Sravana Masam: శుభ శ్రావణం.. ఈ ఏడాది ఐదు శుక్రవారాలతో ఎంతో ప్రత్యేకం!
Sravana Masam: పరిశుద్ధమైన శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఐదు శుక్రవారాలు, వరలక్ష్మీ వ్రతం, వివాహాది శుభ ముహూర్తాలు, ఆధ్యాత్మిక శోభతో ముంగిళ్లు సిద్ధమవుతున్నాయి.
Sravana Masam: శుభ శ్రావణం.. ఈ ఏడాది ఐదు శుక్రవారాలతో ఎంతో ప్రత్యేకం!
Sravana Masam: వర్షాలతో స్వాగతం పలికిన ఆషాఢానికి వీడ్కోలు పలుకుతూ.. ఆకుపచ్చని తోరణాలతో శ్రావణానికి స్వాగతం పలికే శుభఘడియలు ఇవి. శ్రావణం అనగానే పూజలు, వ్రతాలు, మహాలక్ష్మీకి ఇళ్లలోకి స్వాగతం పలికే మధుర క్షణాలు.. ఈ పవిత్ర మాసం ప్రారంభం కానుండటంతో, లక్ష్మీదేవికి స్వాగతం పలికేందుకు ముంగిళ్లు ముస్తాబవుతున్నాయి. ఈ ముప్పై రోజులూ పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రతి ఇల్లూ ఒక నందనవనాన్ని తలపించనుంది.
మహావిష్ణువు, లక్ష్మీ పూజలకు అనుకూలం..
పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణా నక్షత్రానికి సమీపంలో సంచరించడం వల్లే ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. శ్రవణ నక్షత్రం సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం కావడంతో.. ఈ నెలంతా హరినామ స్మరణతో మారుమోగిపోతుంది. శ్రావణంలో వచ్చే ప్రతి రోజూ పవిత్రమైనదే అయినా.. మంగళ, శుక్ర, శనివారాలకు ఉన్న ప్రాధాన్యత వేరు. మంగళవారం మంగళగౌరి పూజలతో కొత్త కోడళ్లు, శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలతో ముత్తైదువులు, శనివారం వేంకటేశ్వరుడి కొలువుతో ఇళ్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి.
ఐదు శుక్రవారాల శ్రావణం..
ఈ ఏడాది శ్రావణ మాసంలో ఒక అద్భుతమైన విశేషం ఉంది. మాసం ప్రారంభమైన మరుసటి రోజే మహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన శుక్రవారం రానుంది. అంతేకాదు..ఈసారి శ్రావణంలో మొత్తం ఐదు శుక్రవారాలు రావడం మరింత విశేషం. దీంతో లక్ష్మీదేవి ఆరాధనకు, ఉపవాస దీక్షలకు మహిళలు ఇప్పటికే పట్టుచీరలు, పూజా సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. స్థానిక అమ్మవారి ఆలయాలన్నీ ప్రత్యేక అలంకరణలు, శ్రావణ మంగళ హారతులతో భక్తులను ఆకర్షించనున్నాయి.
విశిష్ట పర్వదినాల నెల..
హైందవ సంస్కృతి, సంప్రదాయాల సమాహారమైన శ్రావణంలో.. వరలక్ష్మీ వ్రతంతో పాటు నాగుల చవితి, బంధాల మాధుర్యాన్ని పంచే రాఖీ పౌర్ణమి, ఉట్టి సంబరాల శ్రీకృష్ణాష్టమి వంటి పెద్ద పండుగలు వరుసకట్టనున్నాయి. ఇవన్నీ కుటుంబాల మధ్య బాంధవ్యాలను మరింత పెంచనున్నాయి. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం చేసుకోవడానికి ఐదు వారాలు వచ్చాయి. అంతే కాదు.. పౌర్ణమి కూడా శుక్రవారమే వచ్చింది.
శుభముహుర్తాల గని..
శ్రావణ మాసం అంటే శుభ ముహూర్తాలకు పెట్టింది పేరు. చాన్నాళ్లుగా మూతపడిన శుభముహూర్తాల గడియలు మళ్లీ తెరుచుకోవడంతో పెళ్లి బాజాలు మోగనున్నాయి. బంధువుల రాకపోకలు, పట్టువ్రస్తాల హడావుడితో శ్రావణం సరికొత్త ఉత్సాహాన్ని తీసుకురానుంది. ఆషాఢ మాసం కారణంగా నిలిచిపోయిన శుభ ముహూర్తాలు శ్రావణం రాకతో మళ్లీ ఊపందుకున్నాయి. వివాహాలతో పాటు గృహప్రవేశాలు, భూమి పూజలు, సత్యనారాయణస్వామి వ్రతాలు వంటి ఎన్నో శుభకార్యాలు ఈ నెలలోనే నిర్వహించేందుకు జనం సిద్ధమయ్యారు. ఈ శ్రావణ సీజన్ పై వస్త్ర దుకాణాలు, బంగారు వ్యాపారులు, మంగళవాయిద్యాల కళాకారులు, పూల వ్యాపారులు, క్యాటరింగ్ సిబ్బంది, డెకరేషన్ నిర్వాహకులు, ఆర్కెస్ట్రా బృందాల వంటి ఎంతోమంది ఉపాధి కార్మికులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఆధ్యాత్మిక మాసం..
శ్రావణ మాసం కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య రీత్యా కూడా ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. శ్రావణ నియమాల వల్ల మెజారిటీ ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉంటూ కేవలం సాత్విక, శాఖాహార భోజనానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇది శరీర జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. దీనికి తోడు మహిళలు, పురుషులు ఉదయాన్నే స్నానాలు ఆచరించి ఆలయాలు, ఇళ్లలో నిత్యం పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ మాసమంతా ఆధ్యాత్మిక చింతనతో గడపడం వల్ల మనిషిని సన్మార్గం వైపు పయనింపజేసేందుకు దోహదపడుతుంది.
వి.వంశీదొర, hmtv డిప్యూటీ అవుట్ పుట్ ఎడిటర్