Kadiri: కదిరిలో ఆటోలకు క్యూఆర్ కోడ్ డిజిటల్ స్టిక్కర్ల పంపిణీ

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ప్రయాణికుల భద్రత కోసం 250 ఆటోలకు క్యూఆర్ కోడ్ డిజిటల్ స్టిక్కర్లను జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ పంపిణీ చేశారు.

Update: 2026-08-27 15:00 GMT

Kadiri: కదిరిలో ఆటోలకు క్యూఆర్ కోడ్ డిజిటల్ స్టిక్కర్ల పంపిణీ

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆటోరిక్షా డ్రైవర్లకు డిజిటల్ గుర్తింపు కల్పించే లక్ష్యంతో, ప్రజా భద్రతకు మరొక ముందడుగు వేస్తూ ఆటో డిజిటలైజేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కదిరి పట్టణంలో గురువారం కదిరి పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారు, 250 మంది ఆటో డ్రైవర్లకు డిజిటల్ ఐడీ కార్డులు, క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ..

ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేసే విధంగా ప్రతి ఆటో డ్రైవర్ వివరాలు, వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో తదితర సమాచారాన్ని భద్రత కలిగిన వెబ్ పోర్టల్‌లో నమోదు చేసి, ప్రత్యేక డిజిటల్ ఐడీతో కూడిన క్యూఆర్ కోడ్‌ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

ఆటోలో అమర్చిన క్యూఆర్ కోడ్‌ను ప్రయాణికులు స్కాన్ చేస్తే డ్రైవర్ వివరాలు, వాహన యజమాని సమాచారం, లైవ్ లొకేషన్ షేరింగ్, సమీప పోలీస్ స్టేషన్ వివరాలు, ఫిర్యాదు నమోదు, అత్యవసర కాల్, డ్రైవర్‌కు రేటింగ్ తదితర మొత్తం 8 భద్రతా సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఈ విధానం ద్వారా మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి మరింత భద్రత, విశ్వాసం కలుగుతుందని ఎస్పీ గారు పేర్కొన్నారు.

ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో లైవ్ లొకేషన్‌ను కుటుంబ సభ్యులతో షేర్ చేసుకునే అవకాశం ఉండడం వల్ల ప్రయాణికుల కుటుంబ సభ్యులకు కూడా మరింత ధైర్యం, భరోసా కలుగుతుందని తెలిపారు.

దీంతో ఆటోలపై ప్రజల్లో మరింత నమ్మకం, విశ్వాసం పెరుగుతుందని ఎస్పీ గారు పేర్కొన్నారు.

కదిరిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, గతంలో 150 ఆటోలకు, ప్రస్తుతం 250 ఆటోలకు కలిపి మొత్తం 400 ఆటోలకు క్యూఆర్ కోడ్ నంబర్లు అందజేయడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు.

అదేవిధంగా ధర్మవరంలో 550–600 ఆటోలకు, హిందూపురంలో 190 ఆటోలకు క్యూఆర్ కోడ్ ప్రక్రియ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.

ఇంకా సుమారు 300 ఆటోలకు క్యూఆర్ కోడ్ నంబర్లు అందజేయాల్సి ఉందని, వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.

మిగిలిన వారు కూడా సెప్టెంబర్ 15 లోపు క్యూఆర్ కోడ్ నమోదు చేసుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్పీ గారు తెలియజేశారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆటో యూనియన్లు, డ్రైవర్లు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ గారు కోరారు. నిర్ణీత గడువులోగా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయని వాహనాలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సురక్షిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లా

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు మరింత భద్రత కల్పిస్తూ శ్రీ సత్యసాయి జిల్లాను సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని ఎస్పీ గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీమతి అంకిత సురాన, ఐపీఎస్ గారు, డి.ఎస్.పి శివన్నారాయణ స్వామి, సీఐలు వెంకటేశ్వర్లు, లక్ష్మీకాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, నాగేంద్ర, రవాణా శాఖ అధికారులు, ఎస్సైలు, పోలీస్ మరియు రవాణా శాఖ సిబ్బంది, ఆటో యూనియన్ ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Tags:    

Similar News