Amaravati: 'అన్నదాత సుఖీభవ' వివరాలు వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడు!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతకు కూటమి ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచింది. ‘
Amaravati: 'అన్నదాత సుఖీభవ' వివరాలు వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడు!
Amaravati: రాష్ట్రంలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, రైతు కుటుంబాల ఆర్థిక భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతు ప్రయోజనాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. రైతు కష్టానికి విలువ ఇవ్వడం, రైతు కుటుంబానికి భరోసా కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
*రైతు ఆత్మహత్యలపై వాస్తవాలేంటి?*
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల అంశంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న వార్తల్లో నిజం లేదన్నారు. త్రిసభ్య కమిటీ పరిశీలన తర్వాత గత రెండేళ్లలో 148 కేసులు మాత్రమే రైతు ఆత్మహత్యలుగా నిర్ధారణ అయ్యాయని వెల్లడించారు. వ్యవసాయ కారణాలతో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నామని చెప్పారు.
*ఇప్పటికే 148 కేసుల్లో 112 కుటుంబాలకు*
పరిహారం మంజూరు చేసేందుకు బిల్లులు సమర్పించగా, మిగిలిన కేసులను కూడా త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో పరిహారం అందని 81 మంది రైతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం రూ.5.67 కోట్ల ఆర్థిక సహాయం అందించిందని పేర్కొన్నారు.
*అన్నదాత సుఖీభవతో రైతుకు ఆర్థిక భరోసా*
రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ప్రతి అర్హ రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతోందన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా రూ.6 వేలు అందిస్తోందని చెప్పారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 46.86 లక్షల రైతు కుటుంబాలకు మొత్తం రూ.8,985.41 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.6,560.18 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2,425.23 కోట్లు అని తెలిపారు.
*ధాన్యం బకాయిలకు చెక్*
గత ప్రభుత్వ హయాంలో రైతులకు చెల్లించాల్సిన ధాన్యం కొనుగోలు బకాయిలు భారీగా పేరుకుపోయాయని మంత్రి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,674.47 కోట్ల పాత బకాయిలను పూర్తిగా చెల్లించి రైతులకు న్యాయం చేసిందన్నారు.
రైతు శ్రమకు తగిన విలువ దక్కాలని, రైతు ఉత్పత్తి సంపదగా మారాలని ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతు కష్టార్జిత ఆదాయం నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
*ధరల స్థిరీకరణ నిధితో లక్ష మంది రైతులకు ఊరట*
మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం అందించింది. గత బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు కేటాయించినప్పటికీ, రైతుల ప్రయోజనాల దృష్ట్యా రూ.588 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు.తోతాపూరి మామిడి రైతులకు రూ.190 కోట్లు, కడప, కర్నూలు జిల్లాల ఉల్లి రైతులకు కొనుగోలు చర్యల కోసం రూ.17.56 కోట్లు మంజూరు చేశారు. ఉల్లి పంట నష్టపరిహారాన్ని హెక్టారుకు రూ.25 వేల నుంచి రూ.50 వేలకు పెంచి రూ.128.33 కోట్లు చెల్లించారు. అలాగే పొగాకు రైతులకు రూ.240 కోట్లు, కోకో రైతులకు రూ.12 కోట్లు అందజేసి ప్రభుత్వం అండగా నిలిచింది.
*ఉచిత విద్యుత్‌తో సాగుకు బలమైన మద్దతు*
వ్యవసాయ రంగానికి విద్యుత్ కీలకమని భావించిన ప్రభుత్వం 22.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు రోజుకు 9 గంటల పాటు నిరంతర పగటి ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ పథకం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13,241.17 కోట్ల సబ్సిడీ భారం ప్రభుత్వం భరిస్తోంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత 68,988 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. రైతుల సాగు ఖర్చులు తగ్గించడంలో ఈ చర్యలు కీలకంగా మారాయని పేర్కొన్నారు.
*రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యం*
ఉద్యానవన రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును కేంద్ర సహకారం, ప్రైవేటు పెట్టుబడులతో అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.పండ్ల ఉత్పత్తిలో 15.6 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉందన్నారు. ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమోటా, కొబ్బరి ఉత్పాదకతలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. మిరప ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు.
*కోకో సిటీతో కొత్త పారిశ్రామిక అవకాశాలు*
పశ్చిమ గోదావరి జిల్లాను కోకో హబ్‌గా అభివృద్ధి చేసి ‘కోకో సిటీ’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా చాక్లెట్ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడంతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం కల్పించే అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.
అలాగే పామాయిల్ తోటల విస్తరణ కోసం 2026-27 బడ్జెట్‌లో రూ.204 కోట్లు ప్రతిపాదించినట్లు వెల్లడించారు.
*సూక్ష్మసేద్యంలో దేశంలోనే నంబర్-1*
సూక్ష్మసేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా 5.5 లక్షల ఎకరాలను సూక్ష్మసేద్య పరిధిలోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.
నీటి వినియోగాన్ని తగ్గిస్తూ అధిక దిగుబడులు సాధించడంలో సూక్ష్మసేద్యం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. భవిష్యత్తులో మరింత విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.
*ఎరువుల కొరత లేదంటున్న ప్రభుత్వం*
ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత రాష్ట్రంలో లేదని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.
జూన్ 8 నుంచి జూన్ 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా 95,506 మంది రైతులకు 4,77,501 ఎరువుల బస్తాలు విక్రయించినట్లు తెలిపారు. ఇందులో 3,56,916 యూరియా బస్తాలు, 1,20,585 డీఏపీ బస్తాలు ఉన్నాయని వెల్లడించారు.గతంలో ఎరువుల అక్రమ విక్రయాలు జరిగాయని ఆరోపించిన మంత్రి, ప్రస్తుతం ప్రత్యేక యాప్ ద్వారా ఎరువుల పంపిణీని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
*రైతే కేంద్రబిందువుగా ప్రభుత్వ పాలన*
రైతు సంక్షేమం, గిట్టుబాటు ధరలు, నష్టపరిహారం, విద్యుత్, సాగునీరు, మార్కెటింగ్ సదుపాయాలు వంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను గుర్తించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతు కష్టానికి విలువ, రైతు కుటుంబానికి భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.