MG Majestor : SUVలో మసాజ్ సీట్లు.. ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే..!

MG Majestor : భారతీయ ప్రీమియం ఎస్‌యూవీ (SUV) విభాగంలో సరికొత్త సంచలనానికి తెరలేచింది. ప్రముఖ ఆటోమొబైల్..

Update: 2026-05-26 05:04 GMT

MG Majestor

MG Majestor : భారతీయ ప్రీమియం ఎస్‌యూవీ (SUV) విభాగంలో సరికొత్త సంచలనానికి తెరలేచింది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎమ్‌జీ మోటార్ ఇండియా (JSW MG Motor India) తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘ఎమ్‌జీ మెజెస్టర్’ (MG Majestor) ప్రొడక్షన్‌ను గుజరాత్‌లోని హాలోల్ తయారీ ప్లాంట్‌లో అధికారికంగా ప్రారంభించింది. ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న 'ఎమ్‌జీ గ్లోస్టర్' స్థానాన్ని ఈ సరికొత్త మెజెస్టర్ భర్తీ చేయనుంది. మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఈ భారీ ఎస్‌యూవీ.. టయోటా ఫార్చ్యూనర్, జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి గ్లోబల్ దిగ్గజాలకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ప్రీ-బుకింగ్స్ రూ. 41,000 టోకెన్ అమౌంట్‌తో దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 40 లక్షల నుండి రూ. 45 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ కారు లాంచ్ టైమ్‌లైన్‌ను కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

రోడ్డుపై వెళ్తుంటే రాజసం ఉట్టిపడే డిజైన్

ఎమ్‌జీ మెజెస్టర్ సాంప్రదాయ 'బాడీ-ఆన్-ఫ్రేమ్' ఆర్కిటెక్చర్‌పై రూపొందించబడింది. ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత భారీ కొలతలతో, రోడ్డుపై వెళ్తుంటే ఒక లగ్జరీ ట్యాంక్‌లా కనిపించేలా దీన్ని డిజైన్ చేశారు. ముందు భాగంలో భారీ 'మొజాయిక్ మ్యాట్రిక్స్' గ్రిల్, దానికి ఇరువైపులా నిలువుగా అమర్చిన ట్రై-బీమ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎమ్‌జీ సిగ్నేచర్ 'డ్రాగన్ ఐ' డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs) కారుకు ఒక అగ్రెసివ్ లుక్‌ను ఇస్తాయి. 19-ఇంచుల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్లు, కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్-లాంప్స్, రూఫ్ రైల్స్ , డ్యూయల్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్లు ఈ కారు ప్రీమియం ఆఫ్-రోడ్ లుక్‌ను మరింత పెంచుతాయి.

ఫైవ్-స్టార్ రేంజ్ లగ్జరీ క్యాబిన్

ఈ కారు ఇంటీరియర్స్‌ను అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దారు. డార్క్-థీమ్‌తో కూడిన క్యాబిన్, స్మోక్డ్ ఎబోనీ ఫినిషింగ్, ప్రీమియం లెదరెట్ అప్హోల్‌స్టరీ కస్టమర్లను ఆకట్టుకుంటాయి. ఈ ఎస్‌యూవీ 6-సీటర్ , 7-సీటర్ లేఅవుట్లలో అందుబాటులో ఉండనుంది. కారు డ్యాష్‌బోర్డ్‌పై ఇన్ఫోటైన్‌మెంట్ , ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం రెండు పెద్ద డిజిటల్ డిస్‌ప్లేలను ఇచ్చారు. స్టీరింగ్ వీల్ వెనుక వైపు గేర్ సెలెక్టర్‌ను అమర్చారు. కంఫర్ట్ కోసం పనోరమిక్ సన్‌రూఫ్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే, 12-స్పీకర్ల లగ్జరీ జేబీఎల్ (JBL) ఆడియో సిస్టమ్ , త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మసాజ్ సీట్లు.. జియో ఐ-స్మార్ట్ 2.0 కనెక్టివిటీ

ప్రయాణీకులకు సరికొత్త లగ్జరీ అనుభూతిని ఇవ్వడానికి ఈ కారులో మరికొన్ని ప్రత్యేక ఫీచర్లు జోడించారు.. ముందరి సీట్లకు హీటింగ్/వెంట్రీలేషన్‌తో పాటు మసాజ్ ఫంక్షనాలిటీని ఇచ్చారు. డ్రైవర్ సీటును 12 రకాలుగా ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు (మెమొరీ ఫంక్షన్‌తో). గెస్టర్-కంట్రోల్డ్ పవర్డ్ టెయిల్‌గేట్ (చేతి సైగలతో డిక్కీ ఓపెన్ చేయడం), డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లు, వెనుక ప్రయాణీకుల కోసం 220V పవర్ అవుట్‌లెట్ ఉన్నాయి. రిలయన్స్ జియోతో కలిసి అభివృద్ధి చేసిన అప్‌గ్రేడెడ్ 'i-Smart 2.0' కనెక్టెడ్ కార్ టెక్నాలజీని ఇందులో మొదటిసారి పరిచయం చేశారు. ఇది రిమోట్ వెహికల్ కంట్రోల్, డిజిటల్ బ్లూటూత్ కీ షేరింగ్, వాలెట్ మోడ్‌తో సహా 75కు పైగా స్మార్ట్ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.

ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్.. తిరుగులేని ఆఫ్-రోడ్ పవర్

పనితీరు విషయానికి వస్తే, ఎమ్‌జీ మెజెస్టర్‌లో గ్లోస్టర్ నుండి సేకరించిన పవర్‌ఫుల్ 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 215 bhp శక్తిని, 478.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా 4x2 లేదా 4x4 డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

నాలుగు-చక్రాల డ్రైవ్ (4x4) వేరియంట్లలో ఎమ్‌జీ ప్రత్యేక 'M-Hub' ఆఫ్-రోడ్ సిస్టమ్‌ను అందించింది. ఇందులో శాండ్, రాక్, మడ్, స్నో , నార్మల్ వంటి మల్టిపుల్ టెర్రైన్ మోడ్స్ ఉన్నాయి. కఠినమైన కొండలు, బురద ప్రాంతాల్లో కారు అస్సలు ఇరుక్కోకుండా ఉండటానికి ఇందులో ఫ్రంట్, సెంటర్ , రియర్ త్రిబుల్ డిఫరెన్షియల్ లాక్ సెటప్‌ను ఇచ్చారు. అలాగే, 810 మిమీ లోతైన నీటిలో కూడా ఈ కారు సులభంగా ప్రయాణించగలదు.

నెక్స్ట్ లెవెల్ సేఫ్టీ.. లెవెల్ 2 ADAS

భద్రత విషయంలో ఎమ్‌జీ ఏమాత్రం రాజీ పడలేదు. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ హోల్డ్ , హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ప్రాథమిక రక్షణ ఫీచర్లు ఉన్నాయి. వీటన్నింటితో పాటు అత్యంత అధునాతనమైన లెవెల్ 2 ADAS ను అందించారు. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. టెక్నాలజీ, లగ్జరీ, పవర్ కలబోతగా వస్తున్న ఎమ్‌జీ మెజెస్టర్.. ప్రీమియం ఎస్‌యూవీ మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News