Weather Update: దడ పుట్టిస్తున్న వాయుగుండం.. ఏపీ, తెలంగాణ ప్రజలకు తీవ్ర హెచ్చరిక

Weather Update: వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది.

Update: 2026-08-18 03:03 GMT

Weather Update

Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే ఆరు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలకు సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం వాయువ్య దిశగా వేగంగా పయనిస్తోంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 18 నుంచి 23వ తేదీ వరకు ఆరు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రా, రాయలసీమ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

మత్స్యకారులకు అలర్ట్.. రైతుల ఆందోళన

సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున ఆగస్టు 19 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని హుకుంపేట, పెదబయలు, పాడేరు ప్రాంతాల్లో ఇప్పటికే పలుచోట్ల వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ వర్షాలు ఖరీఫ్ పంటలకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, ఎల్‌నీనో ప్రభావంతో కొన్ని చోట్ల ఇంకా లోటు వర్షపాతం కొనసాగుతోంది. వర్షపు నీరు కొన్ని పొలాల్లోకి చేరడం వల్ల చేతికొచ్చిన పంట దెబ్బతింటుందేమోనని రైతన్నలు కలవరపడుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణలోనూ దంచికొడుతున్న వానలు

తెలంగాణలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వాయుగుండం విస్తరించి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఇప్పటికే వరంగల్ జిల్లా దుగ్గొండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖానాపూర్, ఆత్మకూర్ ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వానలు పడ్డాయి.

ఈదురుగాలుల ముప్పు.. ప్రజలు అప్రమత్తం

వర్ష సమయాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలు, పెద్ద ప్రకటనల హోర్డింగ్‌ల కింద నిలబడకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. తడిసిన రోడ్లపై వాహనదారులు వేగం తగ్గించి ప్రయాణించాలని సూచించారు.

Tags:    

Similar News