Penukonda: సంక్షేమంతో పాటు అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి
Penukonda: శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో రూ.4.47 కోట్ల వ్యయంతో 11 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి మంత్రి సవిత భూమిపూజ చేశారు.
Penukonda: సంక్షేమంతో పాటు అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి
పెనుకొండ: ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సవిత తెలిపారు.
ఈ సందర్భంగా పెనుకొండ నియోజకవర్గంలో గోరంట్ల లోని కదిరి మెయిన్ రోడ్ నుండి కొలింపల్లి గ్రామం వరకు 9 గ్రామాల మీదుగా సుమారు 11 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.4.47 కోట్ల వ్యయంతో భూమిపూజ కార్యక్రమం నిర్వహించిన మంత్రి సవిత.నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ సాస్కీ నిధులతో రూ.20 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
అలాగే గోరంట్ల మండలంలో సుమారు రూ.13 కోట్ల వ్యయంతో పలు రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ (OHSR) ట్యాంకుల నిర్మాణం కూడా చేపడుతున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, కూటమి ప్రభుత్వం మాత్రం సంక్షేమంతో పాటు సమగ్ర అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సవిత అన్నారు. త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు అర్హులందరికీ గృహాల కల్పన దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో తొమ్మిది సార్లు బస్సు ఛార్జీలు పెంచారని, అయితే కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామని, కాలువల మరమ్మతులు, ఇరిగేషన్ పనులను వేగవంతంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
కూటమి నాయకులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వివరించాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. అదే సమయంలో గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన పనులు, ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి ప్రజలు మరోసారి మద్దతు ఇవ్వాలని మంత్రి సవిత కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.