Car AC Tips : కారు ఎక్కగానే వెంటనే ఏసీ ఆన్ చేస్తున్నారా? అయితే మీరు ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్లే
Car AC Tips : ఎండలో పార్క్ చేసిన కార్లలోకి వెళ్లగానే వెంటనే ఏసీ ఆన్ చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే. కారు లోపల చేరే బెంజీన్ అనే విషవాయువు వల్ల కలిగే నష్టాలు తెలుసుకుందాం.
Car AC Tips
Car AC Tips : ప్రస్తుత రోజుల్లో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. చాలామంది ఎండలో లేదా విపరీతమైన వేడిలో ప్రయాణించి రాగానే, కారు ఎక్కీ ఎక్కడంతోనే ఫుల్ స్పీడ్‌తో ఏసీ ఆన్ చేస్తుంటారు. వినడానికి ఇది చాలా సాధారణ విషయంగా అనిపించినప్పటికీ మీ ఆరోగ్యానికి ఇది ఎంతో హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండలో ఎక్కువసేపు పార్క్ చేసి ఉంచిన కారు లోపలి ఉష్ణోగ్రత, బయటి వాతావరణం కంటే చాలా రెట్లు ఎక్కువగా మారిపోతుంది. ఈ వేడి కారణంగా కారు లోపల ఒక ప్రమాదకరమైన రసాయన ప్రక్రియ జరుగుతుందనే విషయం చాలామందికి తెలియదు.
ఎండలో ఆపిన కార్లలో చేరే సైలెంట్ కిల్లర్
కారును ఎండలో ఎక్కువసేపు ఉంచినప్పుడు కారు లోపల ఉండే ప్లాస్టిక్ విడిభాగాలు, డ్యాష్‌బోర్డ్, సీట్ కవర్ల నుంచి బెంజీన్ అనే అత్యంత హానికరమైన విషవాయువు విడుదలవుతుంది. కారు తలుపులు, కిటికీలు అన్నీ బంద్‌గా ఉండటం వల్ల ఈ గ్యాస్ అంతా లోపలే పేరుకుపోతుంది. ఇలాంటి స్థితిలో మీరు కారులోకి రాగానే కిటికీల షీల్డులు అస్సలు దించకుండా, వెంటనే ఏసీ ఆన్ చేస్తే ఆ విషపూరితమైన గాలి క్యాబిన్ లోనే ఉండిపోతుంది. శ్వాస ద్వారా ఆ గ్యాస్ మీ శరీరంలోకి చేరడం వల్ల తలనొప్పి, కళ్లు తిరగడం, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కారు స్టార్ట్ చేయగానే నేరుగా ఏసీ ఆన్ చేయకూడదని నిపుణులు గట్టిగా చెప్తున్నారు.
కారు ఏసీని ఆన్ చేయడానికి అసలైన పద్ధతి ఇదే
కారు లోపల పేరుకుపోయిన వేడి, విషపూరితమైన గాలిని బయటకు పంపడానికి ఒక సులువైన పద్ధతి ఉంది. మొదట కారు ఎక్కేముందు డోర్లను రెండు మూడు సార్లు తెరుస్తూ, మూస్తూ ఉండాలి. దీనివల్ల లోపల ఉన్న వేడి గాలి చాలావరకు బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత కారు స్టార్ట్ చేసి, వెంటనే ఏసీ ఆన్ చేయకుండా అన్ని కిటికీల గ్లాసులను కిందకు దించేయాలి. కారును కొద్ది దూరం అలా కిటికీలు తెరిచి ఉంచే నడపడం వల్ల లోపల జమై ఉన్న బెంజీన్ గ్యాస్, వేడి గాలి పూర్తిగా బయటకు వెళ్ళిపోతాయి. కారు లోపలి ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చిందని అనిపించినప్పుడు మాత్రమే కిటికీలు మూసివేసి ఏసీ ఆన్ చేయాలి. ఈ పద్ధతి ద్వారా కారు చాలా త్వరగా, సమర్థవంతంగా చల్లబడుతుంది.
మైలేజ్ పెంచే సూపర్ కార్ ఏసీ టిప్స్ ఇవే
ఏసీని సరైన పద్ధతిలో వాడటంతో పాటు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కారు మైలేజ్ కూడా పెరుగుతుంది. కారును ఎండలో పార్క్ చేయాల్సి వచ్చినప్పుడు ముందు విండ్‌షీల్డ్‌కు సన్‌షేడ్స్ అమర్చడం వల్ల క్యాబిన్ ఎక్కువగా వేడెక్కదు. దీనివల్ల తర్వాత మీరు ఏసీ ఆన్ చేసినప్పుడు కంప్రెషర్‌పై ఎక్కువ భారం పడదు. అలాగే లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు నిరంతరాయంగా ఏసీని ఆన్ ఉంచడం వల్ల కారు మైలేజ్ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల లాంగ్ జర్నీలలో మధ్యమధ్యలో కొద్దిసేపు ఏసీని ఆఫ్ చేస్తూ ఉండాలి. వీటన్నిటితో పాటు కారు ఏసీ ఫిల్టర్లను, కూలింగ్ సిస్టమ్‌ను సమయానుకూలంగా సర్వీసింగ్ చేయించడం వల్ల ఏసీ లైఫ్ పెరగడమే కాకుండా కారులో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన గాలి ఉంటుంది.