రేపు విద్యాసంస్థలు బంద్..?

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, జీవో 77 రద్దు మరియు సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై ఆగస్టు 5న ఏపీ వ్యాప్తంగా ఇంటర్ నుంచి పీజీ వరకు కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు.

Update: 2026-08-04 11:16 GMT

రేపు విద్యాసంస్థలు బంద్..?

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపిస్తూ ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అన్ని కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార వాల్ పోస్టర్‌ను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ నాయకులు విడుదల చేశారు.

ప్రధాన డిమాండ్లు ఇవే:

రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పేరుకుపోయిన రూ. 6,800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి.

విద్యార్థుల ఉన్నత చదువులకు శాపంగా మారిన జీవో నంబర్ 77ను రద్దు చేసి, పీజీ (PG) చదువుతున్న విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పునరుద్ధరించాలి.

ఆలస్యమవుతున్న డిగ్రీ ప్రవేశాలను వేగవంతం చేయడంతో పాటు విశ్వవిద్యాలయాల అకడమిక్ క్యాలెండర్ల గందరగోళానికి తెరదించాలి.

నామమాత్రపు తనిఖీలతో విచ్చలవిడిగా సాగుతున్న కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వ వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు నరకం చూస్తున్నారని, తక్షణమే నాణ్యమైన భోజనం మరియు మెరుగైన వసతులు కల్పించాలి.

ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని కళాశాలలకు ముందస్తు నోటీసులు అందించినట్లు ఏబీవీపీ ప్రతినిధులు తెలిపారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం చేపడుతున్న ఈ రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతం కావడానికి విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో సహకరించి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News