ఆధునిక సాంకేతిక ఫీచర్లను చేర్చారు. ఇందులో అమర్చిన ట్రయంఫ్ షిఫ్ట్ అసిస్ట్ ఫీచర్ ద్వారా రైడర్ క్లచ్ లివర్‌ను నొక్కకుండానే చాలా సులభంగా గేర్లను మార్చుకోవచ్చు. లాంగ్ రైడింగ్స్ చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే రోడ్డు పరిస్థితులు, వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవడానికి స్పోర్ట్, రోడ్, రెయిన్ అనే మూడు రకాల రైడింగ్ మోడ్స్‌ను అందించారు.
సేఫ్టీకి పెద్దపీట వేస్తూ ఈ బైక్‌లో కార్నరింగ్ ఏబీఎస్, అడ్వాన్స్‌డ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌లను ఇచ్చారు. ఇవి వేగంగా వెళ్లేటప్పుడు లేదా మలుపుల్లో బైక్ స్కిడ్ అవ్వకుండా బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి. బైక్ హ్యాండిల్ బార్ పై ఎల్‌సీడీ, కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో బైక్ స్పీడ్, గేర్ పొజిషన్, ఇంధన స్థాయి వంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రయాణంలో మొబైల్ ఫోన్లు ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా ఒక యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్టును కూడా ఇందులో అమర్చారు.