Amaravati: ఏపీఎన్‌ఆర్‌టీఎస్ సేవలను వివరించిన మంత్రి కొండపల్లి!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి, మహిళా సాధికారత, ప్రవాసాంధ్రుల సంక్షేమంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
Amaravati: ఏపీఎన్‌ఆర్‌టీఎస్ సేవలను వివరించిన మంత్రి కొండపల్లి!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక సంస్కరణలను అమలు చేసింది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME) రంగం, మహిళా సాధికారత కోసం పనిచేసే సెర్ప్ (SERP), ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఏపీఎన్‌ఆర్‌టీఎస్ (APNRTS) విభాగాల్లో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. రాష్ట్ర MSME, SERP, NRI ఎంపవర్మెంట్ & రిలేషన్స్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించిన వివరాలు రాష్ట్ర అభివృద్ధి దిశను ప్రతిబింబిస్తున్నాయి.
*ఆదాయం పెరిగితేనే రాష్ట్ర అభివృద్ధి*
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేవలం పెద్ద పరిశ్రమలు మాత్రమే కాకుండా ప్రతి కుటుంబ ఆదాయం పెరగడం కూడా అత్యంత కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణ కుటుంబాల ఆదాయం పెరిగితే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వినియోగం పెరిగితే స్థానిక వ్యాపారాలు బలపడతాయి. ఫలితంగా మండలాలు, జిల్లాలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఈ భావనతోనే పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి, ఆదాయ వృద్ధి అనే నాలుగు ప్రధాన సూత్రాలపై ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
*మూడు శక్తివంతమైన స్తంభాలపై అభివృద్ధి యజ్ఞం*
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని మూడు ప్రధాన రంగాల చుట్టూ కేంద్రీకరించింది. MSMEల ద్వారా పారిశ్రామికాభివృద్ధి, SERP ద్వారా మహిళా సాధికారత, APNRTS ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం అనే మూడు స్తంభాలపై అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తోంది.ప్రతి కుటుంబానికి ఆదాయం, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన, ప్రతి ప్రవాసాంధ్రుడికి భరోసా కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ దిశగా చేపట్టిన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి.
*ఎంఎస్‌ఎంఈ రంగానికి కొత్త ఊపు*
రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 55 వేల సూక్ష్మ పరిశ్రమలు, 8 వేల చిన్న పరిశ్రమలు, వెయ్యికి పైగా మధ్యతరహా పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం.ప్రస్తుతం సేవారంగం 49 శాతం, వాణిజ్యరంగం 28 శాతం, తయారీ రంగం 23 శాతం వాటాతో కొనసాగుతోంది. అయితే తయారీ రంగాన్ని మరింత విస్తరించి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
*20కి పైగా రంగాల కోసం ప్రత్యేక విధానాలు*
పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగాల వారీగా ప్రత్యేక పారిశ్రామిక విధానాలను అమలు చేస్తోంది. టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, మెడికల్ డివైసెస్, డిఫెన్స్, ఏరోస్పేస్, లాజిస్టిక్స్ వంటి 20కి పైగా రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహక విధానాలు రూపొందించింది.
ఈ విధానాల ద్వారా దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఏర్పడింది.ప్రతి నియోజకవర్గానికి ఎంఎస్‌ఎంఈ పార్క్ లక్ష్యం పరిశ్రమలు కేవలం నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా MSME పార్కుల అభివృద్ధి కార్యక్రమం చేపట్టింది.
ఇప్పటివరకు 792 పరిశ్రమలకు భూ కేటాయింపులు జరిగాయి. వీటి ద్వారా లక్షకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. గ్రామీణ యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు లభించే పరిస్థితులు సృష్టించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
*ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీతో కొత్త అవకాశాలు*
దేశంలోనే వినూత్నంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా ప్రైవేట్ భూస్వాములు తమ భూములను పారిశ్రామిక పార్కులుగా అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించింది.ఈ విధానం ద్వారా దాదాపు రూ.1,900 కోట్ల పెట్టుబడులు, 16,500కు పైగా ఉపాధి అవకాశాలు సృష్టించబడే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
*సిక్ యూనిట్లకు పునర్జీవం*
ఆర్థిక ఇబ్బందులతో మూతపడిన లేదా ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలకు పునరుద్ధరణ అవకాశాలు కల్పించేందుకు MSME Revival Policy అమలు చేస్తున్నారు.యాజమాన్య మార్పిడి, పునర్వ్యవస్థీకరణ, పెట్టుబడుల సమీకరణ, సులభ నిష్క్రమణ వంటి అవకాశాలను ఈ విధానం కల్పిస్తోంది. దీంతో అనేక పరిశ్రమలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఏర్పడుతోంది.
*రూ.1.90 లక్షల కోట్ల ఆర్థిక మద్దతు*
MSMEల బలోపేతానికి గత రెండేళ్లలో రూ.1.90 లక్షల కోట్లకు పైగా బ్యాంకు రుణాలు అందించబడ్డాయి. CGTMSE పథకం ద్వారా రూ.22,448 కోట్ల కొలేటరల్-ఫ్రీ రుణాలు, ప్రధాన్ మంత్రి ముద్ర యోజన ద్వారా రూ.40 వేల కోట్లకు పైగా రుణాలు మంజూరు చేశారు.అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల లోన్ గ్యారంటీ ఫండ్ ఏర్పాటు చేసి చిన్న పరిశ్రమలకు రుణాల లభ్యతను మరింత సులభతరం చేసింది.
*యువ పారిశ్రామికవేత్తలకు CMAP తో చేయూత*
యువతలో వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు రూ.300 కోట్లతో సీఎం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అడ్వాన్స్‌మెంట్ ప్రోగ్రామ్ (CMAP) అమలు చేస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా వేలాది కొత్త వ్యాపారాలు ప్రారంభం కావడంతో పాటు 17,600కు పైగా ఉద్యోగ అవకాశాలు సృష్టించబడనున్నాయి.డిజిటల్ ఎంఎస్‌ఎంఈ – గ్లోబల్ ఎంఎస్‌ఎంఈ
ప్రపంచ స్థాయి పోటీతత్వం కలిగిన MSMEలను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.
డిజిటల్ చెల్లింపులు, ERP సిస్టమ్స్, ఈ-కామర్స్, ఇన్వాయిస్ ఫైనాన్సింగ్, ఆన్‌లైన్ వివాద పరిష్కారం, ఎగుమతి అవకాశాలు వంటి అంశాల్లో పరిశ్రమలకు సమగ్ర మద్దతు అందిస్తోంది. దీంతో చిన్న పరిశ్రమలు కూడా ప్రపంచ మార్కెట్లను చేరుకునే అవకాశం పొందుతున్నాయి.
*మహిళా సాధికారతకు స్వర్ణయుగం*
గ్రామీణ మహిళలను సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా అభివృద్ధి భాగస్వాములుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా మహిళా స్వయం సహాయక సంఘాలకు గత రెండేళ్లలో రూ.63 వేల కోట్లకు పైగా బ్యాంకు రుణాలు అందించబడ్డాయి.శ్రీనిధి ద్వారా రూ.9,300 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసి మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాలకు మద్దతు ఇచ్చారు.
*మహిళా పారిశ్రామికవేత్తల సైన్యం*
మహిళలను ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.గత ఏడాది లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయగా, ఈ ఏడాది మరో ఐదు లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.‘స్వయం ఏపీ’తో మహిళల ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్
స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లేందుకు ‘స్వయం AP’ బ్రాండ్‌ను ప్రభుత్వం ప్రారంభించింది.మొదటి దశలో వందకు పైగా ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానున్నారు. గ్రామీణ మహిళల ఆదాయాన్ని పెంచడం, వారి ఉత్పత్తులకు గ్లోబల్ గుర్తింపు తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం.
*సామాజిక భద్రతలో ఆదర్శ రాష్ట్రం*
రాష్ట్రంలో ప్రస్తుతం 62 లక్షలకు పైగా లబ్ధిదారులకు సామాజిక భద్రతా పెన్షన్లు అందుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం సంవత్సరానికి రూ.33 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది.సాధారణ పెన్షన్‌ను రూ.4 వేలకు, వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు మరియు పక్షవాత బాధితుల పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచడం ద్వారా బలహీన వర్గాలకు ప్రభుత్వం మరింత భరోసా కల్పించింది.
*ప్రవాసాంధ్రులకు APNRTS అండ*
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు APNRTS ద్వారా వివిధ సేవలు అందుతున్నాయి. గత రెండేళ్లలో 1,376 ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు DGP NRI సెల్ ద్వారా వచ్చిన 398 కేసులను కూడా పరిష్కరించారు.
విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న 104 మంది ప్రవాసాంధ్రులను స్వదేశానికి రప్పించడం జరిగింది. అదనంగా వేలాది మందికి తిరుమల సహా ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక దర్శన సౌకర్యాలు కల్పించారు.
*అభివృద్ధి – సంక్షేమం – సాధికారత సమన్వయం*
గత రెండేళ్లలో MSME, SERP, APNRTS రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా ఉపాధి సృష్టి, ఆదాయ వృద్ధి, మహిళా సాధికారత, పారిశ్రామికాభివృద్ధి, ప్రవాసాంధ్రుల భద్రత వంటి అంశాలను సమగ్రంగా కలుపుకుని ముందుకు సాగాయి. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి, మహిళా ఆర్థిక స్వావలంబన, సామాజిక భద్రత, ప్రవాసాంధ్రుల సంక్షేమం అనే ఆరు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను సమగ్రాభివృద్ధి దిశగా నడిపిస్తోందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.