Mahindra Price Hike : మహీంద్రా ఎస్‌యూవీ లవర్లకు షాక్.. థార్ రాక్స్, స్కార్పియో ధరలు భారీగా పెంపు

Mahindra Price Hike : మహీంద్రా సంస్థ థార్ రాక్స్, స్కార్పియో క్లాసిక్ ఎస్‌యూవీల ధరలను పెంచింది. థార్ రాక్స్‌పై గరిష్టంగా రూ.78,000, స్కార్పియోపై రూ.40,000 వరకు ధరలు పెరిగాయి.

Update: 2026-07-24 03:08 GMT

Mahindra Price Hike

Mahindra Price Hike : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. సంస్థకు చెందిన పాపులర్ ఎస్‌యూవీ మోడళ్లు అయిన థార్ రాక్స్, స్కార్పియో క్లాసిక్ ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. జులై 2026 నుంచి ప్యాసింజర్ వాహనాల ధరలను గరిష్టంగా 2.7 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ ముందే ప్రకటించిన నేపథ్యంలో ఈ రెండు మోడళ్లపై కొత్త ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి.

ఏకంగా రూ.78 వేలు పెరిగిన థార్ రాక్స్ ధరలు

కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన 5-డోర్ ఎస్‌యూవీ థార్ రాక్స్ దాదాపు అన్ని వేరియంట్ల ధరలు పెరిగాయి.

పెట్రోల్ వేరియంట్లు: పెట్రోల్ మోడళ్లలో రూ.12,500 నుంచి రూ.59,000 వరకు ధర పెరిగింది. బేస్ వేరియంట్ MX1 పెట్రోల్ MT 2WD మోడల్‌పై రూ.12,500 పెరగ్గా, స్టార్ ఎడిషన్ AT 2WD మోడల్‌పై అత్యధికంగా రూ.59,000 పెరిగింది.

డీజిల్ వేరియంట్లు: డీజిల్ మోడళ్లలో ధర పెంపు మరింత ఎక్కువగా ఉంది. ఇవి రూ.22,500 నుంచి ఏకంగా రూ.78,000 వరకు ప్రియమయ్యాయి. ముఖ్యంగా టాప్ ఎండ్ మోడల్స్ అయిన AX7 L 2WD, AX7 L 2WD మోచా ఇంటీరియర్ వేరియంట్లపై గరిష్టంగా రూ.78,000 వరకు భారం పడింది.

స్కార్పియో క్లాసిక్ ధర ఎంత పెరిగిందంటే?

రఫ్ అండ్ టఫ్ లుక్‌తో మార్కెట్లో ఎంతో ఆధరణ పొందిన స్కార్పియో క్లాసిక్ ధరలను కూడా మహీంద్రా సవరించింది.

S MT వేరియంట్లు: S MT 7-సీటర్ మోడల్ ధర రూ.37,000 పెరగ్గా, S MT 9-సీటర్ ధర రూ.39,000 పెరిగింది.

S11 MT వేరియంట్లు: టాప్ స్పెక్ వేరియంట్లయిన S11 MT 7-సీటర్, S11 MT 7-సీటర్ సీసీ ధరలు రూ.40,000 వరకు పెరిగాయి. ఈ ధరల పెంపు తర్వాత స్కార్పియో క్లాసిక్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర ప్రస్తుతం రూ.13.37 లక్షల నుంచి రూ. 17.40 లక్షల వరకు చేరుకుంది. కాగా, త్వరలోనే మహీంద్రా నుంచి స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ మోడల్ కూడా మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Tags:    

Similar News