గుడ్ న్యూస్.. టాటా నుంచి పెట్రోల్ అవసరం లేని కార్.. ఫీచర్లు చూస్తే ప్రత్యర్థులకు హార్ట్ ఎటాకే..!
Tata Punch Flex Fuel Model: ప్రస్తుతం మార్కెట్లో టాటా పంచ్ కారు పెట్రోల్, సీఎన్‌జీ, ఈవీ రూపాల్లో అందుబాటులో ఉంది.
గుడ్ న్యూస్.. టాటా నుంచి పెట్రోల్ అవసరం లేని కార్.. ఫీచర్లు చూస్తే ప్రత్యర్థులకు హార్ట్ ఎటాకే..!
Tata Punch Flex Fuel Model: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త రికార్డుకు సిద్ధమైంది. చమురు ధరల భారంతో సతమతమవుతున్న సామాన్యుడికి ఊరటనిస్తూ పూర్తిగా పెట్రోల్‌తో నిమిత్తం లేకుండా నడిచే సరికొత్త సాంకేతికత కలిగిన కారును మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ వేగంగా అడుగులు వేస్తోంది.
టాటా మోటార్స్ సరికొత్త ప్రయోగం.. ఈ ఏడాది ఆఖరిలోనే..!
భారతదేశంలో విదేశీ ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని తీవ్రంగా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ వాహన సంస్థ టాటా మోటార్స్ తన మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ (ప్రత్యామ్నాయ ఇంధన) కారును ఈ 2026 ఏడాది ఆఖరులో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీకి అత్యధిక విక్రయాలు అందిస్తున్న ప్రముఖ మోడల్ 'టాటా పంచ్' ఆధారంగా ఈ సరికొత్త కారు రూపుదిద్దుకుంటోంది.
వంద శాతం ఇథనాల్‌తో దూసుకెళ్లే ఇంజిన్..
సాధారణంగా ప్రస్తుతం మార్కెట్లో లభించే పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్‌ను మిశ్రమం చేస్తున్నారు. అయితే టాటా మోటార్స్ తీసుకురాబోతున్న ఈ సరికొత్త టాటా పంచ్ మోడల్ ఏకంగా 85 శాతం నుంచి 100 శాతం (E100) స్వచ్ఛమైన ఇథనాల్ ఇంధనంతో నడిచేలా ప్రత్యేక సాంకేతికతతో రూపొందుతోంది. గతంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో దీనికి సంబంధించిన నమూనాను కంపెనీ ప్రదర్శించింది. ఈ కారులో 1.2 లీటర్ల 3-సిలిండర్ ఇంజిన్‌ను అమర్చనున్నారు. ఇథనాల్ ఇంధనానికి అనుకూలంగా ఉండేలా దీని ఇంధన పంపులు, ఇంజెక్టర్లు, అంతర్గత వ్యవస్థల్లో కీలకమైన మార్పులు చేశారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో రానుంది.
పెట్రోల్, సీఎన్‌జీ, బ్యాటరీ.. ఇప్పుడు ఇథనాల్‌తోనూ లభ్యం..!
ప్రస్తుతం మార్కెట్లో టాటా పంచ్ కారు పెట్రోల్, సీఎన్‌జీ, ఈవీ రూపాల్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు దీనికి ఫ్లెక్స్-ఫ్యూయల్ వేరియంట్ కూడా తోడుకానుండటంతో వినియోగదారులకు మరిన్ని ఎక్కువ ఎంపికలు లభించినట్లవుతుంది. చెరుకు పిప్పి ఇతర వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్‌ను సులభంగా తయారు చేయవచ్చు కాబట్టి, దీని ధర పెట్రోల్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇది వాహనదారుల జేబు భారానికి పెద్ద ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు.
రూపంలో మార్పు లేదు.. ఫీచర్లు అదరహో..!
ఇంధన వ్యవస్థ మారుతున్నప్పటికీ కారు వెలుపలి రూపంలో, లగ్జరీ ఫీచర్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. ప్రస్తుత మోడల్‌లో ఉన్నట్లుగానే 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచుల డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ ఏసీ, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, 360-డిగ్రీ కెమెరా, ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అత్యాధునిక సౌకర్యాలు ఇందులోనూ కొనసాగుతాయి.
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఇంధన ఖర్చులను సగానికి సగం తగ్గించే ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ సాంకేతికత భవిష్యత్తులో వాహన రంగ రూపురేఖలను మార్చేయనుంది. టాటా మోటార్స్ తీసుకుంటున్న ఈ చొరవ విజయవంతమైతే భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఇదొక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం. పర్యావరణ హితమైన, బడ్జెట్ అనుకూలమైన ప్రయాణాన్ని కోరుకునే మధ్యతరగతి ప్రజలకు ఈ కారు ఒక అద్భుతమైన కానుక కానుంది.